రక్త నిల్వలు నిండుకున్నాయ్‌!

ABN , First Publish Date - 2020-04-06T10:09:57+05:30 IST

విశాఖపట్నంలోని బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం నిల్వలు నిండుకుంటున్నాయి. ఆపదలో వచ్చిన వారికి రక్తాన్ని అందజేయలేకపోతున్నామని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు.

రక్త నిల్వలు నిండుకున్నాయ్‌!

బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం కొరత

లాక్‌డౌన్‌తో వెళ్లలేకపోతున్న దాతలు

తగ్గిన వినియోగం... అయినా తరిగిపోతున్న నిల్వలు

కేజీహెచ్‌లో బ్లడ్‌బ్యాంకు తాత్కాలికంగా మూసివేత

ప్రత్యేక యాప్‌ రూపొందించిన ఏఎస్‌రాజా బ్లడ్‌ బ్యాంక్‌

దాతల రాకపోకలకు ఇబ్బంది లేదని వెల్లడి


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం): విశాఖపట్నంలోని బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం నిల్వలు నిండుకుంటున్నాయి. ఆపదలో వచ్చిన వారికి రక్తాన్ని అందజేయలేకపోతున్నామని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 


నగరంలో పేరొందిన బ్లడ్‌ బ్యాంకులు ఇరవైకిపైగా ఉన్నాయి. కేజీహెచ్‌ వంటి ఆస్పత్రుల్లో కాకుండా స్వచ్ఛందంగా సేవా దృక్పథంతో నిర్వహిస్తున్నవే ఎక్కువ. రెడ్‌క్రాస్‌, ఏఎస్‌ రాజా, లయన్స్‌ క్లబ్‌, రోటరీ క్లబ్‌, ఎన్‌టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌, సంజీవని వంటి సంస్థలు బ్లడ్‌ బ్యాంకులు నిర్వహిస్తున్నాయి. సాధారణ సమయాల్లో ప్రతి బ్లడ్‌ బ్యాంకులో 100 నుంచి 200 యూనిట్ల రక్తం అందుబాటులో ఉంటుంది. అత్యవసరమై వచ్చేవారికి వాటిని అందిస్తుంటారు. రక్తం తీసుకునేవారు ప్రతిగా వారి కుటుంబ సభ్యుల ద్వారానో, మిత్రుల ద్వారానో రక్తం ఇస్తుంటారు. ఇది కాకుండా రక్తదాన శిబిరాల ద్వారా బ్లడ్‌ బ్యాంకులకు రక్తం సమకూరుతుంది. విద్యా సంస్థలు, నేవీ, కొన్ని ప్రైవేటు సంస్థలు తరచూ శిబిరాలు నిర్వహించి రక్తం ఇస్తుంటాయి. పేరొందిన ప్రజాప్రతినిధులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం శిబిరాలు నిర్వహించి, రక్తం సేకరించి ఇస్తుంటారు.


ఆ రెండు వర్గాలకు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే

తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియాతో బాధపడేవారికి ప్రతి నెలా తప్పనిసరిగా రక్తం ఎక్కించాలి. ఈ వ్యాధిగ్రస్థులు తమకు అందుబాటులో ఉన్న బ్లడ్‌బ్యాంకులో పేర్లు నమోదు చేసుకుంటారు. ప్రతి బ్యాంకులోనూ ఇలాంటి వారి సంఖ్య 50 నుంచి 100 వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ వ్యాధిగ్రస్థులకు, అత్యవసరమైన డెలివరీ కేసులకు మాత్రమే ఇస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.


తగ్గిన ప్రమాదాలతో కాస్తంత ఊరట

లాక్‌డౌన్‌ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో రక్తం కోసం వచ్చేవారి సంఖ్య తగ్గిందని చెబుతున్నారు. అన్ని ఆస్పత్రుల్లో సాధారణ శస్త్రచికిత్సలు నిలిపివేయడంతో రక్తానికి డిమాండ్‌ తగ్గింది. అయినప్పటికీ కొరతగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. 


ప్రస్తుతం 90 యూనిట్లు మాత్రమే ఉన్నాయి.. ఎస్‌.కె.ఎల్‌.రావు, రెడ్‌క్రాస్‌ బ్లడ్‌బ్యాంకు ఇన్‌ఛార్జి

మా బ్లడ్‌బ్యాంకులో నిత్యం 500-600 యూనిట్ల రక్తం వుంటుంది. ఇప్పుడు వాటి సంఖ్య 90కి పడిపోయింది. రోజూ 15 నుంచి 20 మందికి రక్తం అందిస్తున్నాం. దాతలు ఎవరూ లేకపోవడం వల్ల సేకరణ పూర్తిగా నిలిచిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే వారం రోజుల్లో పూర్తిగా అయిపోతాయి. అప్పుడు ఎవరికీ సాయం చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. దీనికి పోలీసు అధికారులు ఓ పరిష్కారం చూడాలి. శిబిరాల నిర్వహణకు అనుమతి ఇవ్వాలి.


ప్రత్యేక యాప్‌ రూపొందించాం.. డాక్టర్‌ సుగంధిని, ఏఎస్‌రాజా బ్లడ్‌ బ్యాంకు

లాక్‌ డౌన్‌కు ముందు రక్త దానం చేయడానికి  రోజుకు 50-60 మంది వచ్చేవారు. ఇప్పుడు ఎవరూ రావడంలేదు. రక్త దాతలతో మాట్లాడితే.. తమకు కూడా రావాలని వుందని, అనుమతి కావాలని కోరుతున్నారు. సిటీ పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కే మీనాతో మాట్లాడగా తప్పకుండా అనుమతి ఇస్తామన్నారు. అయితే ఎవరికి పడితే వారికి అనుమతి ఇవ్వకూడదని చెప్పడంతో దీని కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించాం. రక్తదాత ఏ సమయానికి ఎక్కడి నుంచి బయల్దేరుతున్నాడో యాప్‌ ద్వారా పోలీసులకు తెలియజేస్తాం. అలాగే దాత మొబైల్‌కి కూడా సమాచారాన్ని ఇస్తాం. దాతలు బ్లడ్‌బ్యాంకుకు వస్తున్నపుడు మధ్యలో పోలీసులు ఆపితే... మొబైల్‌కు మేము పంపిన సమాచారం చూపిస్తే  వదిలేస్తారు.


ఆధార్‌ నంబరు, ఫొటోతో సహా అన్ని వివరాలు ఉంటాయి. రక్తదానం పూర్తికాగానే సర్టిఫికెట్‌ ఇచ్చి పంపిస్తాం. ఇంటికి వెళుతున్నప్పుడు మధ్యలో ఎవరైనా ఆపితే... దానిని చూపించవచ్చు. ఒక వేళ రక్తం తీసుకోకుండా ఆ దాతను వెనక్కి పంపితే... ఆ విషయం కూడా స్పష్టంగా యాప్‌లో నమోదు చేస్తాం. ఎంతో మందితో ఫోన్‌లో మాట్లాడితే.. రోజుకు ఇద్దరు మగ్గురు మాత్రమే వస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు శిబిరాలు నిర్వహించే వరకు రక్తం కొరత కొనసాగే అవకాశం ఉంది. 

Updated Date - 2020-04-06T10:09:57+05:30 IST