బీజేపీ,టీఆర్‌ఎస్‌ ఒక్కటే

ABN , First Publish Date - 2021-09-19T05:21:02+05:30 IST

బీజేపీ,టీఆర్‌ఎస్‌ ఒక్కటే

బీజేపీ,టీఆర్‌ఎస్‌ ఒక్కటే
సమావేశంలో మాట్లాడుతున్న మాణిక్కంఠాకూర్‌, పక్కన నేతలు బోసురాజు, మహేశ్‌గౌడ్‌, ఎం.రమేశ్‌, రామ్మోహన్‌రెడ్డి, జగదీష్‌ తదితరులు

  • సీఎం కేసీఆర్‌ది దోపిడీ ప్రభుత్వం 
  • రాష్ట్రంలో కాంగ్రెస్‌కు  అనుకూల పవనాలు
  • 2023లో సోనియమ్మ రాజ్యం ఖాయం 
  • తెలంగాణలో 78  స్థానాలు గెలుస్తాం 
  • పార్టీ బలోపేతానికే నియోజకవర్గాలు,   
  • మండలాల వారీగా సమీక్షలు
  • ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల 
  • ఇన్‌చార్జి మాణిక్కం ఠాకూర్‌ 

పరిగి: బీజేపీ, టీఆర్‌ఎ్‌సలు ఒక్కటేనని, సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో మోదీతో దోస్తీ కడతాడని, హైదరాబాద్‌ వచ్చి దుమ్మెత్తిపోస్తాడని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కంఠాకూర్‌ అన్నారు. వికారాబాద్‌ జిల్లా పరిగిలోని స్వాగత్‌ హోటల్‌లో శనివారం వికారాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన చేవెళ్ల పార్లమెంటరీ విస్తృతస్థాయి సమావేశంలో ఏఐసీసీకార్యదర్శి బోసురాజు, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌గౌడ్‌, ఉపాధ్యక్షుడు ఎం.రమేశ్‌, కార్యదర్శి జగదీష్‌, పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డిలు హాజరయ్యారు. ఈసందర్భంగా ఠాకూర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ నాటకాన్ని గమనిస్తున్నారని అన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీల మ్యాచ్‌ఫిక్సింగ్‌ ప్రజలకు అర్థమైపోయిందన్నారు. బీజేపీ మతం పేరిట రెచ్చగొట్టడం, టీఆర్‌ఎస్‌ మోసపూరిత మాటలు ఎంతకాలం ప్రజలు నమ్మరని అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ అయితే.. అనుభవిస్తున్నది, దోచుకుంటున్నది కేసీఆర్‌ కుటుంబమేనని ఆరోపించారు.  రాష్ట్రంలో కాంగ్రె్‌సకు బలమైన అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు.    రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కొత్త టీం బాగా పని చేస్తోందని, 2023లో  78 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని, సోనియమ్మ రాజ్యం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ 19 వరకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గ, మండల స్థాయి సమావేశాలు పూర్తి చేస్తామన్నారు. ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు మాట్లాడుతూ, కాంగ్రె్‌సకు పూర్వవైభవం తీసుకోచ్చేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీకి వ్యక్తులు ముఖ్యమని, వ్యక్తుల కంటే పార్టీ గొప్పదన్నారు. డీసీసీ అధ్యక్షుడు, మాజీఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ  వికారాబాద్‌ జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్‌  కైవసం చేసుకుంటుందన్నారు. సమావేశంలో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌, పీసీసీ కార్యదర్శులు రాచమల్ల సిద్దేశ్వర్‌, మధుసూదన్‌రెడ్డి, చేవెళ్ల ఇన్‌చార్జి వసంతం, డీసీసీ ప్రధానకార్యదర్శులు కె.హన్మంత్‌ముదిరాజ్‌, ఎం.లాల్‌కృష్ణప్రసాద్‌, ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌, ఏడు నియోజకవర్గాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

మండలాల వారీగా సమీక్ష 

చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని పరిగి,వికారాబాద్‌, తాండూరు, చేవెళ్ల, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలోని మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. అయితే మొదటగా నిర్వహించిన సమావేశంలో ఠాకూర్‌ పార్టీ బలోపేతం, విపక్షాల తీరును తిప్పికొట్టే ఆంశాలపై మాట్లాడారు. భోజనం తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల వారీగా సమీక్షలు జరిపారు. డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో తన నివాసం నుంచి టెలిఫోన్‌ ఎక్స్ఛెంజ్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. రామ్మోహన్‌రెడ్డి బైక్‌పై తన కార్యకర్తలతో కలిసి రంగాపూర్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడ కాంగ్రెస్‌ నేతలు స్వాగతం పలికారు. ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

Updated Date - 2021-09-19T05:21:02+05:30 IST