వైట్‌హౌజ్‌కు వెళ్లే రోడ్డుపై 'బ్లాక్ లైవ్స్ మేటర్' పెయింటింగ్‌..

ABN , First Publish Date - 2020-06-06T15:08:37+05:30 IST

శ్వేత‌జాతి పోలీసుల చేతిలో న‌ల్ల‌జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతితో అగ్ర‌రాజ్యం అమెరికా న‌ల్ల‌జాతి ఆందోళ‌న‌ల‌తో అత‌లాకుత‌ల‌మ‌వుతోంది.

వైట్‌హౌజ్‌కు వెళ్లే రోడ్డుపై 'బ్లాక్ లైవ్స్ మేటర్' పెయింటింగ్‌..

వాషింగ్ట‌న్ డీసీ: శ్వేత‌జాతి పోలీసుల చేతిలో న‌ల్ల‌జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతితో అగ్ర‌రాజ్యం అమెరికా న‌ల్ల‌జాతి ఆందోళ‌న‌ల‌తో అత‌లాకుత‌ల‌మ‌వుతోంది. నిర‌స‌న‌కారులు ఏకంగా శ్వేత‌సౌధాన్ని కూడా ముట్ట‌డించ‌డంతో అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సైన్యాన్ని దింపుతాన‌ని హెచ్చ‌రించ‌డం దుమారం రేపింది. ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై సొంత పార్టీ నేత‌ల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డంతో వెన‌క్కి త‌గ్గారు. తాజాగా ట్రంప్ ఆర్మీ మొహ‌రింపు వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించిన వాషింగ్ట‌న్ డీసీ మేయ‌ర్ మురియెల్ బౌసర్ వినూత్నంగా నిర‌స‌న తెలిపారు.


సైనిక చ‌ర్య‌ల‌తో న‌ల్ల‌జాతీయుల‌ను అణ‌గ‌దొక్కాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారని ట్రంప్‌పై మేయ‌ర్ మండిప‌డ్డారు. వైట్‌హౌస్‌కు వెళ్లే ర‌హ‌దారిపై 'బ్లాక్ లైవ్స్ మేటర్' అంటూ పెద్ద పెద్ద అక్ష‌రాల‌తో పెయింటింగ్ వేయించారు. మేయ‌ర్ నియమించిన‌ వాలంటీర్లు స్ట్రీట్ 16లో శుక్ర‌వారం ఈ 16 అక్ష‌రాల పెయింటింగ్ వేశారు. అంతేగాక వైట్‌హౌస్ ముందు ఉన్న ఒక వీధికి "బ్లాక్ లైవ్స్ మేటర్ ప్లాజా" అని పేరు కూడా పెట్టించారు మేయ‌ర్ మురియెల్ బౌసర్. ఈ వీధి పెయింటింగ్ యొక్క ఫుటేజీని ఆమె ట్వీట్ చేశారు. 




సెయింట్ జాన్స్ చర్చి వ‌ద్ద వాషింగ్ట‌న్ కౌన్సిల్ మెంబ‌ర్ల‌తో క‌లిసి నిర‌స‌న‌‌కారుల‌ను ఉద్దేశించి మీడియాతో మాట్లాడిన మేయ‌ర్‌... "వాషింగ్టన్ వాసులుగా అమెరికాలో  మీరు శాంతియుతంగా సమావేశం కావొచ్చు. మీరు మీ ప్రభుత్వానికి మీ ఆవేదనలను తెలిపి మార్పును కోరవచ్చు." అని అన్నారు. అలాగే ఆందోళ‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్టేందుకు ట్రంప్ బ‌ల‌గాల‌ను దింపుతాన‌ని చెప్ప‌డం స‌మంజసం కాద‌న్నారు. ప్రెసిడెంట్ వ్యాఖ్య‌ల‌ను తాను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని చెప్పారు.             


Updated Date - 2020-06-06T15:08:37+05:30 IST