నల్లధనం వెలికి తీయాలి

ABN , First Publish Date - 2021-05-06T05:58:09+05:30 IST

ఏడాది కిందట ఏర్పడిన లాక్‌డౌన్‌ అనంతర పరిస్థితుల నుంచి తేరుకోక మునుపే... మళ్లీ నెల రోజుల నుంచి కరోనా సెకండ్‌ వేవ్‌ యావత దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది...

నల్లధనం వెలికి తీయాలి

ఏడాది కిందట ఏర్పడిన లాక్‌డౌన్‌ అనంతర పరిస్థితుల నుంచి తేరుకోక మునుపే... మళ్లీ నెల రోజుల నుంచి కరోనా సెకండ్‌ వేవ్‌ యావత దేశాన్ని అతలాకుతలం చేస్తున్నది. సాక్షాత్తూ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రాత్రి పూట కర్ఫ్యూలు, పాక్షిక లాక్‌డౌన్ల ద్వారా పరిస్థితులు చక్కబడవు, పది పదిహేను రోజులు పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ విధించవలసి ఉందని చెప్పారు. కర్నాటక, ఒడిషా, ఉత్తరాఖండ్‌, హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలతో పాటు ఢిల్లీ నగరంలో కూడా ఆయా రాష్ట్రాల పాలకులు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిం చారు. ఆంధ్రప్రదేశ్‌లో పాక్షిక లాక్‌డౌన్‌ విధించారు. తెలంగాణలో రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటిస్తే ఇప్పటికే కుదేలైన ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారే ప్రమాదం ఉన్నదని, ప్రజలకు కావలసిన నిత్యావసర సరుకులు అందించడం, ఇతరత్రా సౌకర్యాలు కల్పించడం చాలా కష్టం అని పాలకులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ సంక్షోభ సమయంలో పేదలను ఆదుకోవడానికి ఖాళీ అయిన ప్రభుత్వ ఖాజానాను నింపడానికి ఈ విపత్తును జాతీయ విపత్తు కింద గుర్తించి ప్రత్యేక చట్టాలతో నల్లధనం వెలికి తీయడమే శరణ్యం అని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. స్విస్‌ బ్యాంక్‌తో పాటు ఇంకా కొన్ని విదేశాలలో మన భారతీయులు దాచిన నల్లధనం సరాసరిన మూడు లక్షల కోట్లు ఉందని సమాచారం. విదేశాలలో దాగిన నల్లధనం తీసుకురావడానికి ఆయా దేశాల చట్టాలు అడ్డంకిగా మారాయని పాలకులు చెబుతూ వస్తున్నారు. ఐక్యరాజ్యసమితిలో మన వాణిని బలంగా వినిపించి అమెరికా వంటి దేశాల సహకారం తీసుకొని బలమైన లక్ష్యంతో, చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఆ నల్లధనం వెలికితీత పెద్ద కష్టమేమీ కాదు. అలాగే స్వదేశంలో బినామీ పేర్లతో స్థిరాస్తుల రూపంలో అనేకమంది పారిశ్రామికవేత్తలు, రాజకీయ దిగ్గజాలు దాచుకున్న నల్లడబ్బును వెంటనే తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇడి, సిబిఐ, విజిలెన్స్‌, ఎసిబి వంటి వ్యవస్థలను ప్రత్యర్థుల మీద ప్రయోగించకుండా భవిష్యత్తు తరాల కోసం సేవాభావంతో అటు కేంద్రపాలకులు, ఇటు రాష్ట్ర పాలకులు సరైన మార్గంలో ఉపయోగించుకుంటే వెంటనే కోట్లాది రూపాయల నల్లధనం ప్రభుత్వ ఖజానాకు వచ్చే అవకాశం ఉంది.  

తిప్పినేని రామదాసప్పనాయుడు

ఛైర్మన్‌, ముద్ర వ్యవసాయ, నైపుణ్యాభివృద్ధి బహుళార్థ సహకార సంఘం

Updated Date - 2021-05-06T05:58:09+05:30 IST