బోడసకుర్రు టిడ్కో భవన సముదాయానికి విముక్తి!

ABN , First Publish Date - 2020-12-01T07:12:44+05:30 IST

కొవిడ్‌-19 బాధితుల పాలిట వరప్రదాయినిగా మారిన అల్ల వరం మండలం బోడసకుర్రులోని టిడ్కో గృహాల సముదా యానికి ఎట్టకేలకు విముక్తి లభించింది.

బోడసకుర్రు టిడ్కో భవన సముదాయానికి విముక్తి!

కొవిడ్‌ బాధితులకు వరప్రదాయినిగా నాలుగు నెలలపాటు సేవలు 

కొవిడ్‌కేర్‌ సెంటర్‌లో 9 వేల మందికి పైగా బాధితులకు వైద్య సేవలు

టిడ్కో ఇళ్ల పంపిణీ నేపథ్యంలో సీసీ సెంటర్‌ ఖాళీ


(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌-19 బాధితుల పాలిట వరప్రదాయినిగా మారిన అల్ల వరం మండలం బోడసకుర్రులోని టిడ్కో గృహాల సముదా యానికి ఎట్టకేలకు విముక్తి లభించింది. వేలాది మంది కొవిడ్‌ బాధితులకు నాలుగు నెలలకు పైగా అవిశ్రాంత సేవలు అందించిన ఈ భవన సముదాయంలో కొవిడ్‌ సేవలను పూర్తిగా నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు 25న టిడ్కో గృహాలను లబ్ధిదారు లకు అందించనున్న నేపథ్యంలో వీటిని ఖాళీ చేశారనే ప్రచారం జోరందుకుంది. జిల్లాలో టిడ్కో సంస్థ నిర్మించిన గృహ సముదాయాల్లో రాజమహేంద్రవరానికి సమీపంలో ఉన్న బొమ్మూరు గృహాలతోపాటు అల్లవరం మండలం బోడస కుర్రులో నిర్మించిన గృహాల సముదాయాన్ని కొవిడ్‌-19 బాధితుల కోసం ప్రభుత్వం అప్పట్లో కేటాయించారు. దీనిలో భాగంగా బోడసకుర్రులో నిర్మించిన గృహ సముదాయాలకు మౌలిక సదుపాయాలు కల్పించి జూలై 24వ తేదీన బోడస కుర్రు కొవిడ్‌కేర్‌ సెంటర్‌ను అధికారికంగా కొవిడ్‌ బాధితుల కోసం ప్రారంభించారు. సుమారు నాలుగు నెలలపాటు అవిశ్రాంత సేవలు అందించిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఈనెల 28వ తేదీన మూసివేశారు. జిల్లాలోనే అత్యున్నత సేవలు అందించిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా కూడా బోడసకుర్రు చరిత్ర కెక్కిందని రీజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నితీష్‌కుమార్‌ చెప్పారు. రాష్ట్ర స్థాయిలో వైద్య ఆరోగ్యశాఖ నుంచి సైతం ప్రశంసలు అందుకున్న సెంటర్లలో ఇదొకటి. కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉన్న పరిస్థితుల్లో అప్పట్లో ఈ సెంటర్‌ ఏర్పాటు చేశారు. సుమారు 9,235 మంది బాఽధితులు వైద్యసేవలు పొందారు. ఉన్నత వైద్యసేవలు అందించే నిమిత్తం 145 మంది బాధితులను వివిధ ఆసుపత్రులకు  తరలించారు. కొవిడ్‌ సోకిన వారిలో ఈ సెంటర్‌లో ముగ్గురు మాత్రమే ప్రాణాలు విడిచారు. ఒకేరోజు అత్యధికంగా 1,356 మంది బాధితులు చేరడం రికార్డు. నిత్యం బాధితులకు పర్యాటకశాఖ ద్వారా మంచి బలవర్థకమైన ఆహారంతోపాటు పీహెచ్‌సీ సిబ్బంది వైద్య సేవలు అందించారు. ఆర్‌ఎంవో డాక్టర్‌ నితీష్‌కుమార్‌తోపాటు అల్లవరం మండల తహశీల్దార్‌ ఎస్‌ అప్పారావు, గతంలో పనిచేసిన మున్సిపల్‌ కమిషనర్‌ కేవీఆర్‌ ఆర్‌ రాజు, ప్రస్తుత కమిషనర్‌ వీఐపీ నాయుడు పర్యవేక్షణలో బాధితులకు సేవలు అందించారు. మున్సిపాలిటీ నుంచి ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని నియమించి కొవిడ్‌ బాధితులకు సేవలు అందించడంలో మున్సిపల్‌ అధికారులు తీసుకున్న చర్యలు పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కోనసీమతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొవిడ్‌ బాధితులను ఈ సెంటర్‌లోనే ఉంచి సేవలు అందిం చారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నారన్న ప్రచారంతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను హడావుడిగా ఖాళీచేసినట్టు ప్రచారం జరుగు తోంది. అయితే గత చంద్రబాబు ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తారా లేదా అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది.

సెకండ్‌ వేవ్‌ వస్తే..

కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తతోనే వ్యవహరిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా కేసుల సంఖ్య 40 నుంచి 100లోపే నమోదు  అవుతున్నాయి. అయితే స్వల్ప లక్షణాలతో మాత్రమే ఈ కేసులు నమోదవుతున్న దృష్ట్యా బాధితులు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌కే పరిమితమవుతున్నారు. డిసెంబరు నుంచి మరో రెండు నెలలపాటు సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఉండవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో బోడసకుర్రు వంటి కొవిడ్‌కేర్‌ సెంటర్‌ ఎత్తివేస్తే పరిస్థితి ఏమిటని బాధితులతోపాటు ప్రజలు ఆందో ళన చెందుతున్నారు. విద్యా సంస్థలు తెరవడంతో కేసుల సంఖ్య ఏ రీతిన ఉంటుందోననే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.



Updated Date - 2020-12-01T07:12:44+05:30 IST