బోయిన్‌పల్లి కిడ్నాప్‌.. మరో 15 మంది అరెస్టు

ABN , First Publish Date - 2021-01-18T08:38:22+05:30 IST

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో పోలీసులు మరో 15 మందిని అరెస్టు చేశారు. ఇప్పటికే ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఎన్‌.మల్లికార్జున్‌రెడ్డి, బోయ సంపత్‌, బాల చెన్నయ్య అరెస్టు కాగా..

బోయిన్‌పల్లి కిడ్నాప్‌.. మరో 15 మంది అరెస్టు

మొత్తం 19కి చేరిన అరెస్టులు.. పరారీలోనే గుంటూరు శ్రీను, భార్గవరామ్‌


హైదరాబాద్‌ సిటీ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో పోలీసులు మరో 15 మందిని అరెస్టు చేశారు. ఇప్పటికే ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఎన్‌.మల్లికార్జున్‌రెడ్డి, బోయ సంపత్‌, బాల చెన్నయ్య అరెస్టు కాగా.. తాజా అరెస్టులతో పట్టుబడ్డ నిందితుల సంఖ్య 19కి చేరింది. కిడ్నాప్‌ కేసులో కీలకంగా వ్యవహరించిన భార్గవరామ్‌, గుంటూరు శ్రీను ఇంకా పరారీలోనే ఉండగా.. అఖిలప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి, మరిది, అత్తమామలనూ ఈ కేసులో చేర్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తర మండలం డీసీపీ కల్మేశ్వర్‌ సింగన్‌వార్‌తో కలిసి హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వివరాలు వెల్లడించారు.


తాజాగా ఈవెంట్‌ మేనేజర్‌ మాదాల సిద్ధార్థ, బొజ్జగాని దేవప్రసాద్‌, మొగిలి భాను, రాగోలు అంజయ్య, పదిర రవిచంద్ర, పచ్చిగల్లి రాజా అలియాస్‌ చంటి, బానోత్‌ సాయి, దేవరకొండ వంశీ, కందుల శివ, దేవరకొండ కృష్ణసాయి, దేవరకొండ నాగరాజు, బొజ్జగాని సాయి, మీసాల శ్రీను, అన్నెపాక ప్రకాశ్‌, షేక్‌ దావూద్‌లను అరెస్టు చేసినట్లు సీపీ వివరించారు. అరెస్టయినవారిలో మాదాల సిద్ధార్థ ఈ కిడ్నాప్‌ వ్యవహారంలో 20 మందిని సమకూర్చినట్లు తెలిపారు. అందుకోసం అతను రూ. 5 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. మాదాల శ్రీను అలియాస్‌ గుంటూరు శ్రీనుకు అతను కుడిభుజం లాంటివాడని చెప్పారు. మిగతా నిందితులంతా కిడ్నాప్‌ వ్యవహారంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారన్నారు. కిడ్నాప్‌ సమయంలో భార్గవరామ్‌తోపాటు.. భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి, మరో నలుగురు ఓ కారులో ఉన్నట్లు గుర్తించామని సీపీ తెలిపారు. 


బాధితులతో స్టాంప్‌ పేపర్లపై సంతకాలు

ప్రవీణ్‌కుమార్‌, నవీన్‌కుమార్‌, సునీల్‌రావును కిడ్నాప్‌ చేసిన నిందితులు.. నేరుగా వారిని మొయినాబాద్‌లోని భార్గవరామ్‌ గెస్ట్‌హౌ్‌సకు తీసుకెళ్లారని సీపీ చెప్పారు. భార్గవ్‌రామ్‌, మల్లికార్జున్‌రెడ్డి, సంపత్‌ ముందే 10 స్టాంపు పేపర్లను సిద్ధం చేసుకున్నారని, వాటిపై బాధితుల సంతకాలు తీసుకున్నారని వెల్లడించారు. భార్గవరామ్‌, గుంటూరు శ్రీనును అరెస్టు చేయకపోవడానికి కారణాలపై విలేకరులు ప్రశ్నించగా.. వారి కోసం గాలిస్తున్నామని సీపీ అంజనీకుమార్‌ అన్నారు. ‘‘మీకేమైనా సమాచారం ఉంటే మాతో షేర్‌ చేయండి.. ఇప్పుడే బృందాలను పంపిస్తాం. అరెస్టు చేస్తాం’’ అని సీపీ పేర్కొన్నారు.

Updated Date - 2021-01-18T08:38:22+05:30 IST