Goa: ‘ఆప్’ వలంటీర్లపై బీజేపీ కార్యకర్తల కోడిగుడ్ల దాడి

ABN , First Publish Date - 2021-07-11T01:45:33+05:30 IST

భారతీయ జనతాపార్టీ నేత విల్‌ఫ్రెడ్ డి’సా మద్దతుదారులు గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వలంటీర్లపై

Goa: ‘ఆప్’ వలంటీర్లపై బీజేపీ కార్యకర్తల కోడిగుడ్ల దాడి

గోవా: భారతీయ జనతాపార్టీ నేత విల్‌ఫ్రెడ్ డి’సా మద్దతుదారులు గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వలంటీర్లపై కోడిగుడ్లతో దాడిచేశారు. సరిగ్గా మూడేళ్ల క్రితం పార్టీ ఫిరాయింపు ద్వారా అప్పటి ప్రభుత్వాన్ని కూల్చిన 10 మంది కాంగ్రెస్ శాసన సభ్యులకు ‘వార్షికోత్సవ’ కేకులను ఇచ్చేందుకు ఆప్ వలంటీర్లు ప్రయత్నించారు. ఈ పదిమందిలో డి’సా కూడా ఉన్నారు. వలంటీర్లను అడ్డుకున్న డి’సా మద్దతుదారులు వారిపై కోడిగుడ్లతో దాడిచేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 


2019లో బీజేపీలోకి ఫిరాయించిన రోజును పురస్కరించుకుని 12 మంది ఆప్ వలంటీర్లు  కేకుతో డి’సా నివాసానికి వెళ్లడంతో ఈ ఘర్షణ ప్రారంభమైంది. అక్కడే ఉన్న డి’సా మద్దతుదారులు వలంటీర్లను అడ్డుకుని బూతులు తిడుతూ, పెద్దగా కేకలు వేస్తూ వారితో ఘర్షణకు దిగారు. ఆపై కోడిగుడ్లతో దాడిచేశారు. ప్రస్తుతం గోవాలో ఉన్న ఆప్ నేత అతిషి మర్లేనా ఈ ‘ఫిరాయింపు వార్షికోత్సవం’ ప్రచారాన్ని ప్రారంభించారు. అలాగే, 2022 ఎన్నికలను పురస్కరించుకుని ‘గోవా రాజకీయాలను ప్రక్షాళన చేద్దాం’ పేరుతో ఆప్ మరో కార్యక్రమాన్ని ప్రారంభించింది. 

Updated Date - 2021-07-11T01:45:33+05:30 IST