యోగీకి షాకిచ్చిన బాలీవుడ్ నిర్మాతలు

ABN , First Publish Date - 2020-12-06T00:28:48+05:30 IST

దేశ రాజధానికి సమీపంలో ఉన్న నోయిడాలో సుమారు వెయ్యి ఎకరాల్లో ఫిలిం సిటీని నిర్మించే యోచనలో యోగీ ప్రభుత్వం ఉంది. ఈ విషయంలో కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, ముంబైలో పర్యటించి నిర్మాతలు, దర్శకులు

యోగీకి షాకిచ్చిన బాలీవుడ్ నిర్మాతలు

ముంబై: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఫిలిం సిటీ ఏర్పాటు చేస్తామనే ఆలోచనలో ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఇదే విషయమై కొద్ది రోజుల క్రితం ముంబైలోని సినీ ప్రముఖులను కలిసిన విషయం తెలిసిందే. నోయిడాలో ఏర్పాటు చేయబోతున్న ఫిలిం సిటీకి పెట్టుబడులు పెట్టమని సినీ పెద్దలను యోగీ కోరారు. అయితే ఈ విషయమై మహారాష్ట్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ముంబై నుంచి హిందీ ఫిలిం ఇండస్ట్రీ నోయిడాకు మకాం మార్చనుందా అనే వార్తలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ‘ది ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్’ సంఘం శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు రాసిన లేఖతో యోగీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.


ఉద్ధవ్ రాసిన ఈ లేఖలో ‘‘హాప్పీ టు నోట్’’ అనే వాక్యంతో ప్రారంభించారు. అంతే కాకుండా ముంబైని సినిమా ఇండస్ట్రీకి ‘‘హృదయం, ఆత్మ’’ అని ప్రస్తావించారు. ‘‘మహారాష్ట్ర అనేది సినిమా ఇండస్ట్రీకి పుట్టినిల్లు. హిందీ చిత్ర పరిశ్రమకు ముంబై అనేది హృదయం లాంటిది. ఇక్కడి నుంచి ఇండస్ట్రీని తరలించడం ఎవరివల్లా కాదు. ఎందుకంటే ఇండస్ట్రీతో నిర్మాతలు, దర్శకులు, ఆర్టిస్టులు, ఇతర టెక్నీషియన్లు, ప్రజలు మమేకమై ఉన్నారు. ముంబైకి ఇండస్ట్రీకి విడదీయరాని సంబంధం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ కారణంగా ఇండస్ట్రీ చాలా నష్టపోయింది. హిందీ సినిమాకు పుట్టినల్లైన ముంబై క్రమంగా స్మశాన వాటికలా తయారవుతోంది. హిందీ చిత్ర పరిశ్రమను కాపాడుకొని పూర్వ వైభవం తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలి. దీనికి తోడు ఇండస్ట్రీ కూడా ఒక వ్యాపారం లాంటిదే. దానికి కావాల్సిన తోడ్పాటును కూడా అందించాలి’’ అని ఉద్ధవ్‌కు రాసిన లేఖలో నిర్మాతల సంఘం పేర్కొన్నారు.


దేశ రాజధానికి సమీపంలో ఉన్న నోయిడాలో సుమారు వెయ్యి ఎకరాల్లో ఫిలిం సిటీని నిర్మించే యోచనలో యోగీ ప్రభుత్వం ఉంది. ఈ విషయంలో కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, ముంబైలో పర్యటించి నిర్మాతలు, దర్శకులు, నటులు, బాలీవుడ్ ఎక్స్‌పర్ట్స్, ఇతర పెద్దలను కలిశారు. ఫిలిం సిటీ నిర్మాణానికి కావాల్సిన సలహాలతో పాటు.. అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించారు. దీనిపై శివసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బలవంతంగా ఇండస్ట్రీని తరలిస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించింది.

Updated Date - 2020-12-06T00:28:48+05:30 IST