రామాలయం పేరిట బీజేపీ కార్యకర్త ఓట్ల అభ్యర్థన..వీడియో వైరల్

ABN , First Publish Date - 2020-09-21T17:53:55+05:30 IST

ఉప ఎన్నికల్లో అయోధ్య రామాలయం పేరిట ఓ మహిళను కమలం గుర్తుకు ఓటు వేయమని అభ్యర్థిస్తున్న బీజేపీ కార్యకర్త వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది....

రామాలయం పేరిట బీజేపీ కార్యకర్త ఓట్ల అభ్యర్థన..వీడియో వైరల్

భోపాల్ (మధ్యప్రదేశ్): ఉప ఎన్నికల్లో అయోధ్య రామాలయం పేరిట ఓ మహిళను కమలం గుర్తుకు ఓటు వేయమని అభ్యర్థిస్తున్న బీజేపీ కార్యకర్త వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లా సుర్కి అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారపర్వంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివాదం రేకెత్తించింది. సాగర్ జిల్లాకు చెందిన జైసింగ్ నగర్ నివాసి అయిన బీజేపీ కార్యకర్త నరేంద్ర అతియా ఓ మహిళకు రాముడి చిత్రం ఉన్న క్యాలండరు చూపిస్తూ ‘‘మోదీజీ అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తున్నారు...మీరు ఉప ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి ఆలయంలో ఒక ఇటుకను అమర్చండి. ఓటుతోపాటు మీరు పుణ్యం కూడా పొందుతారు’’ అని వీడియోలో కోరారు. సుర్కి జిల్లా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రవాణ శాఖ మంత్రి గోవింద్ సింగ్ రాజ్ పుత్ పోటీ చేస్తుండగా,ఆయనకు మద్ధతుగా అతియా ఒక గ్రామంలో ప్రచారం చేస్తున్నపుడు ఈ వీడియో చిత్రీకరించారని స్థానికులు తెలిపారు. 



అభివృద్ధి పనులు చేపట్టడంలో విఫలమైనందువల్ల బీజేపీ రాముడి పేరిట ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఓడిపోతారని గ్రహించినందువల్లే రాముడి పేరును ఉపయోగించి ఓట్లు పొందాలని చూస్తున్నారని, దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి అజయ్ సింగ్ యాదవ్ డిమాండ్ చేశారు. 


ఎన్నికల సంఘం ప్రకటించినట్లు నవంబరు చివరి నాటికి 28 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీలో చేరేందుకు వీలుగా మార్చి నెలలో రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేలలో గోవింద్ సింగ్ రాజ్ పుత్ కూడా ఉన్నారు. వీడియో వైరల్ అయ్యాక దీనిపై మాట్లాడేందుకు అతియా నిరాకరించారు. ఈ వీడియోపై మంత్రి గోవింద్ సింగ్ రాజ్ పుత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.రాముడి విశ్వాసం విషయంలో బీజేపీ కార్యకర్త ఉద్వేగానికి లోనై ఉంటారని బీజేపీ రాష్ట్ర ప్రతినిధి ధైర్యవర్థన్ సింగ్ చెప్పారు. 


Updated Date - 2020-09-21T17:53:55+05:30 IST