చేరుకోని బోట్లు

ABN , First Publish Date - 2020-06-01T09:46:39+05:30 IST

సముద్ర వేటకు వేళయింది. ఈ ఏడాది 15 రోజుల ముందుగానే అనుమతించినా ఆదివారం సాయంత్రానికి ఒక్క బోటు మాత్రమే వచ్చింది.

చేరుకోని బోట్లు

నేటి నుంచి సముద్రపు వేట.. ఎగుమతులపై వీడని భయాలు


నరసాపురం, మే 31 : సముద్ర వేటకు వేళయింది. ఈ ఏడాది 15 రోజుల ముందుగానే అనుమతించినా ఆదివారం సాయంత్రానికి ఒక్క బోటు మాత్రమే వచ్చింది. దీంతో వేట ఎప్పటి నుంచి సాగుతుందోనన్న సందిగ్ధత నెలకొంది. పశ్చిమలో 19 కిలోమీటర్ల మేర సముద్రతీరం ఉంది. సీజన్‌లో వందలాది బోట్లు ఇక్కడికి వేటాడేందుకు వస్తుంటాయి. విదేశీ మార్కెట్‌లో అత్యధికంగా డిమాండ్‌వున్న సందువాయి, పండుగొప్ప, రొయ్య తదితర మత్స్య సంపదకు తూర్పు, నెల్లూరు, నిజాంపట్నం, చీరాల, మచిలీపట్నం తదితరప్రాంతా ల నుంచి వేటాడేందుకు వస్తుంటారు. ఈ ఏడాది లాక్‌డౌన్‌తో మార్చి నుంచే వేటకు విరా మం ప్రకటించారు. వేటాడి తీసుకొచ్చిన సరుకు ఎగుమతయ్యే అవకాశం లేకపోవడంతో ఏప్రిల్‌ వరకు ప్రభుత్వం అనుమతించినా చాలామంది ముందస్తు విరామం తీసుకుని వెళ్లిపోయారు.


ఉపాధి లేక పస్తులతో ఉంటున్న వీరి పరిస్థితిని గమనించిన ప్రభుత్వం 15 రోజుల ముందుగా వేటకు అనుమతించింది. ‘ముందస్తుగా వేటకు అనుమతి ఇవ్వడం మంచిదే. ఇప్పటికే చాలా దేశాలు మత్స్య సంపద ఎగుమతులు నిలిపివేశాయి. ఈ సమ యంలో వేటాడి తీసుకొచ్చిన సరుకును ఎగుమతిదారులు గిట్టుబాటు ధరకు కొంటారా? లేక ఎక్స్‌పోర్టు కారణంగా చూపి అయినకాడికి కొనుగోలు చేస్తారా..? అన్న భయం చాలా మందిని వెంటాడుతోంది. ఇదే జరిగితే వేటకు వెళ్లినా ఖర్చులు మిగలవు. దీంతో చాలా మంది వేచిచూసే ధోరణలో ఉన్నార’ని బోటు యజమాని పీతల ప్రసాద్‌ అన్నారు.

Updated Date - 2020-06-01T09:46:39+05:30 IST