కార్లతో ఢీకొట్టి.. వేటకొడవళ్లతో అత్యంత కిరాతకంగా నరికి..

ABN , First Publish Date - 2021-06-18T05:35:57+05:30 IST

వేటకొడవళ్లు, గొడ్డళ్లు పట్ట పగలు..

కార్లతో ఢీకొట్టి.. వేటకొడవళ్లతో అత్యంత కిరాతకంగా నరికి..

పచ్చటి పల్లెపై నెత్తుటి మరక

టీడీపీ నాయకుల దారుణ హత్య

కార్లతో ఢీకొట్టి.. మారణాయుధాలతో దాడి

పెసరవాయిలో వైసీపీ వర్గీయుల దాష్టీకం

సోదరుడి సమాధి వద్దకు వెళుతుండగా..

పక్కా ప్రణాళికతో విరుచుకుపడిన ప్రత్యర్థులు

అక్కడికక్కడే మృతి చెందిన ప్రతాప్‌రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి

13 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు


గడివేముల(కర్నూలు): వేటకొడవళ్లు, గొడ్డళ్లు పట్ట పగలు కరాళ నృత్యం చేశాయి. మరుగున పడిందనుకున్న ఫ్యాక్షన్‌ రక్కసికి ప్రాణం పోశాయి. మనసులో పేరుకుపోయిన కసి.. విచక్షణను కోల్పోయేలా చేశాయి. సోదరుడికి మూన్నాళ్ల మెతుకు వేసేందుకు బాధాతప్త హృదయాలతో వెళ్తున్నవారి గొంతుకలను తెగనరికేశాయి. ఉత్తమ పంచాయతీగా వన్నెలీనిన పెసరవాయికి నెత్తుటి మరకలు అంటాయి. పాతికేళ్ల క్రితం మొదలైన దాడులు ఇద్దరి ప్రాణాలను నిర్దయగా బలితీసుకున్నాయి. గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో టీడీపీ నాయకులు వడ్డు ప్రతాప్‌రెడ్డి, వడ్డు నాగేశ్వర్‌రెడ్డి ప్రత్యర్థుల పాశవిక దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ప్రజలకు చేదోడుగా ఉండే ఇద్దరు విపక్ష నాయకులను వైసీపీ నాయకులు గురువారం ఉదయం దారుణంగా హత్య చేశారు. మొత్తం 13 మంది మూకుమ్మడిగా దాడి చేసి, హత్యలు చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. 


కార్లతో ఢీకొట్టి.. 

పోలీసులు, బంధువులు తెలిపిన సమాచారం మేరకు, టీడీపీ నాయకులు వడ్డు ప్రతాప్‌రెడ్డి, వడ్డు నాగేశ్వర్‌రెడ్డి సోదరుడు మోహన్‌రెడ్డి మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన సమాధి వద్ద మూడు నాళ్ల మెతుకులు వేసేందుకు గురువారం ఉదయం 6 గంటల సమయంలో వడ్డు సోదరులతో పాటు వడ్డు వెంకటేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, నారాయణరెడ్డి, గోపాల్‌రెడ్డి, వారి అనుచరులతో కలిసి శ్మశాన వాటికకు బయలు దేరారు. ఆ తరువాత కాసేపటికే దారి మధ్యలో అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు. మూడునాళ్ల మెతుకు కార్యక్రమానికి వడ్డు సోదరులు హాజరవుతారని ముందే గ్రహించిన ప్రత్యర్థులు, పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. నడుస్తూ వెళ్తోన్న వడ్డు సోదరుల బృందాన్ని వైసీపీ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, రాజారెడ్డి, ఎల్లారెడ్డి, అనుచరులతో కలిసి రెండు కార్లతో బలంగా ఢీ కొట్టారు. ఫలితంగా వడ్డు వర్గీయులు చెల్లాచెదురుగా పడిపోయారు. ఊహించని ఆ పరిణామం నుంచి తేరుకునేలోపే ప్రత్యర్థులు వేటకొడవళ్లు, గొడ్డళ్లతో విరుచుకుపడ్డారు. కిందపడ్డ వడ్డు నాగేశ్వర్‌రెడ్డి, వడ్డు ప్రతాప్‌రెడ్డిపై కత్తులు, వేటకొడళ్లతో దాడి చేశారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దాడిలో వెంకటేశ్వర్‌రెడ్డి కాలికి, వడ్డు సుబ్బారెడ్డి తలకు, వడ్డు వెంకటేశ్వర్‌రెడ్డి కాలికి రక్త గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


కేసు నమోదు

ప్రతాప్‌రెడ్డి భార్య వడ్డు లక్ష్మీదేవమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌రెడ్డి, ఎల్లారెడ్డి, రాజారెడ్డితో పాటు మరో 10 మందిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపారు. నిందితులపై ఐపీసీ సెక్షన్లు 147, 148 324, 307, 302 (రెడ్‌విత్‌ 149) కింద కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. 


శోకసంద్రంలో గ్రామం

సహకార సంఘం అధ్యక్షుడిగా 13 ఏళ్లపాటు సేవలు అందించిన వడ్డు ప్రతాప్‌రెడ్డికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వడ్డు నాగేశ్వర్‌రెడ్డి రెండు పర్యాయాలు పెసరవాయి గ్రామ సర్పంచ్‌గా సేవలు అందించారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. జంట హత్యలు జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే కూతుళ్లు, బంధువులు, గ్రామ ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. వడ్డు సోదరుల కూతుళ్ల ఆవేదనను చూసి పలువురు కంటతడి పెట్టారు. తమ బాగోగులు చూసుకునే నాయకులు హత్యకు గురవడంతో ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. పాతికేళ్ల తరువాత గ్రామంలో హత్యలు జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 


నిందితుల కోసం గాలింపు 

పెసరవాయిలో జంట హత్యల విషయం తెలుసుకున్న వెంటనే నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి, పాణ్యం సీఐ జీవన్‌ గంగనాథ్‌బాబు, ఎస్‌ఐ శ్రీధర్‌ తమ సిబ్బందితో గ్రామానికి హుటాహుటిన చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకొని హత్యలు జరిగిన తీరును పరిశీలించారు. కర్నూలు నుంచి డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌ను రప్పించి ఆధారాలను సేకరించారు. డాగ్‌స్క్వాడ్‌ వేల్పనూరు రస్తాకు వెళ్లి, పెసరవాయి బస్టాండు వరకు చేరుకుని ఆగిపోయింది. గాయపడ్డ వారిని పోలీసులు నంద్యాలలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. దాడిలో గాయపడిన వెంకటేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డికి నంద్యాల ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందించారు. తామందరం కలిసి వెళ్తుండగా వెనుక నుంచి బొలేరో వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టిందని, చెల్లా చెదరుగా పడిపోయామని వారు తెలిపారు. తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోవడంతో అక్కడ ఏం జరిగిందో తమకు తెలియలేదని అన్నారు.


పాతికేళ్ల క్రితం..

పచ్చని పంటలతో ప్రశాంతంగా ఉన్న పెసరవాయిలో 1996లో ఫ్యాక్షన్‌కు బీజం పడింది. దాడులతో మొదలై హత్యల దాకా దారి తీసింది. 2013లో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మొదట రెండున్నరేళ్లు వడ్డు నాగేశ్వర్‌రెడ్డి, చివరి రెండున్నర ఏళ్లు రాజారెడ్డి సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించేలా పెద్దల సమక్షంలో ఒప్పందం కుదిరింది. మారిన రాజకీయ పరిణామాలతో వడ్డు నాగేశ్వర్‌రెడ్డి ఐదేళ్లపాటు సర్పంచ్‌గా కొనసాగారు. దీంతో రాజారెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి వర్గాల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వడ్డు ప్రతాప్‌రెడ్డి, వడ్డు నాగేశ్వర్‌రెడ్డి ఓ అభ్యర్థిని బలపరిచి పోటీ చేయించారు. దొంగ ఓటు వేసేందుకు వచ్చిన వారిని బూత్‌ వద్ద వడ్డు ప్రతాప్‌రెడ్డి అడ్డుకున్నారు. ఆ సమయంలోనే ప్రతాప్‌ రెడ్డిపై వైసీపీ నాయకులు దాడి చేయించారు. దీంతో ప్రతాప్‌రెడ్డి పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన దాడి గురించి తెలిపి, ఆవేదన వెలిబుచ్చాడే తప్ప ఫిర్యాదు చేయలేదు. దీంతో పోలీసులు పట్టించుకోలేదు. నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి లేకుంటే తమ రాజకీయ ఎదుగుదలకు అడ్డు ఉండదని, దీనికి వారిని అంతమొందించడమే పరిష్కారమని శ్రీకాంత్‌రెడ్డి, రాజా రెడ్డి ఈ దారుణానికి ఒడి గట్టారని వడ్డు లక్ష్మీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


నేడు నారా లోకేశ్‌ రాక

జంట హత్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు పెసరవాయికి ఆయన శుక్రవారం వస్తున్నారు. ఉదయం రోడ్డు మార్గంలో చేరుకుని వడ్డు సోదరుల అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారు. 


ముమ్మాటికీ రాజకీయ హత్యలే: గౌరు చరిత

పెసరవాయి గ్రామంలో జరిగిన జంట హత్యలు రాజకీయ హత్యలేనని టీడీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి తెలిపారు. సంఘటనా స్థలికి చేరుకున్న అనంతరం ప్రత్యర్థుల దాడిలో హత్యకు గురైన వడ్డు ప్రతాప్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి మృతదేహాలను ఆమె పరిశీలించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తర్వాత ఆమె మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. సర్పంచ్‌ ఎన్నికల్లో ప్రతాప్‌రెడ్డిపై ప్రత్యర్థులు దాడి చేశారన్నారు. దీంతో తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ప్రతాప్‌రెడ్డి విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. హత్యలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో ఈ జంట హత్యలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయన్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయకుండా దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెప్తారన్నారు. 


టీడీపీ నాయకుల పరామర్శ

నంద్యాల: వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడిన వారిని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పరామర్శించారు. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. మార్చురీ గదిలో ఉన్న మృతదేహాలను చూసి ఆవేదన చెందారు. వడ్డు సోదరుల కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. 


పెసరవాయిలో జంట హత్యల విషయం తెలుసుకున్న జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ నంద్యాల ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించారు. క్షతగాత్రులను పరామర్శించారు. దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2021-06-18T05:35:57+05:30 IST