యూపీలో బీజేపీ పేకమేడల్లా కూలిపోతుంది: వీరప్ప మొయిలీ

ABN , First Publish Date - 2021-09-07T17:07:21+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అద్భుతమైన పనీతీరు..

యూపీలో బీజేపీ పేకమేడల్లా కూలిపోతుంది: వీరప్ప మొయిలీ

బెంగళూరు: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అద్భుతమైన పనీతీరు ప్రదర్శిస్తున్నారని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని బీజేపీ పేకముక్కల్లా కూలిపోనుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ జోస్యం చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు తమ ముఖ్యమంత్రి కంటే ప్రియాంక గాంధీకే ప్రాధాన్యం ఇస్తున్నారని మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు.


''ఉత్తరప్రదేశ్‌కు వచ్చేసరికి తాము చాలా బలంగా ఉన్నామని  బీజేపీ అనుకుంటోంది. అయితే, యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో బీజేపీ పేకమేడల్లా కూలిపోనుంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు, యూపీలో నిరుద్యోగిత పెరగడం వంటి కేంద్ర పథకాలే ఇందుకు కారణాలు కానున్నాయి'' అని మొయిలీ అన్నారు. కేవలం నినాదాలతో ప్రజలను మభ్యపెట్టలేరని, ఒకసారి ప్రజలను ఫూల్స్ చేయవచ్చు కానీ ప్రతిసారి సాధ్యం కాదని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ అత్యద్భుత పనితీరు ప్రదర్శిస్తున్నారని, ప్రజలు కూడా దివగంత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఆమెలో చూసుకుంటున్నారని అన్నారు. యోగి కంటే ఆమెకే ఎక్కువ ప్రజాదరణ లభించడం ఖాయమన్నారు.


పంజాబ్, ఛత్తీస్‌గఢ్ మళ్లీ కాంగ్రెస్‌కే...

పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని మెయిలీ ధీమా వ్యక్తం చేశారు. పంజాబ్‌కు సంబంధించి అధిష్టానం సకాలంలో సరైన చర్యలు తీసుకుందని, నవజ్యోత్ సింగ్ సిద్ధూను పిలిపించి అతన్ని పీసీసీ అధ్యక్షుడిని చేయడానికి అంగీకరించిందని, పీసీసీ అధ్యక్షుడైన తర్వాత కూడా ఆయన ఎంతో క్రమశిక్షణతో పని చేస్తున్నారని, పార్టీ గుడ్‌విల్‌ను కెప్టెన్ అమరీందర్ సింగ్ ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. సిద్ధూకు పదోన్నతి కల్పించి కాంగ్రెస్ పొరపాటు చేసిందా అని అడిగినప్పుడు, సిద్ధూ రాంగ్ ఛాయెస్ కాదని, కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ పెద్దమనసేనని, ఎవరినీ వదులుకోకుండా అందరికీ ప్రాధాన్యం కల్పించడంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం చక్కటి పాలన అందిస్తోందని, చాలా మంచి నాయకత్వం ఉందని చెప్పారు. తిరిగి కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వస్తుందని మొయిలీ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2021-09-07T17:07:21+05:30 IST