బ్లాక్‌ ఫంగస్‌తో బెంబేలు

ABN , First Publish Date - 2021-06-04T04:51:07+05:30 IST

జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌(మ్యూకర్‌ మైకోసిస్‌) కేసులు పెరుగుతున్నాయి.

బ్లాక్‌ ఫంగస్‌తో బెంబేలు
పద్మావతి కొవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు

షుగర్‌ వ్యాధిగ్రస్థులకు పొంచివున్న ప్రమాదం

ఇప్పటికే జిల్లాలో 107 కేసులు..  వీరిలో 90 మంది మధుమేహులే

అంతంత మాత్రంగానే మందుల సరఫరా 


తిరుపతి సిటీ, జూన్‌ 3: జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌(మ్యూకర్‌ మైకోసిస్‌) కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్‌ బారినపడి కోలుకున్నవారు ఈ వ్యాధితో ఆస్పత్రులకు వస్తున్నారు. వీరిలో షుగర్‌ వ్యాధిగ్రస్థులే అఽధికంగా ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో 107 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో స్విమ్స్‌ పద్మావతి కొవిడ్‌ కేంద్రంలో  51, రుయా ఆస్పత్రిలో 56 కేసులు నమోదయ్యాయి. వీరికి ప్రస్తుతం స్విమ్స్‌లో కొవిడ్‌ వార్డులోనే చికిత్స అందిస్తున్నా రుయాలో మాత్రం వీరికి చికిత్స అందించేందుకు 60 పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం సాధారణ వార్డులోనే చికిత్స అందిస్తున్నారు. మందులు సక్రమంగా వాడక షుగర్‌ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోని వారికి బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. మొదటి దశలోనే గుర్తించి నియంత్రణకు మందులు వాడకపోతే అనతికాలంలోనే పలు అవయవాలను బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి గాయపరుస్తుంది.  ఈ వ్యాధికి తీవ్రంగా గురైన అవయవాన్ని బయాప్సీ చేసి అంతవరకు తొలగించకపోతే శరీరం మొత్తానికీ పాకుతుంది. చివరకు మెదడుకు చేరి మరణానికి దారి తీస్తుంది. బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధికి చికిత్స చేసేందుకు ఒక విభాగానికి చెందిన వైద్యులు సరిపోరు. ఎందుకంటే ఇది కొవిడ్‌, నాన్‌ కొవిడ్‌ బాధితులతోపాటు షుగర్‌ వ్యాధిగ్రస్థులకు కూడా ఎక్కువగా వస్తుండడంతో అన్ని విభాగాల వైద్యులూ ఇందులో బాగస్వాములు కావాలి. మొదట ఈఎన్‌టీ వైద్యులతోపాటు జనరల్‌ ఫిజీషియన్‌, ఆప్తమాలజిస్ట్‌, న్యూరాలజిస్ట్‌, న్యూరో సర్జన్‌, డెంటిస్టు, జనరల్‌ సర్జరీ, అనస్తీషియా విభాగాలకు చెందిన వైద్యులు ఇందులో పాలుపంచుకోవాల్సి వస్తుంది.గొంతు, ముక్కు, చెవి దగ్గర మొదలై ముఖంలోని అన్నీ భాగాలకూ ఫంగస్‌ వ్యాపిస్తుంది. 


మందుల కొరత

బ్లాక్‌ ఫంగస్‌ నిర్మూలనకు మందుల కొరత తీవ్రంగా ఉంది.ఎంపోటెరిసన్‌-బి ఇంజక్షన్లు, పోసకోనజోల్‌ ఇంజక్షన్లు చాలా తక్కువ అందుబాటులో ఉన్నాయి. వీటిని సరఫరా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి.స్విమ్‌లోని పద్మావతి, రుయా ఆస్పత్రుల్లో తగినన్ని మందుల నిల్వ లేదు. ఉన్న కాస్త మందులతోనే వైద్యం చేస్తున్నారు.

పాటించాల్సిన జాగ్రత్తలు

ఈ వ్యాధి బారిన పడకుండా ముందస్తుగా వ్యాధి నిరోధక శక్తిని పెంచే పోషకాహారాన్ని తీసుకోవాలి. మాంసకృత్తులు ఉన్న ఆహారం, ఆకు కూరలు, అల్లం, వెల్లుల్లి, కాయగూరలు సమృద్ధిగా తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వీటితోపాటు రోజూ 4 లీటర్ల నీళ్లు తాగాలి. 8 గంటలపాటు నిద్ర పోవాలి. కొవిడ్‌ బారి నుంచి బయటపడిన తరువాత ధూమపానం, మద్యపానం పూర్తిగా నిలిపేయడం శ్రేయస్కరం. వీటితోపాటు వ్యక్తిగత, పరిసరాల శుభ్రత అవసరం.

వ్యాధి లక్షణాలు

ఫ కళ్లు బాగా వాయటం, ఎర్రబడడం, నీళ్లు కారడం, దవడలు బాగా నొప్పిగా ఉండడం, తిమ్మిరిగా ఉండడం వంటి వాటితోపాటు అధికంగా తలపోటు, ముక్కు నుంచి నల్లటి స్రవాలు లేదా రక్తం కారడం, ముక్కులో నల్లటి పొక్కులు ఏర్పడటం, ముక్కు దిబ్బడ, ముఖం ఒకవైపు వాయడం, సైనసైటిస్‌ వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఇలాంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

మొదట్లోనే గుర్తించాలి

బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిని మొదటి దశలోనే బాఽధితులు గుర్తించి వైద్యులను సంప్రదించడం వలన ప్రాణా పాయం ఉండదు. ఇప్పటిదాకా ఎవరూ మరణించకుండా  చికిత్స అందిస్తున్నాం.ఇంకా మెరుగైన చికిత్స అందించేందుకు 60 పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేస్తున్నాం. కొవిడ్‌, నాన్‌ కొవిడ్‌ బాధితులతోపాటు ప్రధానంగా షుగర్‌ వ్యాధిగ్రస్థులు చాలా అప్రమత్తంగా ఉండాలి. 

-డాక్టర్‌ సీఎస్‌ సంధ్య, 

ఆప్తమాలజీ విభాగాధిపతి, రుయాస్పత్రి


ఒకే మాస్కును ఎక్కువసార్లు వాడొద్దు

 ఒకసారి వాడిన మాస్కులను పదే పదే వాడడం మంచిది కాదు. తడి మాస్కులను అసలు వాడకూడదు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు వైద్యుల సలహాలు లేకుండా మందులను వాడకూడదు. ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్‌, స్టెరాయిడ్స్‌ తీసుకోకూడదు. కళ్లు, ముక్కు, చెవి వంటి వాటితోపాటు ముఖంలో ఎలాంటి నొప్పులు, వాపు వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

-డాక్టర్‌ మృణాళిని, ఈఎన్‌టీ వైద్యురాలు, రుయాస్పత్రి

Updated Date - 2021-06-04T04:51:07+05:30 IST