బ్లాక్‌రైస్‌ ఉత్పత్తి

ABN , First Publish Date - 2021-06-25T06:55:42+05:30 IST

మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య ప్రదాయిని, మంచి ఆహార పోషక విలువలు కలిగిన ‘కాలిపట్టి’ అనే బ్లాక్‌రైస్‌ను ఓ ఆదర్శ రైతు ఉత్పత్తి చేస్తున్నాడు.

బ్లాక్‌రైస్‌ ఉత్పత్తి
నల్లమిల్లిలో దాళ్వాసాగులో ఏపుగా పెరిగిన బ్లాక్‌రైస్‌ ధాన్యం దృశ్యం, (ఇన్‌సెట్‌)లో బ్లాక్‌రైస్‌ ధాన్యం

పోషక విలువలు కలిగిన ధాన్యంగా గుర్తింపు
నల్లమిల్లిలో ఓ రైతు ప్రయోగాత్మక సాగు
ముంపు ప్రాంతాల్లో సేద్యానికి అనువైన వంగడం

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య ప్రదాయిని, మంచి ఆహార పోషక విలువలు కలిగిన ‘కాలిపట్టి’ అనే బ్లాక్‌రైస్‌ను ఓ ఆదర్శ రైతు ఉత్పత్తి చేస్తున్నాడు. వివిధ రాష్ర్టాల్లో మంచి డిమాండు కలిగిన ఈ బ్లాక్‌ రైస్‌ను అమలాపురం రూరల్‌ మండలం నల్ల మిల్లి శివారు అప్పారి వారిపాలేనికి చెందిన ఆదర్శ రైతు అప్పారి వెంకటరమణ ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేశారు. తెలంగాణ ప్రాంతంలోని దేశవాళీ రకమైన కాలిపట్టి విత్తనాలు తీసుకువచ్చి ఇటీవల ముగిసిన దాళ్వా సేద్యంలో సాగు చేశాడు. 20 సెంట్ల భూమిలో ఈ విత్తనాన్ని ప్రయోగాత్మకంగా నాటారు. మంచి దిగుబడిని సాధించారు. సాధారణ వరి వంగడాలతో పోలిస్తే బ్లాక్‌రైస్‌ రకం వరికంకులు ఐదు నుంచి ఆరు అడుగుల మేర ఎత్తుకు ఎదుగుతాయి. ముంపు ప్రాంత భూముల్లో ఈ విత్తనం సాగు రైతుకు లాభసాటిగా ఉంటుంది. సాధారణంగా వరిపంట కోతకు వచ్చే దశలో గోల్డ్‌ కలర్‌ లో మిలమిలా మెరిసిపోతుంది. కాలిపట్టి రకం బ్లాక్‌రైస్‌ పంట మాత్రం నల్లగా సాధారణ చేల కంటే రెండు అడుగుల ఎత్తున ఏపుగా ఎదిగి కనిపిస్తుంది. ఇరవై సెంట్ల భూమిలో సాగు చేసిన ఈ పంట 150 రోజులకు ఉత్పత్తి దశకు చేరదని రైతు అప్పారి వెంకట రమణ తెలిపారు. తాను సేద్యం చేసిన భూమిలో మూడున్నర బస్తాలు బ్లాక్‌రైస్‌ దిగుబడి సాధించినట్టు తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో కాలిపట్టి రకం ధాన్యానికి మంచి డిమాండు ఉండడంతోపాటు రాష్ట్రంలో పలు చోట్ల రైతులు అక్కడక్కడా పంటలు వేసి ధాన్యం పండిస్తుండడాన్ని పరిశీలించిన తాను కోన సీమలో తొలిసారిగా పండించానని వెంకటరమణ తెలిపారు. ఎవరైనా బ్లాక్‌రైస్‌ సేద్యం చేయా లంటే విత్తనాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. ఎరువులు, పురుగుల మందులకు అతీతంగా ప్రకృతి సేద్యం ఆధారంగానే బ్లాక్‌రైస్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ రకం ధాన్యం పోషకాహారాలు కలిగి ఉండడంతోపాటు ఇమ్యూనిటీని పెంచేందుకు ఉపయోగ పడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు బ్లాక్‌రైస్‌ వరప్రదాయినిగా నిలుస్తుండడంతో ఈ రైస్‌కు బహిరంగ విపణిలో డిమాండు ఉంది. మొత్తంమీద ఆదర్శ రైతు అప్పారి వెంకటరమణ పండించిన బ్లాక్‌రైస్‌ను చూసేందుకు సమీప ప్రాంతాల రైతులు అక్కడికి వస్తున్నారు.

Updated Date - 2021-06-25T06:55:42+05:30 IST