ప్రారంభమైన బొడ్డెమ్మ వేడుకలు

ABN , First Publish Date - 2022-09-26T05:47:17+05:30 IST

తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ సంబురాలు ఎంగిలిపూల బతుకమ్మతో ఆదివా రం ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఉత్సాహంగా మహిళలు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ప్రతియేటా భాద్రపద అమావాస్య రోజు నుంచి ప్రారంభమయ్యే బొడ్డెమ్మ సంబురాల్లో మొదటిరోజు మహిళలు వివిధరకాల పూలతో ఒక అంతరంగా పేర్చి అందులో గౌరమ్మను ఉంచి

ప్రారంభమైన బొడ్డెమ్మ వేడుకలు
నిజామాబాద్‌లో స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న రాష్ట్ర మహిళ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆకుల లలిత

తొలిరోజు ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ

గ్రామాల్లో ఆడి, పాడిన మహిళలు

నిజామాబాద్‌ కల్చరల్‌, సెప్టెంబరు 25: తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ సంబురాలు ఎంగిలిపూల బతుకమ్మతో ఆదివా రం ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఉత్సాహంగా మహిళలు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ప్రతియేటా భాద్రపద అమావాస్య రోజు నుంచి ప్రారంభమయ్యే బొడ్డెమ్మ సంబురాల్లో మొదటిరోజు మహిళలు వివిధరకాల పూలతో ఒక అంతరంగా పేర్చి అందులో గౌరమ్మను ఉంచి పూజించడం ఆనవాయితీగా వస్తోంది. మహిళలు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి బతుకమ్మ ఆడారు. ‘వెనకొచ్చే ఆవులారా ఉయ్యాలో.. ఎర్ర ఆవులారా ఉయ్యాలో.. మీరందరు వస్తిరి ఉయ్యాలో.. నాకొడుకేడి ఉయ్యాలో..’ అంటూ మహిళలు బతుకమ్మ చుట్టూ పాటకు అనుగుణంగా లయబద్దంగా తిరుగుతూ బతుకమ్మ ఆడారు. గ్రామాలు మొదలుకొని వీధుల వరకు మహిళ లు ఉత్సాహంగా బతుకమ్మ సంబురాల్లో పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. మొదటి రోజు బతుకమ్మను పురస్కరించుకుని గౌరమ్మకు మొదటి రోజున నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపిన నైవేద్యాన్ని సమర్పించారు. ముత్తైదువులకు వాయనాలు ఇచ్చుకుని బతుకమ్మను నిమజ్జనం చేశారు. 

రెండో రోజు అటుకుల బతుకమ్మ

బతుకమ్మ సంబురాల్లో భాగంగా సోమవారం రెండో రోజున మహిళలు బొడ్డెమ్మను అటుకుల బతుకమ్మగా పూజిస్తారు.  బతుకమ్మను రెండు అంతరాలుగా పేర్చి బెల్లం, అటుకులతో తయారుచేసిన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు.

నగరంలోనూ బతుకమ్మ సంబరాలు

నగరంలోని న్యాల్‌కల్‌ రోడ్‌లో గల కోదండ రామాలయంలో ఆదివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన మేయర్‌ నీతూ కిరణ్‌ మాట్లాడుతూ 9రోజుల పాటు మహిళలంతా ఉత్సామంగా ఈ బతుకమ్మ వేడుకలు జరుపుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మహిళలతో బతుకమ్మలను చెరువు వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.

Updated Date - 2022-09-26T05:47:17+05:30 IST