రక్తదానం ప్రాణదానంతో సమానం : ఆర్టీసీ ఆర్‌ఎం

ABN , First Publish Date - 2021-12-01T05:10:44+05:30 IST

రక్తదానం ప్రాణదానంతో సమానమని ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ సుదర్శన్‌ పేర్కొన్నారు.

రక్తదానం ప్రాణదానంతో సమానం : ఆర్టీసీ ఆర్‌ఎం
సంగారెడ్డి డిపోలో రక్తదానం చేస్తున్న డీఎం నాగభూషణం

సంగారెడ్డి అర్బన్‌, నవంబరు 30 : రక్తదానం ప్రాణదానంతో సమానమని ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ సుదర్శన్‌ పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు సంగారెడ్డి ఆర్టీసీ డిపోలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆర్‌ఎంతో పాటు మొత్తం 64 మంది రక్తదానం చేశారు. ఇలా ఉండగా రీజియన్‌ మొత్తం 357 మంది రక్తదానం చేసినట్లు ఆర్‌ఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రమేష్‌, డిపో మేనేజర్‌ నాగభూషణం, అసిస్టెంట్‌ మేనేజర్లు ఉపేందర్‌, నవీన్‌యాదవ్‌, రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ వనజారెడ్డి, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. 

జహీరాబాద్‌: రక్తదానం ప్రాణదానం లాంటిదని జహీరాబాద్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌, ఆర్టీసీ డిపో మేనేజర్‌ రమేష్‌ అన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు జహీరాబాద్‌లోని ఆర్టీసీ డిపోలో రెడ్‌క్రాస్‌ సొసైటీ వారి సౌజన్యంతో మంగళవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 50 మంది రక్తదానం చేయగా, వారికి ఎంవీఐ, డీఎం ప్రశంసాపత్రాలు అందజేశారు. అంతకుముందు ఎంవీఐ యశ్వంత్‌కుమార్‌ రక్తదానం చేశారు. అసిస్టెంట్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ అస్లాంపాషా, నాయకులు నామ రవికిరణ్‌, ఉద్యోగులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

నారాయణఖేడ్‌: ఖేడ్‌ ఆర్టీసీ డిపో కార్మికులు రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం డిపో ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 28 ఆర్టీసీ కార్మికులు, 12 మంది స్వచ్ఛంద కార్యకర్తలు రక్తదానం చేశారు. డీఎం రామచంద్రమూర్తి, పీవో శ్రీహరి, ఎంఎఫ్‌ ధనుంజయ్‌, రక్తనిధి కేంద్రం ఎల్‌టీ రాజేష్‌, సత్యనారాయణ, మార్కెటింగ్‌ సేల్‌ ఇన్‌చార్జి పాండు పాల్గొన్నారు. 

మెదక్‌ అర్బన్‌: రక్తదానంతో మరొకరి ప్రాణాన్ని కాపాడవచ్చని మెదక్‌ పట్టణ సీఐ వెంకట్‌ పేర్కొన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పిలుపుమేరకు మంగళవారం డిపో గ్యారేజ్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో మొత్తం 45 యూనిట్ల రక్తం సేకరించామన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ పెంటాగౌడ్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులు వెంకటేశం, కార్యాలయ పర్యవేక్షకుడు ఎంఆర్‌కె.రావు, అసిస్టెంట్‌ మేనేజర్‌ ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-01T05:10:44+05:30 IST