బ్లీచింగ్‌ పౌడరే శానిటైజర్‌

ABN , First Publish Date - 2020-05-27T09:49:36+05:30 IST

అసలే కరోనా కాలం... ఆపై బస్సుల్లో సమూహ ప్రయాణం. ప్రాణాలు బిగపట్టి గమ్యాలు చేరుతున్న ప్రయాణికులతో ..

బ్లీచింగ్‌ పౌడరే శానిటైజర్‌

ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం

ప్రయాణికుల భద్రత గాలికి...

చేతులన్నీ దురదతో బస్టాండ్‌లోనే నిరసన

బుకాయిస్తున్న అధికారులు 


అనంతపురం టౌన్‌, మే 26 : అసలే కరోనా కాలం... ఆపై బస్సుల్లో సమూహ ప్రయాణం. ప్రాణాలు బిగపట్టి గమ్యాలు చేరుతున్న ప్రయాణికులతో ఆర్టీసీ చెలగాటమాడుతోంది. శానిటైజర్లు, భౌతికదూరం, మాస్క్‌లంటూ నిబంధనల గోల చేస్తున్న అధికారులు... సంస్థకు ప్రధాన ఆదాయ వనరులైన ప్రయాణికులపై నిలువెత్తు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఏకంగా వారి ప్రాణాలతో చెలగాటమాడుతూ... బస్కెక్కే సమయంలో పూయాల్సిన శానిటైజర్‌ స్థానంలో బ్లీచింగ్‌ పౌడర్‌ నీటిని పోస్తూ కక్కుర్తికి పాల్పడుతోంది. ప్రయాణికుల ఆరోగ్య రక్షణను గాలికొదిలేసింది. మంగళవారం అనంతపురం ఆర్టీసీ డిపో పరిధిలో ఇదే చోటుచేసుకుంది. బస్సు ఎక్కేందుకు వచ్చిన ప్రయాణికులకు శానిటైజర్‌కు బదులుగా బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపిన నీటితో చేతులు శుభ్రం చేయించారు.


చేతుల దురదతో ప్రయాణికుల అవస్థలు

ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యానికి ప్రయాణికులు బలయ్యారు. శానిటైజర్‌ స్థానంలో ఇచ్చిన బ్లీచింగ్‌ పౌడర్‌ నీరు కొందరు ప్రయాణికుల చేతులకు దురద అంటించింది. దీంతో బస్టాండు ఆవరణలోనే ఆందోళనకు దిగారు. విషయం ఆర్‌ఎం దృష్టికి వెళ్లింది. అయితే ఇదే విషయమై బస్టాండు సిబ్బందిని వివరణ కోరగా... ఉన్నతాధికారులు తమకు ఇదే ద్రావణాన్ని పంపారని చెప్పుకొచ్చారు. ఆ ద్రావణాన్నే ప్రయాణికుల చేతులు శుభ్రపర్చుకునేందుకు ఇచ్చామన్నారు. మరోవైపు బస్టాండ్‌తో పాటు కార్యాలయాల్లో పనిచేసే పారిశుధ్య సిబ్బంది పట్ల కూడా ఆర్టీసీ అధికారులు వివక్ష చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బస్సు సర్వీసులు పునఃప్రారంభమై వారంరోజులవుతున్నా పారిశుధ్య సిబ్బందికి ఇంతవరకూ మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు ఏవీ ఇచ్చిన పాపాన పోలేదు. ఈ విషయం బయటకు పొక్కితే సదరు సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ కిందిస్థాయి అధికారులు కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. దీంతో తమగోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని పరిస్థితి పారిశుధ్య కార్మికుల వంతైంది.


రసాయనాల మోతాదు పెరిగి అలా జరిగి ఉండొచ్చు : ఆర్‌ఎం సుమంత్‌

యాజమాన్యం ఆదేశాల మేరకు 0.25ు చొప్పున సోడియం క్లోరైట్‌ను నీటిలో కలిపి సిబ్బందికి అందజేశాం. అయితే ఎక్కడైనా సోడియం క్లోరైట్‌ మోతాదు కొంచెం ఎక్కువై ఉంటే చేతి దురదలు రావచ్చు. దీనిపై పరిశీలించి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూస్తాం.

Updated Date - 2020-05-27T09:49:36+05:30 IST