Apr 21 2021 @ 15:10PM

సెలబ్రిటీలూ కాస్త అయినా బాధ్యత ఉండక్కర్లేదా!

కరోనా విజృంభిస్తున్న సమయంలో టూర్లు అవసరమా? 

మీ విలాసాల ఖర్చులతో పేదలను ఆదుకోండి!

బాలీవుడ్‌ తారలపై నెటిజన్ల విమర్శలు..


సినీ సెలబ్రిటీలు ఏ పని చేసినా ప్రశంస, విమర్శ తప్పనిసరి! ఇక ట్రోలింగ్‌కు అయితే హద్దే లేదు. ప్రస్తుతం బాలీవుడ్‌ సెలబ్రిటీల  పరిస్థితి ఇలాగే ఉంది. కరోనా సెకెండ్‌ వేవ్‌ మొదలైన తరుణంలో దేశంలో రోజుకి లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా ఎలా విజృంభిస్తుందో తెలిసిందే! కొవిడ్‌ కట్టడి కోసం అక్కడ కర్ప్యూ, వారాంతపు లాక్‌డౌన్‌ విధించినప్పటికి సెలబ్రిటీల పద్దతి మారకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి.  అయితే సినిమాల్లో సందేశాలిస్తూ, జనాలకు స్ఫూర్తిగా నిలవాల్సిన సినీ తారలు ప్రభుత్వ సూచనల్ని, నిబంధనల్ని పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఓ పక్క షూటింగ్‌లు ఆగిపోయాయి. థియేటర్లు మూతపడుతున్నాయి. ఈ తరుణంలో ఇంటికే పరిమితం కావలసిన బాలీవుడ్‌ సెలబ్రిటీలు హాలీడే పేరుతో సరదాల కోసం టూర్లకు వెళ్లున్నారు. గోవా, మాల్దీవుల్లో విహరిస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఇందులో కొందరు కరోనా బారిన పడి కోలుకున్నవారూ ఉన్నారు. పబ్లిక్‌ ఫిగర్‌ అయి ఉండి ఎదుటివారికి జాగ్రత్తలు చెప్పాల్సిన వీరే నిబంధనలు ఉల్లంఘించడం పట్ల సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌కి గురయ్యారు.

కొద్ది రోజుల క్రితమే కరోనా నుంచి కోలుకున్న అలియాభట్‌ తన ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి మాల్దీవులు విహారానికి వెళ్లారు. ఈ జంట ముంబై విమానాశ్రయంలో మీడియా కెమెరాకు చిక్కారు. అలాగే దిశాపటానీ కూడా ప్రియుడు టైగర్‌ ష్రాఫ్‌తో అదే ప్రాంతంలో సేద తీరుతున్నారు. వారం క్రితం జాన్వీ కపూర్‌ తన స్నేహితులతో మాల్దీవ్‌ బీచ్‌లో బికినీతో దర్శనమిచ్చింది. దియా మీర్జా, మాధురి దీక్షిత్‌, శ్రద్ధా కపూర్‌ వంటి తారలు కూడా విహారంలో బిజీగా ఉన్నారు. దీనిపై నెటిజన్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. ‘‘డబ్బు ఉన్న వారు ఏం చేసినా చెల్లుతుందని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేస్తే మరి కొందరు మాత్రం ‘‘ఓ వైపు దేశంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాబ్‌లు పోతున్నాయి. తినడానికి తిండి లేక పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో మీకు టూర్లు కావాల్సి వచ్చిందా. కాస్త అయిన బాధ్యత ఉండక్కర్లేదా’’ అంటూ విమర్శిస్తున్నారు. ‘‘దేశ ప్రజలు కొవిడ్‌తో నానా తంటాలు పడుతుంటే మీరు మాత్రం ఎంజాయ్‌ చేయడానికి విదేశాలకు వెళ్లడం సబబేనా? మీరు ఎంజాయ్‌ చేయడానికి వెళ్లి.. జనాలకు మాత్రం ‘ఇంట్లోనే ఉండండి’ అని ఉచిత సలహాలు ఇవ్వడం ఎందుకు? అని ట్విట్టర్‌లో ప్రశ్నిస్తున్నారు. ‘మీరు హాలీడే కోసం ఖర్చు చేసే మొత్తాన్ని పేదల కోసం వినియోగిస్తే ఎంతో బాగుంటుంది ఓసారి ఆలోచించండి’ అని ఓ నెటిజన్‌ సున్నితంగా ప్రశ్నించారు. ‘‘మీ పనుల ద్వారా సామాన్యులకు  ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. మహమ్మారి కోరల్లో చిక్కుకుని జనాలు చచ్చిపోతున్నారు. పరిస్థితులు చూస్తుంటే మీకు సిగ్గు అనిపించడం లేదా అరి అలియాభట్‌ను ట్యాగ్‌ చేసి ఓ నెటిజన్‌ ఘాటుగా స్పందించారు.  మరి కొందరైతే వారి డబ్బు వారి ఇష్టం ఇలా విమర్శించడం కరెక్ట్‌ కాదని అంటున్నారు.

కుదిరితే సహాయం చేయండి! 

‘‘మీ సరదాలు, విలాసాలను ఫొటోలుగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌ సంఖ్య పెంచుకోవడానికి ఇది సరైన సమయంకాదు. బాధ్యతగా వ్యవహరించండి. కుదిరితే నలుగురికి సహకరించండి’’ అని కాలమిస్ట్‌, నవలా రచయిత శోభ పేర్కొన్నారు. ఈ విషయంపై శ్రుతీహాసన్‌ కూడా ఘాటుగా స్పందించారు. ‘‘మన ప్రివిలేజ్‌ లైఫ్‌ను ఇలాంటి సమయంలో జనాలకు చూపించాలనుకోవడం సరైనది కాదు. అది బాధ్యతతో కూడిన పని కాదు. ప్రతి ఒక్కరికీ కష్టకాలమిది. అది తెలుసుకుని ప్రవర్తిస్తే బావుంటుంది’’ అని శ్రుతీ అన్నారు.