రాజస్థాన్‌ రాజకీయ యవనికపై కీలక ఘట్టం

ABN , First Publish Date - 2020-08-14T07:09:28+05:30 IST

రాజస్థాన్‌లో తిరుగుబాట్లు, రిసార్టులు, కోర్టులు, వ్యక్తిగత దూషణలు, కొనుగోళ్లు.. అంటూ కొనసాగిన రాజకీయ హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. వివాదానికి మూలకారకులైన సీఎం గెహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ల మధ్య సయోధ్య కుదరడంతో చిరునవ్వులు చిందిస్తూ కరచాలనం చేసుకున్నారు...

రాజస్థాన్‌ రాజకీయ యవనికపై కీలక ఘట్టం

  • నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతాం: బీజేపీ
  • మేమే విశ్వాస తీర్మానం పెడతాం: కాంగ్రెస్‌ 

జైపూర్‌: రాజస్థాన్‌లో తిరుగుబాట్లు, రిసార్టులు, కోర్టులు, వ్యక్తిగత దూషణలు, కొనుగోళ్లు.. అంటూ కొనసాగిన రాజకీయ హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. వివాదానికి మూలకారకులైన సీఎం గెహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ల మధ్య సయోధ్య కుదరడంతో చిరునవ్వులు చిందిస్తూ కరచాలనం చేసుకున్నారు. సీఎం గెహ్లోత్‌ నివాసంలో జరిగిన కాంగ్రెస్‌ శాసనసభా పక్షం సమావేశంలో వీరిద్దరూ ‘చేతులు’ కలిపారు. ‘సోనియా, రాహుల్‌ నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్‌ పోరాటం చేస్తోంది. నెల రోజులుగా కాంగ్రెస్‌ పార్టీలో తలెత్తిన అంతర్గత అసమ్మతిని మరిచిపోయి రాష్ట్రం, దేశం, ప్రజల కోసం కలిసి ముందుకెళదాం’ అని గెహ్లోత్‌ ట్వీట్‌ చేశారు.


అందుకు అనుగుణంగానే సీఎల్పీ భేటీకి వచ్చిన సచిన్‌ను సాదరంగా ఆహ్వానించిన గెహ్లోత్‌.. ఆయన్ను ఆత్మీయంగా పలకరించారు. అయితే  రాజస్థాన్‌ బీజేపీ గెహ్లోత్‌ సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించింది. గురువారమిక్కడ జరిగిన బీజేఎల్పీ సమావేశంలో గెహ్లోత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించినట్లు ప్రతిపక్ష నేత గులాబ్‌ చంద్‌ కటారియా చెప్పారు. మాజీ సీఎం వసుంధర రాజే, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. శుక్రవారం నుంచి జరగనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు కటారియా తెలిపారు.


రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు, దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులు, ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నారనే ఆరోపణలపై ఎస్‌వోజీ చేసిన అరెస్టు అంశాలను సభలో ప్రస్తావిస్తామని కటారియా మీడియాకు వివరించారు. అయితే సభలో తామే బలపరీక్షకు వెళ్తామని అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. స్వయంగా ముఖ్యమంత్రే సభలో విశ్వాస పరీక్షకు తీర్మానాన్ని ప్రవేశపెడితే ఇతర సభ్యులు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానాలను పరిగణనలోకి తీసుకోరు. 


ఇద్దరు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ ఎత్తివేత

సీఎం అశోక్‌ గెహ్లోత్‌కు మరో ఊరట లభించింది. ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రె్‌సలో విలీనం చేసుకున్న అంశంపై ప్రస్తుతం తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరుపుతున్న రాజస్థాన్‌ హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. తమ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలన్న బీజేపీ అభ్యర్థనను తోసిపుచ్చింది. మరోవైపు గెహ్లోత్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భన్వరిలాల్‌ శర్మ, విశ్వేంద్ర సింగ్‌పై విధించిన సస్పెన్షన్‌ను పార్టీ ఎత్తేసింది.


ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నారన్న ఆరోపణలతో గత నెల 17న వీరి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దుచేశారు. గెహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ మధ్య సయోధ్య కుదిరిన నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను రద్దుచేశారు. కాగా.. సచిన్‌ పైలట్‌ లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేయాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏఐసీసీని ఆదేశించారు. 


Updated Date - 2020-08-14T07:09:28+05:30 IST