‘బ్లడ్‌ కొలెస్ట్రాల్‌’ పెరుగుతోంది!

ABN , First Publish Date - 2020-06-06T08:05:17+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ప్రజల రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం భారీగా పెరుగుతోందని వెల్‌కంట్రస్ట్‌, బ్రిటిష్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది.

‘బ్లడ్‌ కొలెస్ట్రాల్‌’ పెరుగుతోంది!

  • ప్రపంచవ్యాప్తంగా ప్రజల రక్తంలో పెరుగుతున్న కొవ్వు శాతం
  • దేశంలో తెలుగు రాష్ట్రాల్లో అధికం
  • అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడి
  • ఆందోళనకరమన్న ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా ప్రజల రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం భారీగా పెరుగుతోందని వెల్‌కంట్రస్ట్‌, బ్రిటిష్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. 1980 నుంచి 2018 వరకూ 39ఏళ్ల పాటు దాదాపు 200 దేశాలకు చెందిన 10.20 కోట్ల మందిపై పరిశోధనలు నిర్వహించిన ఈ సంస్థలు ఈ విషయం తేల్చాయి. యూరో్‌పలోని అధికాదాయ దేశాల్లోని ప్రజల రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం తగ్గుతుండగా.. ఆసియాలోని అల్పాదాయదేశాల్లోని ప్రజల రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం పెరుగుతోంది. ఈ కథనాన్ని ఇటీవల సైంటిఫిక జర్నల్‌ ‘నేచర్‌’లో ప్రచురించారు. భారత్‌లో కొలెస్ట్రాల్‌ పెరుగుదల ఉన్నప్పటికీ ర్యాకింగ్‌లో మాత్రం 39 ఏళ్లుగా 128 స్థానంలోనే కొనసాగుతోంది. ఈ అంశంపై ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హేమలత స్పందిస్తూ.. ప్రజల రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం పెరుగుతున్నందు వల్ల ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మంది మరణిస్తున్నారని తెలిపారు.


తెలుగు రాష్ట్రాల్లో అధికం

1980తో పోల్చితే భారతీయుల రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరుగుతున్నప్పటికీ.. ర్యాంకుల పరంగా మాత్రం దేశం స్థిరంగా ఉంది. దేశంలోని ఇతర రాష్టాలతో పోల్చితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుదల ఎక్కువగా ఉంది. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుదల మాత్రం తక్కువగా ఉంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ వంటివి దీనిపై ప్రభావం చూపిస్తాయి. ఆహారంలో పళ్లు, కూరగాయలు, నట్స్‌, తృణధాన్యాలు, పప్పుదినుసుల శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసుకోవచ్చు.  

 డాక్టర్‌ ఏ లక్ష్మయ్య, ఐసీఎంఆర్‌ పబ్లిక్‌ హెల్త్‌ న్యూట్రిషియన్‌ విభాగాధిపతి, పరిశోధనలో భాగస్వామి 



Updated Date - 2020-06-06T08:05:17+05:30 IST