కరాళ కరోనా

ABN , First Publish Date - 2020-03-17T07:33:13+05:30 IST

స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లను కరోనా భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. రోజురోజుకూ కరోనా వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇందుకు నిదర్శనమే స్టాక్‌ మార్కెట్లలో నెల కొంటున్న భారీ పతనాలు. సోమవారంనాడు దేశీయ స్టాక్‌ మార్కెట్లలో...

కరాళ కరోనా

  • బ్లాక్‌ మండే..
  • మళ్లీ ‘బేర్‌’మన్న మార్కెట్లు.. రూ.7.62 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఖతం
  • 2,713 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్‌.. 9,200 పాయింట్ల దిగువకు నిఫ్టీ 


సోమ వారంనాటి పతనంతో ఇన్వెస్టర్ల సంపద రూ.7,62,290.23 కోట్లు కరిగిపోయింది. ప్రస్తుతం బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మార్కెట్‌ విలువ రూ.1,21,63,952.59 కోట్లుగా ఉంది. 


స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లను కరోనా భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. రోజురోజుకూ కరోనా వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇందుకు నిదర్శనమే స్టాక్‌ మార్కెట్లలో నెల కొంటున్న భారీ పతనాలు. సోమవారంనాడు దేశీయ స్టాక్‌ మార్కెట్లలో మరో భారీ పతనం నమోదైంది. ఫలితంగా ఇది ‘బ్లాక్‌ మండే’గా మారింది. బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్‌ 2,713.41 పాయింట్లు (7.96 శాతం) నష్టపోయి 31,390.07 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది సెన్సెక్స్‌ చరిత్రలో రెండో అతిపెద్ద పతనంగా మారింది. ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 757.80 పాయింట్ల (7.61ు) నష్టాన్ని మూటగట్టుకుని 9,197.40 పాయింట్లకు దిగజారిపోయింది. ఈ నెల 12 సెన్సెక్స్‌ 2,919.26 పాయింట్లు, నిఫ్టీ 868.25 పాయింట్లు నష్టపోయిన విషయం తెలిసిందే.

 

కరోనా మహమ్మారి భయాలతో ఆసియా మార్కెట్లు నష్టాల బాటలో సాగాయి. వీటి దారిలోనే దేశీయ మార్కెట్లు నడిచాయని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్ల పతనం ఎందాక కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంటోందని వారు అంటున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి వేగవంతంగా ఉన్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఎక్కువవుతుందన్న ఆందోళనలు ప్రపంచ మార్కె ట్లను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రపంచంలోని పలు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తూ ప్రకటనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఊహించని విధంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మార్కెట్లలో మరింత హెచ్చుతగ్గులు నమోదయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. 


అన్ని రంగాల సూచీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్‌ఈ మెటల్‌, బ్యాంకెక్స్‌, ఫైనాన్స్‌, రియల్టీ, ఐటీ, ఎనర్జీ సూచీలు గరిష్ఠంగా 9.30 శాతం వరకు నష్టపోయాయి. 

మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు 5.94 శాతం వరకు దిగజారాయి.

బీఎస్‌ఈలో 2,047 షేర్లు నష్టాలతో, 411 షేర్లు లాభాలతో, 160 షేర్లు యథాతథంగా ముగిశాయి. 

478 కంపెనీల షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకాయి. 

ఆసియా స్టాక్‌ మార్కెట్ల విషయానికి వస్తే.. షాంఘై 3.40 శాతం, హాంకాంగ్‌ 4.03 శాతం, సియోల్‌ 3.19 శాతం, టోక్యో 2.46 శాతం నష్టాన్ని మూటగట్టుకున్నాయి. యూరోపియన్‌ మార్కెట్లు ప్రారంభ ట్రేడింగ్‌లో 8 శాతం వరకు నష్టపోయాయి. 


30 షేర్లకు నష్టాలే...

సెన్సెక్స్‌ సూచీలోని 30 కంపెనీల షేర్లు నష్టాల్లోనే ముగిశాయంటే కరోనా భయాల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్ని షేర్లకన్నా ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేరు ఎక్కువ (17.50 శాతం) నష్టాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో టాటా స్టీల్‌ (11.02 శాతం), హెచ్‌డీఎ్‌ఫసీ (10.94 శాతం), ఐసీఐసీఐ బ్యాంక్‌ (9.96 శాతం), యాక్సిస్‌ బ్యాంక్‌ (10.38 శాతం), ఆర్‌ఐఎల్‌ (8.28 శాతం), ఇన్ఫోసిస్‌, ఐటీసీ నిలిచాయి. 


మల్టీప్లెక్స్‌ కంపెనీల షేర్లకు సెగ

వివిధ రాష్ర్టాల్లో మల్టీప్లెక్స్‌లను నిర్వహిస్తున్న పీవీఆర్‌, ఐనాక్స్‌ లీజర్‌ కంపెనీల షేర్లకు సెగ తగిలింది. సోమవారం నాడు ఇంట్రాడేలో పీవీఆర్‌ షేరు బీఎ్‌సఈలో 18.85 శాతం క్షీణించి రూ.1,045.85 స్థాయికి చేరుకుంది. ఇది 52 వారాల కనిష్ఠ స్థాయి. అయితే చివరకు నష్టాలు తగ్గిపోయి 4.75 శాతం లాభంతో రూ.1,350.05 వద్ద ముగిసింది. ఐనాక్స్‌ లీజర్‌ షేరు ఇంట్రాడేలో 14.77 శాతం క్షీణించి రూ.270 స్థాయికి దిగజారింది. చివరకు 2.83 శాతం నష్టంతో రూ.307.85 వద్ద క్లోజైంది. 


యెస్‌ బ్యాంక్‌ జూమ్‌

కరోనా భయాలతో అనేక కంపెనీల షేర్లు క్షీణిస్తుంటే.. ప్రైవేట్‌ రంగంలోని యెస్‌ బ్యాంక్‌ షేరు మాత్రం జోరు గా పెరుగుతోంది. ఈ బ్యాంక్‌ పునర్‌ వ్యవస్థీకరణకు సంబంధించిన ప్రకటన వెలువడటమే ఇందుకు కారణం. సోమవారం బీఎ్‌సఈలో ఈ బ్యాంక్‌ షేరు 45.21 శాతం పెరిగి రూ.37.10 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేరు ఏకంగా 58.12 శాతం పెరిగి రూ.40.40 స్థాయి కి చేరుకుంది. ఇక ఎన్‌ఎ్‌సఈలో బ్యాంక్‌ షేరు 45 శాతం పెరిగి రూ.37.05 వద్ద క్లోజైంది. 


అమెరికా, బ్రెజిల్‌ మార్కెట్లలో నిలిచిన ట్రేడింగ్‌

కరోనా వైరస్‌ భయాలతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు వణికిపోతున్నాయి. ప్రారంభంలోనే భారీ పతనాలను చవిచూడటంతో ట్రేడింగ్‌ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికాలోని స్టాక్‌ మార్కెట్లలో సోమవారం ప్రారంభంలోనే పదిహేను నిమిషాలు ట్రేడింగ్‌ నిలిచిపోయింది. అనంతరం మార్కెట్లు తిరిగి ప్రారంభమైనా నష్టాల బాటలోనే సాగాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫెడ్‌ రిజర్వు అత్యవసర చర్యలకు శ్రీకారం చుట్టింది. అయినప్పటికీ ఇన్వెస్టర్లలో మాత్రం విశ్వాసాన్ని నింపలేకపోయింది. బ్రెజిల్‌లోని సావో పాలో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 12.5 శాతం క్షీణించింది. దీంతో ట్రేడింగ్‌ నిలిచిపోయింది. 


గల్ఫ్‌ స్టాక్‌ మార్కెట్లలోనూ నష్టాలు

గల్ఫ్‌ దేశాల్లోని స్టాక్‌ మార్కెట్లు కూడా నష్టాల బాటలో సాగుతున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తితోపాటు ముడిచమురు ధరల్లో క్షీణత వంటి అంశాలు ఈ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. అబుదాబీ, దుబాయ్‌ ఎక్స్ఛేంజీలు వరుసగా 7.8 శాతం, 6.2 శాతం క్షీణించాయి. బౌర్సా కువైట్‌ ప్రీమియర్‌ ఇండెక్స్‌ 5.0 శాతం, ఆల్‌ షేర్స్‌ ఇండెక్స్‌ 3.9 శాతం క్షీణించాయి. సౌదీ తడావుల్‌ మార్కెట్‌  సూచీ 3.3 శాతం తగ్గింది. బహ్రెయిన్‌ సూచీ 1.4 శాతం, మస్కట్‌ మార్కెట్‌ 1.8 శాతం తగ్గాయి. గల్ఫ్‌ కో ఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ)లోని ఆరు దేశాలైన బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌.. కరోనా వైరస్‌ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయి. విమాన సర్వీసులను నిలిపివేయడంతోపాటు సరిహద్దులను మూసివేశాయి. ప్రయాణాలను రద్దు చేయడమేకాకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌ సదుపాయాలను మూసివేశాయి. అయితే జీసీసీ దేశాల్లో మొదటగా బహ్రెయిన్‌లో మొదటి కరోనా మరణం నమోదైంది.  ఇక అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ ముడిచమురు ధర 30 డాలర్ల స్థాయికి చేరింది. 


తొలి రోజే ఎస్‌బీఐ కార్డ్స్‌ నష్టాలు

ఎస్‌బీఐ కార్ట్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ సోమవారంనాడు స్టాక్‌ మార్కె ట్లో లిస్టయింది. అయితే తొలి రోజే ఈ షేరు నష్టాలను చవిచూసింది. కరోనా వైరస్‌ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎస్‌బీఐ కార్డ్స్‌ లిస్టయింది. ఈ షేరు ఇష్యూ ధర రూ.755 కాగా స్టాక్‌ మార్కెట్లో 12.84 శాతం నష్టంతో రూ.658 వద్ద లిస్టయింది. బీఎ్‌సఈలో ఇంట్రాడేలో రూ.755-658 మధ్య కదలాడింది. చివరకు 9.50 శాతం నష్టంతో రూ.683.20 వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఈలో 10.19 శాతం నష్టంతో రూ.678 వద్ద క్లోజైంది. బీఎ్‌సఈలో కంపెనీ మార్కె ట్‌ విలువ రూ.64,149.53 కోట్లుగా ఉంది. 


రూ.40 వేల దిగువకు బంగారం 

ముంబైలో పది గ్రాముల ధర రూ.39,995

పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2,022 తగ్గి రూ.39,995కు పడిపోయుంది. కిలో వెండి ధర ఏకంగా రూ.6,445 పతనమై రూ.36,640కి దిగివచ్చింది. అంతర్జాతీయంగా విలువైన లోహాలకు డిమాండ్‌ పడిపోవడం ఇందుకు కారణమైంది. హైదరాబాద్‌లో తులం బంగారం (24 క్యారెట్లు) రూ.680 తగ్గి రూ.41,610కి పరిమితం కాగా.. కిలో వెండి రూ.5000 మేర క్షీణించి రూ.35,400కి తగ్గింది. ఢిల్లీలో మాత్రం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. తులానికి రూ.455 ఎగబాకి రూ.41,610కి చేరుకుంది. వెండి రేటు మాత్రం కిలోకు రూ.1,283 తగ్గి రూ.40,304గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌  1,470 డాలర్లకు పడిపోగా.. వెండి 13.25 డాలర్లు పలికింది. దీంతో మంగళవారం దేశీయంగానూ బంగారం, వెండి ధరలు మరింతగా తగ్గనున్నాయని బులియన్‌ వర్గాలంటున్నాయి. 


బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 

గత శుక్రవారం ముగింపు : 34,103.48

సోమవారం ప్రారంభం : 33,103.24

గరిష్ఠం : 33,103.24

కనిష్ఠం : 31,276.30

ముగింపు : 31,390.07

Updated Date - 2020-03-17T07:33:13+05:30 IST