Abn logo
Sep 19 2021 @ 01:09AM

బీజేపీవి పగటి కలలు

సమావేశంలో మాట్లాడుతున్న శాసనమండలి మాజీ చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి

  ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ 16ముక్కలు అవుతుంది

  మండలి మాజీ చైౖర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

నల్లగొండ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశానికే ఆదర్మంగా నిలిచారని, అధికారంలోకి వస్తామని బీజేపీ వాళ్లు పగటి కలలు కంటున్నారని తెలంగాణలో ఆ పార్టీ స్థానం లేదని మండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. శనివారం ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడారు. కాషాయ నేతలు సీఎం కేసీఆర్‌ కుటుంబంపై అడ్డగోలుగా మాట్లాడటం తగదన్నారు. కేటీఆర్‌, కవిత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నారని, రాష్ట్ర సాధనలో వారి పాత్ర ఉందన్నారు. జనసంఘ్‌ పుట్టింది 1951లో, బీజేపీ పుట్టింది 1980లో అటువంటి పార్టీకి  తెలంగాణ విలీన దినోత్సవానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. సెప్టెంబరు 17ను బీజేపీ ఒక ఆటవస్తువులాగా ఆడుకుంటోందని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట ఘట్టంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌కు బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రధాని నెహ్రూ ప్రభుత్వంలో పటేల్‌ హోం మంత్రి, పటేల్‌కు బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. దిక్కుదివాన లేక పటేల్‌ను తమ నాయకుడిగా ముద్రవేసుకునే కుటిల ప్రయత్నం బీజేపీ చేస్తోందన్నారు. ఎంఐఎం పార్టీని బూచీగా చూపి హిందువులను మభ్యపెట్టే ప్రయత్నం ఆ పార్టీ చేస్తోందన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం అమలు గురించి కనీసం బీజేపీ నేతలు మాట్లాడటం లేదన్నారు. సర్దార్‌ పటేల్‌ నిజాం ప్రభువును పిలిచి చర్చలు జరిపి విలీనం చేసి, నిజాంను రాజ్‌గౌర్‌గా ప్రకటించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సీఎం కేసీఆర్‌ గోల్కొండ కోటపైనే జాతీయ జెండా ఎగురవేస్తున్నారన్నారు. ఇక బీజేపీ అధికారంలోకి వచ్చాక గోల్కొండ కోటపైన జెండా ఎగురవేసేది ఎక్కడిదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం సెప్టెంబరు 17 విమోచన దినోత్సవంపైనే దాంతో తెలంగాణ ప్రజలకు కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమైనా ఉందా? అని గుత్తా ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇద్దరు ఎంపీలు బీజేపీ నుంచి ఉన్నారని, ఏనాడైనా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. బ్లాక్‌ మెయిల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ రేవంత్‌ అని, ఆయన నోటికి అడ్డూ, అదుపూ లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్‌, సంజయ్‌లు వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారని, ఆ పార్టీలు అధికారంలోకి వస్తే తెలంగాణ దోపిడీకి గురవుతోందన్నారు. ఏ దిక్కూలేక రేవంత్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరితే ఆపార్టీకి ఎవరూ దొరకక ఆయన్ని పీసీసీ అధ్యక్షుడిని చేసిందని, గజ్వేల్‌ వేదికపై మద్యం సేవించని  కాంగ్రెస్‌ నేతలు ఎవరైనా ఉన్నారా? అని పశ్నించారు. కాంగ్రె్‌సలో ఇప్పటికీ ఐక్యత లేదని, ఎన్నికల నాటికి వాళ్లది పగలి 16ముక్కలు అవుతుందని ఎద్దేవా చేశారు.