అసోంలో పొడిచిన పొత్తు... 92 స్థానాల్లో బీజేపీ పోటీ

ABN , First Publish Date - 2021-03-05T16:43:41+05:30 IST

అసోంలో పొత్తు పొడిచింది. బీజేపీ దాని మిత్రపక్షాల మధ్య సీట్ల పంపిణీ విషయంలో స్పష్టత వచ్చేసింది. మొత్తం 126 స్థానాలుండగా.... 92 స్థానాల్లో

అసోంలో పొడిచిన పొత్తు... 92 స్థానాల్లో బీజేపీ పోటీ

గౌహతి : అసోంలో పొత్తు పొడిచింది. బీజేపీ దాని మిత్రపక్షాల మధ్య సీట్ల పంపిణీ విషయంలో స్పష్టత వచ్చేసింది. మొత్తం 126 స్థానాలుండగా.... 92 స్థానాల్లో బీజేపీ బరిలోకి దిగనుంది. ఇక అసోం గణ పరిషద్ (ఏజీపీ) 26 స్థానాల్లో పోటీకి దిగనుంది. మరో 8 స్థానాల్లో బీజేపీ మిత్ర పక్షాలు బరిలోకి దిగుతున్నాయి. అయితే మరో చిన్న పార్టీ కూడా బీజేపీలో విలీనం కానుంది. ఆ పార్టీకి చెందిన ఒకరిద్దరు బీజేపీ గుర్తుతోనే బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే 84 స్థానాల అభ్యర్థులను కూడా బీజేపీ ఖరారు చేసింది. శుక్రవారం సాయంత్రం ఆ జాబితాను విడుదల చేయనుంది. అయితే ఏజీపీ అధ్యక్షుడు, రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రపుల్ల కుమార్ మహంతా ఈసారి బరిలోకి దిగరని పార్టీ పేర్కింది. అనారోగ్య కారణాల రీత్యా ఆయన ఢిల్లీలో చికిత్స పొందుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ మహంతా గనక పోటీలో లేకపోతే... పార్టీ రెండుగా చీలే ప్రమాదముందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏజీపీ రాజకీయ భవితవ్యం ఏంటన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఈసారి తిరిగి అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ బీజేపీకి ఘాటు కౌంటర్ ఇచ్చింది. గతంలో తాము బీజేపీతో కలిసి ఉండేవారమని, ప్రస్తుతం కాంగ్రెస్‌తో వెళ్తున్నామని, మేము లేనిది బీజేపీ ఎలా గెలుస్తుందో చూస్తామని సవాల్ విసురుతోంది. 

Updated Date - 2021-03-05T16:43:41+05:30 IST