నెత్తురోడుతున్న ఎన్‌హెచ్‌44!

ABN , First Publish Date - 2022-02-09T06:08:30+05:30 IST

అందమైన నాలుగు వరుసల రహదారితో సుదూర ప్రయాణం మరింత సుఖవంతమవుతుందని, ఎంతో ఆనంద పడ్డ వాహనదారులకు జిల్లాలో నిత్యం ఎక్కడో ఓ చోట ప్రమాదం జరిగి రహదారి నెత్తురోడుతోంది.

నెత్తురోడుతున్న ఎన్‌హెచ్‌44!
పెట్రోల్‌ బంక్‌ వద్ద రోడ్డుపై నిలిచిన లారీలు

ప్రమాదాలకు నిలయంగా మారిన జాతీయ రహదారి

గడిచిన నెల రోజుల్లోనే 14 మంది మృతి

రహదారి నిర్మాణంలో అనేక లోపాలు

హైవే ఆథారిటీ నిర్లక్ష్యం ప్రయాణికుల పాలిట శాపం

జరిమానాల పైనే దృష్టి సారిస్తున్న పోలీసులు

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి8 (ఆంధ్రజ్యోతి) : అందమైన నాలుగు వరుసల రహదారితో సుదూర ప్రయాణం మరింత సుఖవంతమవుతుందని, ఎంతో ఆనంద పడ్డ వాహనదారులకు జిల్లాలో నిత్యం ఎక్కడో ఓ చోట ప్రమాదం జరిగి రహదారి నెత్తురోడుతోంది. ప్రమాదం జరిగినప్పుడే సంబంధిత అధికారులు హడావుడి  చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు. 44వ జాతీయ రహదారి జిల్లా మీదుగా సుమారుగా 85కి.మీల మేర ఉంది. నేరడిగొండ మండలంలోని ఆరెపల్లిలో మొదలై జైనథ్‌ మండలం డొల్లార వద్ద ముగుస్తుంది. రహదారిని ఆనుకుని ఉన్న నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్‌, మావల, జైనథ్‌ మండలాల పరిధిలోనే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది జిల్లాలో 245 రోడ్డు ప్రమాదాలు జరగగా 137 మంది మరణించారు. ఈ ఏడాది జనవరి మాసంలోనే 21 ప్రమాదాలు జరిగి 13 మంది మృతి చెందారని పోలీసుల లెక్కల ప్రకారం తెలుస్తోంది. కానీ చికిత్స పొందుతూ మరెందరో మంది మరణించగా శాశ్వతంగా వికలాంగులై కొందరు మంచానికే పరిమితమై నరకయాతన పడుతున్నారు. మరికొంత మంది స్వల్ప గాయాలై ఆసుపత్రుల పాలవుతున్నా దాఖలాలున్నాయి. ఇలా యేటా ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోతు రోడ్డున పడుతున్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. అయితే నేషనల్‌ హైవే ఆథారిటీ నిండు నిర్లక్ష్యం కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకునే వారే కరువవుతున్నారు. పోలీసులు కూడా అడపాదడపా తనిఖీలు చేస్తూ వదిలేస్తున్నారనే ఆరోపణలు కూడా లేక పోలేదు. 

పత్తాలేని హైవే పెట్రోలింగ్‌..

నిరంతరం రహదారిపై పెట్రోలింగ్‌ చేపట్టి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాల్సిన హైవే ఆథారిటీ పెట్రోలింగ్‌ పత్తా లేకుండానే పోయింది. ఎక్కడైనా ప్రమాదం జరిగిన, వాహనాలు మరమ్మతులతో రోడ్డుపై నిలిపిన క్షణాల్లో తొలగించి ఎలాంటి ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆపద సమయంలో అంబులెన్స్‌కు సమాచారం అందించేందుకు కూడా రహదారిపై టెలీఫోన్‌ స్తంభాలు నిరుపయోగంగానే కనిపిస్తున్నాయి. ప్రమాదబాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించాల్సి ఉన్న పట్టించుకోవడమే లేదు. కానీ నిత్యం నామమాత్రంగా పెట్రోలింగ్‌ చేస్తూ ఎక్కడో ఓ చోట వాహనాన్ని నిలిపి కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని గ్రామాల సమీపంలో ప్రమాదకరంగా ఎడ్లబండ్లు రోడ్డును దాటుతున్న పట్టించుకోవడం లేదు. రోడ్డు పై యథేచ్ఛగా పశువులు, జంతువుల సంచారం కూడా కనిపిస్తోంది. రహదారికి ఇరువైపులా ముళ్లకంచెను ఏర్పాటు చేసిన పూర్తిగా ధ్వంసమై పోయి భద్రత లేకుండానే పోయింది. పార్కింగ్‌ స్థలాలు ఖాళీగానే కనిపిస్తున్నా దర్జాగా రోడ్డుపై వాహనాలు నిలుపడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇదంతా అధికారులకు తెలిసిన అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు.

ఐదు చోట్లనే పార్కింగ్‌కు అనుమతి..

జిల్లా మీదుగా రహదారిపై కేవలం ఐదు చోట్లనే వాహనాల పార్కింగ్‌కు నేషనల్‌ హైవే ఆథారిటీ అనుమతించింది. కానీ అడుగడుగునా రహదారిపైవాహనాలు నిలుపడంతో రెప్పపాటులోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. నేరడిగొండ మండలం కోర్టికల్‌, మండల కేంద్రం సమీపంలోని దాబా హోటళ్ల వద్ద, ఇచ్చోడ మండలం పెట్రోల్‌బంక్‌ ముందు, గుడిహత్నూర్‌ మండలం సీతాగొందీ పెట్రోల్‌బంక్‌ పక్కన, జైనథ్‌ మండలం రిలియన్స్‌ పెట్రోల్‌బంక్‌ ముందు మాత్రమే వాహనాల పార్కింగ్‌కు స్థలాలను కేటాయించారు. కానీ సీతాగొందీ దాబాల ముందు విచ్చలవిడిగా నడిరోడ్డు పైననే వాహనాలను నిలుపుతున్న పట్టించుకునే నాథుడే లేడు. ఎక్కడైనా మరమ్మతులు వచ్చినా ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకుండానే భారీ వాహనాలను రోడ్డుపై నిలపడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రహదారి నిర్మాణంలో ఎన్నో సాంకేతిక లోపాలు కనిపిస్తున్నా దిద్దుబాటు చర్యలు చేపట్టం లేదు. జిల్లాలో రహదారిపై 11 బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించిన భద్రత చర్యలు చేపట్టక పోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.


Updated Date - 2022-02-09T06:08:30+05:30 IST