శరీరం.. ధర్మ సాధనం

ABN , First Publish Date - 2020-03-06T10:13:15+05:30 IST

శరీరం.. ధర్మ సాధనం

శరీరం.. ధర్మ సాధనం

అమరుఁజెవి శాస్త్రమున కుండలమునగాదు

వలయముననొప్ప దీవిచే వెలయుఁబాణి

ఉరుదయాఢ్యుల మేను పరోపకార

కలన రాణించు; గంధంబువలన గాదు

చెవులు.. వినడం వల్ల రాణిస్తాయి తప్ప, కుండలాల వల్ల కాదు! చేతులు దానం చేయడం వల్ల రాణిస్తాయి తప్ప కంకణాల వల్ల కాదు. గొప్పవారైన దయార్ద్ర హృదయుల శరీరం.. పరోపకారం వల్ల రాణిస్తుంది తప్ప సువాసనలు గల మైపూతతో కాదు అని ఈ సుభాషిత రత్నం అర్థం. నిజమే. ‘శరీరం ఖలు ధర్మసాధనం’ అని ఆర్యోక్తి. సనాతనుడు, శాశ్వతుడు అయిన జీవుడు... అశాశ్వతం, నశ్వరం, అయిన శరీరంలో ఉన్నంత వరకూ పవిత్రమైన కర్మలను ఆచరించడం ద్వారా జన్మను సార్థకం చేసుకోవాలి. అందుకోసం అవసరమైన అవయవ నిర్మాణాన్ని పరమేశ్వరుడు తన నిర్హేతుకమైన కృపతో కటాక్షించాడు. ఆ పరమాత్మ మనపై ప్రసరించిన కృపను సద్వినియోగం చేసుకోవడమే మనం చేయాల్సిన పని. అందుకు ఏం చేయాలి? అంటే.. దీపపు వెలుగు ఎల్లప్పుడూ ఊర్థ్వముఖంవైపు ప్రసరించినట్లు.. సర్వకాల సర్వావస్థలయందూ ధర్మ సంబంధమైన ప్రగతి మార్గంలో పయనించడమే మనం చేయాల్సిన పని. శాస్త్రజ్ఞానాన్ని తెలుసుకోవడం, దాన కర్మాచరణం, పరోపకార పరాయణత్వం అనే మూడు విధానాలు ధర్మసాధనకు ఉపకరిస్తాయి. 


మానవుడు జ్ఞానసంపూర్ణుడుగా మనడానికి, లోకోపకారిగా కావడానికి శాస్త్రజ్ఞానం ఎంతైనా అవసరం. అశాశ్వతమైన శరీర భూషణాల వల్ల అలౌకికనందాన్ని సాధించడం అసాధ్యం. వేదవేదాంత శాస్త్ర జ్ఞానం.. వ్యక్తి చేసే సర్వకార్యాలనూ సులభంగా సఫలీకృతం చేస్తుంది. అందుకు అవసరమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగించి, వ్యక్తిలో నూతనోత్తేజాన్ని నింపి, శరీరాన్ని జ్ఞానజ్యోతిమయంగా రూపొందించి, ఆత్మానందాన్ని కలిగిస్తుంది. ఇక, ధర్మసాధనలో రెండో ఉపకరణం.. దానగుణం. అది మహత్తరమైన ఆశయాల సమాహారం. అన్నదానం, వస్త్రదానం, భూదానం, గోదానం, ధనదానం, సువర్ణదానం, ధాన్యదానం, విద్యాదానం.. ఒకటేమిటి? అర్హతకు తగిన విధంగా ఎన్ని దానాలైనా చేయొచ్చు. మరణానంతరం జీవుడి వెంట వచ్చేది.. తన జీవనప్రస్థానంలో చేసిన పాపపుణ్యాల ఫలితాలే.


అందుకే జీవించి ఉన్నప్పుడే మంచి పనులు చేయాలి. ‘పరోపకారమిదం శరీరం’ అనే ఆర్యోక్తిననుసరించి ఇతరులకు ఉపకారం చేయాలి. అందుకోసమే మన శరీరం ఉన్నదని తెలుసుకోవాలి. అనాథలను ఆదుకోవడం, తోటివారిలో దైవాన్ని దర్శించి ప్రేమించడం, చేసిన దానధర్మాల ఫలితాన్ని నిస్వార్థంగా దైవానికి అర్పించడం ఇవన్నీ ముక్తిసాధనాలు. సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నా.. ముక్తికి అవసరమైన దైవారాధన చేయగలిగే శక్తి ఉన్నది ఒక్క మానవులకు మాత్రమే. అంతటి ఉత్కృష్టమైన మానవజన్మ ప్రాధాన్యతను తెలుసుకోలేని అజ్ఞానులతో సమాజ అభ్యున్నతి కుంటుపడుతుంది.


వల్లూరు చిన్నయ్య, 9948348918

Updated Date - 2020-03-06T10:13:15+05:30 IST