Abn logo
Mar 4 2021 @ 00:40AM

ఆవు పేరుతో అమ్మను దూషిస్తారా?

గోమాంసం తినేవారు వ్యభిచారిణుల సంతానం అనే అర్థం వచ్చే ‘పచ్చి’ మాటలతో బిజెపి శాసనసభ్యుడు రాజాసింగ్ ఈ మధ్య వ్యాఖ్యానించిన విడియో సామాజిక మాధ్యమాలలో సంచరిస్తోంది. సహజంగానే, గోమాంసంతో సహా పశుమాంసం తినే ప్రజావర్గాలు ఈ వ్యాఖ్యకు మనస్తాపం చెందాయి, ఆగ్రహించాయి. ఆ వర్గాలలో దళిత శ్రేణులు కూడా ఉన్నాయి కాబట్టి, శాసనసభ్యుడిపై అత్యాచార నిరోధక చట్టం ప్రకారం ఫిర్యాదులు నమోదు అయ్యాయి. ఆహార హక్కును గౌరవించే ప్రగతిశీల వర్గాలన్నిటితో కలుపుకుని గట్టి ప్రతిఘటన ఇవ్వాలని కొందరు వాదిస్తుండగా, ఈ అంశంపై వివాదం కొనసాగించడం కంటె విస్మరించడమే మంచిదని, రాజాసింగ్ వంటి వారు పన్నే వ్యూహంలో భాగస్వాములు కాగూడదని మరి కొందరు భావిస్తున్నారు. ఇంకా రకరకాల వైఖరులు కూడా ఈ అంశం సందర్భంగా వ్యక్తమవుతున్నాయి. శాసనసభ్యుడు తన వ్యాఖ్యలను ప్రధానంగా గురిపెట్టిన మైనారిటీ మతస్థులు, రకరకాల కారణాల వల్ల, ఈ అంశంపై స్పందించే స్థితిలో లేకపోవచ్చు. పోరాటాల చరిత్ర తమకు గొప్ప ప్రజాస్వామిక నడవడికను అలవరిచిందని చెప్పుకునే తెలంగాణ ఉద్యమ సమాజమూ చూసీచూడనట్టు వదిలివేయవచ్చు. కేంద్రంలోని అధికారపార్టీ అంటేనే దడుపు జ్వరం పట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం, ఎటువంటి చర్యలకూ యంత్రాంగాన్ని అనుమతించకపోవచ్చు. కానీ, రాజాసింగ్ గారి పార్టీ నాయకత్వానికి ఏమయింది? వారు ఆ భాషను, ఆ సంస్కారాన్ని అంగీకరిస్తున్నారా? కొన్ని ప్రజాశ్రేణులను వారిలోని స్త్రీలతో సహా, వారి మాతృత్వమూ లైంగికతా సహా, అవమానించడం తప్పు అని రాష్ట్రంలో, కేంద్రంలో కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులు భావించడం లేదా? లేక, బహిరంగ వ్యక్తీకరణల్లో, ప్రజాప్రతినిధుల సభ్యతా అసభ్యతా నిర్వచనాల్లో ఈ మేరకు సవరణలు అవసరం అని ఆ పార్టీ భావిస్తున్నదా? ఇక ముందు, రాజాసింగ్ శైలీగ్రంథమే వారి రాజకీయ సంవాదాలకు ప్రమాణం కానున్నదా? పశుమాంసంతో వ్యవహరించే దళిత శ్రేణులను హిందువులుగా, తమ ఓటర్లుగా వారు గుర్తించడం లేదా? 


గోమాంసం తినడం మంచిచెడ్డల గురించి ఇక్కడ చర్చ చేయడం లేదు. భారతదేశంలో గోవధ నిషేధం డిమాండ్ కొత్తదీ కాదు, విస్తృతంగా చర్చ జరగనిదీ కాదు. ఇక్కడ సమస్య, తమకు సమ్మతం కాని ఆహారసంస్కృతి విషయంలో చూపవలసిన ప్రజాస్వామిక సహిష్ణుత. వైవిధ్యభరితమయిన సమాజంలో, రకరకాల ఆహారపు అలవాట్లు ఉండడం సహజం. కొన్ని ఆహారాలకు సాంస్కృతికమైన పవిత్రతలు లేదా విధినిషేధాలు ఉండడం కూడా సహజమే. కానీ, అవి ఆ సాంస్కృతిక సమూహాలకు వెలుపలివారికి కూడా వర్తిస్తాయా? వర్తించాలా? ఎవరికి నచ్చిన ఆహారపు పద్ధతులను వారు పాటించడం న్యాయం కాదా? ఎవరి ఇచ్ఛను వారు పాటించడమన్నా జరగాలి, ఒకరు ఇతరుల కోసం తమ ఇచ్ఛను వదులుకోవాలంటే అందుకు పరస్పరతతో కూడిన ప్రజాస్వామిక ప్రయత్నం అన్నా జరగాలి. గోవధ నిషేధం విషయంలో భారతీయ సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకుని ఒక ఏకాభిప్రాయానికి, వారు కోరుతున్నట్టు ఆవును చంపకూడదన్న ఏకాభిప్రాయానికే, రావచ్చును. అటువంటి అభిప్రాయ సమీకరణ జరపాలని, అందులో ఒత్తిడి ఉండకూడదని గాంధీ కోరుకున్నారు. స్వచ్ఛందంగా గోమాంసాన్ని వర్జించాలని ఆయా వర్గాలు నిర్ణయించుకునేదాకా, వారిని ఒత్తిడి చేయడాన్ని తాను సమ్మతించబోనని అన్నారు. తాను కనుక పాకిస్థాన్‌లో ఉండవలసివస్తే, అక్కడి ప్రభుత్వం విగ్రహారాధనను నిషేధించి, తనను గుడికి వెళ్లకుండా నిరోధిస్తే, తాను దానిని ప్రతిఘటిస్తానని, ఆ నిషేధాన్ని ఉల్లంఘిస్తానని గాంధీ అన్నారు. ఆరాధనా పద్ధతులతో ఆహార పద్ధతులను కూడా ఆయన పోల్చారు. గోవధ నిషేధాన్ని రాజ్యాంగ మౌలికాంశాలలో చేర్చాలని రాజ్యాంగ రచనాసభపై ఒత్తిడి పెరుగుతున్న దశలో గాంధీ పై వ్యాఖ్యలు చేశారు. గోవధ నిషేధం మీద అంబేడ్కర్‌ ఎక్కడా సానుకూలత వ్యక్తం చేయలేదు. పశుమాంస భక్షణ హిందువుల నుంచి దళితులను వేరుచేసే ప్రత్యేకత- అని బాబాసాహెబ్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ రచనాసభలోని గోసంరక్షణ వాదుల ఒత్తిడి పెరిగినందువల్ల, మధ్యేమార్గంగా గోవధ నిషేధాన్ని ఆదేశిక సూత్రాలలో చేర్చారు. నిషేధాన్ని రాజ్యాంగశాసనంగా చేయకుండా నిలిపివేయడంలో గాంధీ వైఖరి కూడా అంబేడ్కర్‌కు దోహదం చేసింది. ఇప్పటికీ, గోవధ నిషేధం అన్నది రాజ్యాంగంలో పొందుపరచిన భవిష్యత్ లక్ష్యమే తప్ప, ప్రస్తుత శాసనం కాదు. అట్లాగే, గోవధ నిషేధం కేవలం భారతీయ జనతాపార్టీ, దాని పూర్వరూపాల నినాదం అనుకుంటే పొరపాటు. గాంధీ, వినోబా భావే వంటి వారి నుంచి గోవధ నినాదాన్ని తీసుకుని, దాన్ని మతవాదంతో మేళవించడం మాత్రమే ఇతరులు చేసింది. 


గాంధీ వంటి వారి గోసంరక్షణ, కొన్ని జనశ్రేణులను కవ్వించడానికో, నొప్పించడానికో ఉద్దేశించింది కాదు. గోమాంసాన్ని, పశుమాంసాన్ని రెంటినీ గందరగోళ పరిచి, మొత్తంగా పశుమాంసాన్నే నిషేధించడం చూస్తున్నాము. పశుమాంసం ఇంట్లో వండుకున్నారని, తీసుకు వెడుతున్నారని జరిగిన మూకదాడులు తెలిసిందే. ఆవును మినహాయించి, ఎద్దు, దున్న, గేదె వంటి పశువుల మాంసంపై ఎప్పుడూ వివాదం లేదే? ఎందుకు కొత్తగా కల్పించారు? కర్ణాటకలో బీఫ్‌ను నిషేధించిన పార్టీ అస్సాంలో, మేఘాలయల్లో నిషేధించగలదా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిలదీసినట్టు, గోవాలో పశుమాంసాన్ని నిషేధించగలరా? పశువధ, మాంస విక్రయాలు రాష్ట్రాల జాబితాలో ఉన్నవి నిజమే, కానీ, అక్కడా ఇక్కడా ఒకే పార్టీ కదా, సిద్ధాంతం ఒకటే కదా? 


ఆవు ఒకనాడు కామధేనువు అయిందంటే, పశుపాలన కాలంలో, గోవే ధనం, గోవే సంపద, గోవే ఆహారం, గోవే జీవితం. వ్యవసాయానికి ముందు కాలాల్లో మనుషులు ఏమి తినేవారో ప్రత్యేకంగా ప్రస్తావించనక్కరలేదు. మాంసభక్షణ గురించి, పశుమాంస భక్షణ గురించి, గోభక్షణ గురించి వేదాలలో, స్మృతులలో, రామాయణాది కావ్యాలలో ఏమి రాశారో మళ్లీ కొత్తగా చెప్పనక్కరలేదు. యజ్ఞయాగాదులలో విచక్షణారహితంగా జరిగిన పశుహత్యలను నివారించడానికి బౌద్ధం ప్రయత్నించిందంటారు. అలనాటి అహింస, అహేతుకమైన హింసను నివారించడంగా మొదలై, కొన్ని సామాజిక వర్గాలు పూర్తిగా మాంసాన్నే వర్జించే దాకా ప్రయాణించింది. నిచ్చెనమెట్ల వ్యవస్థలో శాకాహారం నైతిక ఆధిక్యాన్ని ప్రదర్శించింది. సమాజానికి కావలసిన సంపదను ఉత్పత్తిచేసే కాయకష్టం అంతా మాంసాహారంతో ముడిపడిందే. ‘‘పగలనక, రాత్రనక కష్టించే శ్రమజీవిపై శాకాహారాన్ని బలవంతంగా విధించడం మనం మన జాతీయ స్వాతంత్ర్యాన్ని కోల్పోవడానికి ఒక కారణమ’’ని వివేకానందుడు అన్నారు. మంచి, పోషక విలువలున్న తిండి ఏమి చేయగలుగుతుందో జపాన్‌ను చూసి తెలుసుకోవచ్చునని కూడా ఆయన సూచించారు. 


శతాబ్దం కిందట భారతదేశంలో పాత తరహా వ్యవసాయమూ, గ్రామీణ ఆర్థిక సమాజమూ ఉన్నాయి. అవి ఎన్నటికైనా మారతాయా అని సందేహం కలిగేవిధంగా ఉండేవి నాటి గ్రామాలు. ఆ గ్రామ వ్యవస్థలో, దున్నడానికి, నీళ్లు పెట్టడానికి, రవాణాకు అన్నిటికీ పశుశక్తి అవసరం. విద్యుత్ లెక్కల్లో చెబితే కొన్ని లక్షల మెగావాట్ల శక్తిని పశువులు తమ శ్రమ ద్వారా అందించేవి. పశుసంపద వృద్ధి కావడానికి, పాడి ఉత్పత్తులకు ఆవులు, గేదెలు వంటి ఆడపశువులు అవసరం. గ్రామీణ స్వయంసమృద్ధ సమాజాన్ని అభిమానించే గాంధీ వంటి వారికి, పశుసంరక్షణ, గ్రామీణ సంపదకు కీలకంగా కనిపించి ఉండవచ్చు. ఇప్పుడు వ్యవసాయం, ఫలసాయం అంతా నాస్తి అయిపోయి, గ్రామాల్లో పశువుల సంఖ్యక్షీణిస్తున్న దశలో, గోసంరక్షణ ఆచరణలో నామమాత్రంగానే మిగులుతుంది. 


పశువు గ్రామీణ జీవనంలో కీలకం అయినప్పుడు, వయసు, ఆరోగ్యం కలిగిన పశువులను వధించడం ఎప్పుడూ లాభసాటిగా ఉండదు. యోగ్యమైన పశువును మాంసం కోసం చంపే అవివేకి ఎవరూ ఉండరు. వయసుడిగిన తరువాతే, నిరుపయోగంగానూ భారంగానూ మారినప్పుడే పశువు కటికవృత్తి వారిదగ్గరకో, కబేళాకో వెడుతుంది. భారతదేశంలో వేగంగా అంతరిస్తున్న పశుసంపదకు కారణం, ఒక మతవర్గమో, ఒక సామాజిక వర్గమో కారణమని అనుకోవడమంత అశాస్త్రీయత మరొకటి ఉండదు. వ్యవసాయం నుంచి పశువులను తొలగించే పరిణామాలకు కారకులెవరు? ఏ ఉపయోగమూ లేకుండా పశువులను పెంచగలిగిన స్థితిలో రైతులు ఉన్నారా? మరణించబోయే, అనారోగ్యం పాలయిన, వృద్ధ పశువులను మాంసవృత్తిలో ఉన్నవారికి ఇచ్చే ఆనవాయితీ ఏ నాటిది? మరణించిన పశువులను కూడా తినవలసిన అగత్యంలో కొన్ని కులాలు ఉన్నాయని తెలుసునా? ఏ కులాల మీద అయితే నోరుపారేసుకుంటున్నారో, ఆ కులాల వారే లేకపోతే, సజీవ, నిర్జీవ పశువుల నిర్వహణ ఎంత అసాధ్యమో, గుజరాత్‌లో ఉద్యమకారులు నిరూపించారు కదా? 


ప్రపంచమంతా పశువధను మానుకుంటే బాగుంటుంది, కానీ, ఇతరులకు చెప్పేముందు హిందువులు ఆదర్శంగా ఉండాలి, అని గాంధీ వ్యాఖ్యానించారు. మరి పశుమాంస ఎగుమతుల్లో భారతదేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నది. పధ్నాలుగు లక్షల టన్నుల పశుమాంసం భారతదేశం నుంచి గత ఏడాది ఎగుమతి అయింది. దారి కాచి వాహనాల్లో కబేళాలకు తరలే పశువును అడ్డుకునే బదులు, పశుమాంస వ్యాపారం విరమించుకోమని కేంద్రప్రభుత్వానికి చెప్పవచ్చును కదా? పశుమాంసం తినేవారి నుంచి విరాళాలు తీసుకోవద్దు అనుకునేవారు, బీఫ్ ఎగుమతిదారుల నుంచి కోట్లాది రూపాయల ఎన్నికల విరాళాలు ఎందుకు తీసుకున్నట్టు? భారతప్రభుత్వమే పశుమాంసాన్ని ఆదాయమార్గంగా భావిస్తుంటే, కర్ణాటక తన 500 కోట్ల వ్యాపారాన్ని ఎందుకు నిషేధించినట్టు, ఏ చిన్నచితకా వృత్తిదారుల పొట్టకొట్టడానికి?

కె. శ్రీనివాస్