బ్లాక్‌ ఫంగస్‌ టెర్రర్‌

ABN , First Publish Date - 2021-06-23T05:40:35+05:30 IST

బ్లాక్‌ ఫంగస్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

బ్లాక్‌ ఫంగస్‌ టెర్రర్‌

ఆందోళన కలిగించే రీతిలో కేసుల పెరుగుదల 

జిల్లాలో ఇప్పటివరకు 267 నమోదు

 112 మంది డిశ్చార్జి...22 మంది మృతి

గత వారం రోజుల్లోనే 80 మంది ఆస్పత్రుల్లో చేరిక


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


బ్లాక్‌ ఫంగస్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత నెల 15న నగరంలో మొట్టమొదటి కేసు వెలుగుచూసింది. మధురవాడ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మహిళ బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలతో  ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన రెండు రోజుల్లోనే ఆమె మృతిచెందారు. అదేరోజు మరో కేసు బయటపడింది. ఆ తరువాత ఫంగస్‌ లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరగడంతో...కేజీహెచ్‌లో జిల్లా యంత్రాంగం ప్రత్యేక వార్డు ఏర్పాటుచేసింది. ఇప్పటివరకు జిల్లాలో 269 మందికి బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే, ఇందులో నాలుగో వంతు గడచిన వారం రోజుల్లోనే నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.


అందరూ కొవిడ్‌ బాధితులే


బ్లాక్‌ ఫంగస్‌ బారినపడుతున్న ప్రతి వంద మందిలో 90 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్న వారేనని వైద్యులు చెబుతున్నారు. మిగిలిన పది మంది తాము కొవిడ్‌-19 వైరస్‌ సోకలేదని చెబుతున్నప్పటికీ...వారికి తెలిసి వుండకపోవచ్చునని (లక్షణాలు పైకి కనిపించకపోవడం... అసిమ్టమాటిక్‌) అంటున్నారు. అయితే, కొవిడ్‌ సోకిన వారిలో కొద్దిమంది మాత్రమే ఈ బ్లాక్‌ఫంగస్‌ బారినపడడానికి అన్‌ కంట్రోల్డ్‌ షుగర్‌ ప్రధాన కారణంగా వైద్యులు చెబుతున్నారు. ఇంకా చికిత్స సమయంలో స్టెరాయిడ్స్‌ తీసుకోవడం, వెంటిలేటర్‌, ఆక్సిజన్‌పై ఎక్కువ రోజులపాటు సేవలు పొందడం వంటి అంశాలు బ్లాక్‌ ఫంగస్‌కు బీజం వేసి ఉండవచ్చునంటున్నారు. అయితే మొదటి వేవ్‌లోనూ వేలాది మంది వైరస్‌ బారినపడినప్పటికీ...బ్లాక్‌ ఫంగస్‌ కేసులు రాలేదని, సెకండ్‌వేవ్‌లో రావడానికి గల కారణాలు తెలియడం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కరోనా నుంచి కోలుకున్నవారు బ్లాక్‌ ఫంగస్‌కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రతించాలని సూచిస్తున్నారు. 


అప్రమత్తత ముఖ్యం


బ్లాక్‌ ఫంగస్‌ బారినపడిన వారిని సకాలంలో గుర్తించడమే కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఫంగస్‌ ముక్కు ద్వారా కన్ను, మెదడుకు వేగంగా వ్యాప్తి చెంది భారీ నష్టాన్ని చేకూరుస్తుందంటున్నారు. ఫంగస్‌ సోకిన వారిలో కన్ను, పన్ను, బుగ్గ వాపు రావడం, ఒకవైపు నొప్పి ఉంటాయని, ఆ సమయంలో నిర్లక్ష్యం చేస్తే ఆయా భాగాలు దెబ్బతింటాయంటున్నారు. 


అందుబాటులోకి ఇంజక్షన్లు


బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు అవసరమైన యాంఫోటెరిసిన్‌-బి ఇంజక్షన్లు మొదట్లో అందుబాటులో లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. అయితే, కొద్దిరోజులుగా జిల్లాకు ప్రతిరోజూ ఇంజక్షన్లు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. బాధితుడి బరువును బట్టి రోజుకు 6-8 ఇంజక్షన్లు ఇస్తున్నామని, ఒక్కో రోగికి కనీసం 36-40 ఇంజక్షన్లు అవసరమవుతున్నాయంటున్నారు. ఈ ఇంజక్షన్‌తోపాటు కొందరికి పోసోకొనాజోల్‌ టాబ్లెట్‌ను, మరికొన్ని రకాల మందులను ఇస్తున్నారు. 


కేజీహెచ్‌లో 95 మంది 


జిల్లాలో ఇప్పటివరకు 269 మంది బ్లాక్‌ ఫంగస్‌ బారినపడగా, వీరిలో చికిత్సపొందుతూ 22 మంది మృతిచెందారు. మరో 112 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. డిశ్చార్జ్‌ అయిన వారిలో 90 శాతం మందికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి ఆయా భాగాల్లో వున్న ఫంగస్‌ను తొలగించారు. వీరిలో కొందరు కంటిని, దవడ భాగాన్ని కోల్పోయినట్టు వైద్యులు చెబుతున్నారు. మిగిలిన ముక్కు, ఇతర భాగాల్లో వున్న ఫంగస్‌ను తొలగించి..ఇతర భాగాలకు వ్యాప్తి చెందే అవకాశం లేదని నిర్ధారించుకున్న తరువాత డిశ్చార్జ్‌ చేసినట్టు వెల్లడిస్తున్నారు. డిశ్చార్జ్‌ తరువాత ప్రతి ఐదు రోజులకు ఒకసారి ఆస్పత్రికి రావాల్సి ఉంటుంది. అలా నెల రోజులపాటు బాధితులను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బ్లాక్‌ఫంగస్‌తో 92 మంది చికిత్స పొందుతున్నారు. వైద్యపరమైన సలహా లేకుండా 43 మంది ఆస్పత్రి నుంచి వెళ్లిపోయినట్టు అధికారులు చెబుతున్నారు. 


మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం.. 

- డాక్టర్‌ పీవీ సుధాకర్‌, ఆంధ్రా మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌


బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ...అందరికీ వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశాం. వైద్య సేవల్లో కీలకమైన ఇంజక్షన్లును ప్రభుత్వం సరఫరా చేస్తోంది. బ్లాక్‌ ఫంగస్‌ను సకాలంలో గుర్తించడమే చాలా కీలకం. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రిలో చేరితే ప్రాణాపాయం తప్పించవచ్చు. ఈ విషయంలో కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు అప్రమత్తంగా ఉండాలి. బ్లాక్‌ ఫంగస్‌ బారినపడుతున్న వారిలో 90 శాతం మంది అన్‌ కంట్రోల్డ్‌ షుగర్‌ బాధితులుగా గుర్తించాం.


మరో 2 కేసులు


విశాఖపట్నం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం మరో రెండు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 269కు చేరింది. వీరిలో చికిత్స పొందుతూ 22 మంది మృతిచెందారు. కాగా, చికిత్సతో కోలుకున్న ఐదుగురిని మంగళవారం వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. 


కరోనా కేసులు 251


విశాఖపట్నం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం కొత్తగా 251 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,47,778కు చేరింది. ఇందులో 1,43,351 మంది (మంగళవారం 477 మంది) కోలుకున్నారు. చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతిచెందడంతో కొవిడ్‌ మరణాలు 1,43,351కు చేరాయి. 

Updated Date - 2021-06-23T05:40:35+05:30 IST