మేకప్ వేసుకుని బిగ్ స్క్రీన్‌పై సెటిలైపోయిన ఇంజనీర్స్!

సినిమా రంగంలోకి వచ్చే వారంటే గతంలో కొంత చిన్న చూపు ఉండేది. పెద్దగా చదవు అబ్బని వారు అలా అలా వచ్చేస్తారని చెప్పుకునే వారు. అప్పట్లో అది నిజమో కాదోగానీ ఇప్పుడు మాత్రం అస్సలు సత్యం కాదు. ఎందుకంటే, ఇప్పుడు చాలా మంది బాగా చదువుకుని కూడా సినిమా రంగంలోకి దూకేస్తున్నారు. మరీ ముఖ్యంగా, హీరోహీరోయిన్స్ అవ్వటానికి యూత్ తెగ ఆరాపడుతున్నారు. ప్రస్తుతం మన ఇండియన్ స్క్రీన్‌పై స్టార్స్‌గా వెలిగిపోతోన్న ఇంజనీర్స్ ఎవరో తెలుసా? బీటెక్ చదివిన బిగ్ స్క్రీన్ సెలబ్స్‌పై ఓ లుక్ వేద్దాం పదండీ... 

కార్తీక్ ఆర్యన్...

బాలీవుడ్‌లో ప్రస్తుతం లవర్ బాయ్ అనగానే గుర్తొచ్చే ఫేస్ కార్తీక్ ఆర్యన్‌దే. గ్వాలియర్ నుంచీ ఇంజనీరింగ్ చదువుకోటానికి ముంబై వచ్చిన ఈ యంగ్ అండ్ హ్యాండ్సమ్ ఇంట్లో వారికి కూడా చెప్పకుండా సినిమా ఆడిషన్స్‌కి అటెండ్ అయ్యాడు. ‘ప్యార్ కా పంచ్‌నామా‘ సినిమాతో హీరో కూడా అయిపోయాడు. ఇంజనీర్ అయ్యేందుకు ఇంటి నుంచీ బయలుదేరి ఇవాళ్ల కోట్లాది మంది అమ్మాయిల ఇష్ట సఖుడు అయిపోయాడు! 

ఆర్. మాధవన్

కోలీవుడ్ నుంచీ బాలీవుడ్ దాకా అన్ని ఉడ్స్‌లోనూ మాధవన్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఎంత అందగాడో అంత తెలివైన వాడు కూడా! రీల్ లైఫ్‌లోనే కాదు... రియల్ లైఫ్‌లోనూ మ్యాడీ సూపర్ ఇంటలిజెంట్. ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీర్ అయిన ఆయన చిన్నప్పుడు వెరీ సక్సెస్‌ఫుల్ ఎన్‌సీసీ క్యాడెట్ కూడా. విద్యార్థిగా ఉండగానే బ్రిటీష్ రాయల్ ఆర్మీ వద్ద సైనికుడిగా ట్రైనింగ్ తీసుకున్నాడు. అందుకే, ఈ ఇంజనీర్ కమ్ యాక్టర్ ఏనాడూ క్రమశిక్షణ కోల్పోకుండా అన్నిచోట్లా, అందరి వద్ద మంచి పేరు తెచ్చుకోగలిగాడు!

కృతీ సనోన్ 

మహా శిల్పి ఎవరో చెక్కినట్టుండే అందమైన ఆకృతి... కృతీ సనోన్ స్వంతం! అయితే, మన ‘వన్‘ బ్యూటీ కేవలం లుక్స్ విషయంలోనే కాదు స్టడీస్ విషయంలోనూ సూపరే! కృతీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బీటెక్ పూర్తి చేసింది. తరువాత గేరు మార్చి, స్పీడ్ పెంచి గ్లామర్ ప్రపంచంలోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ మంచి జోరు మీద ఉంది ఈ ‘పరమ్ సుందరి‘!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 

తాను విషాదంతమై, అభిమానులకి తీరని లోటు మిగిల్చిన సుశాంత్ సింగ్ కూడా ఇంజనీరింగ్ స్టూడెంటే. అయితే, ఆల్ ఇండియా లెవల్లో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలో ఏడవ ర్యాంక్ తెచ్చుకున్న ఈ హైలీ ఇంటలిజెంట్ స్టూడెంట్ బుల్లితెర మీద, పెద్ద తెర మీద ఎంతో పేరు సంపాదించుకున్నాడు. కానీ, మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ అర్ధాంతరంగా అసువులు బాశాడు. అనుమానాస్పదంగా అంతమై ఓ వివాదంలా బాలీవుడ్ చరిత్రలో మిగిలిపోయాడు. 

సోనూ సూద్ 

కరోనాకి ముందు, కరోనాకి తరువాత అన్నట్టు కంప్లీట్‌గా మారిపోయాడు సోనూ సూద్. ఒకప్పుడు ఆయన మంచి హ్యాండ్సమ్ విలన్. అంతే. కానీ, మన ‘పశుపతి‘ ఇప్పుడు చాలా మందికి ‘రియల్ హీరో‘. కోవిడ్ లాక్‌డౌన్ టైంలో ఆయన ఎంతో మందిని అమాంతం ఆదుకుంటూ ‘సూపర్ మ్యాన్‘ అయిపోయాడు. అయితే, ఈ మధ్య ఆయన చుట్టూ రాజకీయలు, రాజకీయ పరమైన దాడులు కూడా ఎక్కువైపోయాయి. ఆ సంగతి ఎలా ఉన్నా సోనూ సూద్ కూడా ఇంజనీరే! నాగ్‌పూర్‌లో ఆయన ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాడు. 

విక్కీ కౌశల్ 

‘యురి’ సినిమాతో బాలీవుడ్‌లో స్టార్ హీరో అయిపోయాడు విక్కీ కౌశల్. అయితే, ఈయన కూడా ఇంజనీరే. కానీ, బీటెక్ పూర్తయ్యాక ఓ సారి జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్లివచ్చి, ఆఫర్ లెటర్ చించిపారేశాడట! ఆ రోజుగానీ ఆయన అదే ఉద్యోగానికి వెళ్లి ఉంటే... మనం మంచి టాలెంటెడ్ నటుడు, ఒకర్ని, కోల్పోయే వాళ్లం! విక్కీ కూడా ఓ ఇంజనీర్‌గానే మిగిలిపోయేవాడు. లక్కీగా బాలీవుడ్‌కి వచ్చాడు కాబట్టి సినిమాలు, డబ్బులు, పేరుతో పాటూ కత్రీనాని కూడా సాధించుకున్నాడు! ప్రస్తుతం మిస్ కైఫ్‌తో లవ్ స్టోరీ సాగిస్తున్నాడు మిష్టర్ కౌశల్...  

Advertisement

Bollywoodమరిన్ని...