Abn logo
Sep 13 2020 @ 00:00AM

బాలీవుడ్... టాలీవుడ్ మలుపులెన్నో!

సుశాంత్‌ రాజ్‌పుత్‌ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తీగ లాగితే డొంక కదిలినట్లు.. బాలీవుడ్‌, శాండల్‌వుడ్‌ను ఒక కుదుపు కుదిపింది. చివరకు రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ద్వారా టాలీవుడ్‌కు చేరుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తారలు ఎవరెవరో చూద్దాం..

రియా చక్రవర్తి

తూనీగ తూనీగ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రియా చక్రవర్తి, ఆ తర్వాత బాలీవుడ్‌లో స్థిరపడింది. గత ఏడాది ఏప్రిల్‌లో రియా, సుశాంత్‌ మొదటిసారిగా కలుసుకున్నారు. అప్పటి నుంచీ వీరు డేటింగ్‌లో ఉన్నారు. హాలిడే కోసం విదేశాలకు కూడా వెళ్లొచ్చారు. ఇద్దరూ బాంద్రాలో ఒకే ఇంటిలో కొన్నాళ్లు ఉన్నారు కూడా. అయితే ఈ జూన్‌ 14న సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి రియాపై పడింది. ఆ తరువాత డ్రగ్స్‌ కేసు ఆమెను జైలు పాలు చేసింది.

సిమోనే కంభట్టా

డ్రగ్స్‌ కేసుతో సంబంధం ఉన్నవారిలో తాజాగా సిమోనే కంభట్టా పేరు కూడా తెరపైకి వచ్చింది. ఫ్యాషన్‌ డిజైనర్‌, యూట్యూబర్‌ అయిన సిమోనే తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా మదర్‌హుడ్‌, పిల్లల సంరక్షణ, ఆరోగ్యం, లైఫ్‌స్టయిల్‌కు సంబంధించిన విషయాలు పంచుకుంటున్నారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 40వేల మంది ఫాలోయర్లు ఉన్నారు.


రోహిణి అయ్యర్‌

సుశాంత్‌ సింగ్‌కు ఒకప్పుడు మేనేజర్‌గా పనిచేసింది రోహిణి అయ్యర్‌. రియా, సుశాంత్‌ మధ్య పరిచయం ఏర్పడడానికి రోహిణియే కారణం అంటారు. సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్న తరువాత అతనితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో భావోద్యోగంతో కూడిన పోస్ట్‌లు పెట్టింది. డ్రగ్స్‌ కేసులలో ఇప్పుడు రోహిణి పేరు కూడా వినిపిస్తోంది.

సారా అలీఖాన్‌

సైఫ్‌ అలీఖాన్‌, అమృతా సింగ్‌ల గారాల పట్టీ సారా అలీఖాన్‌ ‘సింబా’, ‘లవ్‌ ఆజ్‌ కల్‌’ సినిమాలతో హిట్‌  అందుకుంది. సారా 2018లో ‘కేదర్‌నాథ్‌’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో సారా, సుశాంత్‌ జంటగా నటించారు. ఆ సినిమా తరువాత వీరిద్దరి మధ్య ప్రేమాయాణం నడిచిందనే వార్తలు వినిపించాయి. అలానే రియా, సారా ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. ఇద్దరు కలిసి జిమ్‌కు వెళ్లేవారు.  

ఆ ఎఫెక్ట్‌ వీళ్ల మీద బాగా పడింది. 

సుశాంత్‌ది ఆత్మహత్య కాదనీ, ఓ ప్లాన్‌ ప్రకారం వ్యవస్థ చేసిన మర్డర్‌ అని హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ప్రారంభంలో  ఆరోపించారు. బాలీవుడ్‌లోని బంధుప్రీతిని ఆమె ఎండగట్టారు. సుశాంత్‌ ఎదుగుదలను సహించలేక, అతడిని కొన్ని సినిమాల నుంచి తొలగించారనీ, వాళ్లు ఎవరో తనకు తెలుసనీ, అది తట్టుకోలేక సుశాంత్‌ ఆత్మహత్య చేసుకొన్నాడని దర్శకుడు శేఖర్‌ కపూర్‌ కూడా సంచలన వాఖ్యలు చేశారు. అప్పట్లో వీరి ఆరోపణలకు పరిశ్రమలో మరి కొందరి మద్దతు లభించింది. తమ వాళ్లనే ప్రోత్సహిస్తూ, బయటి వాళ్లను ఎదగనివ్వడం లేదనే ఆరోపణల ప్రభావం కరణ్‌జోహార్‌, మహేశ్‌భట్‌, అలియా భట్‌ చిత్రాలపై పడింది. మహేశ్‌ భట్‌ రూపొందించిన ‘సడక్‌ 2’ చిత్రం దీనికి ఓ మంచి ఉదాహరణ. మహేశ్‌ భట్‌కు రియా చక్రవర్తి సన్నిహితురాలు కావడంతో ‘సడక్‌ 2’ ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్‌ కాకుడదని నెటిజెన్లు పంతం పట్టారు. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి లైకుల కన్నా డిస్‌ లైకులే అధికంగా వచ్చాయి.


రకుల్‌ ప్రీత్‌సింగ్‌

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి సినీతారగా రాణిస్తున్న వారిలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఒకరు. ‘కెరటం’ సినిమాతో తెలుగు తెరపై మెరిసిన రకుల్‌ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘లౌక్యం’, ‘ధ్రువ’, ‘నాన్నకు ప్రేమతో’ వంటి హిట్‌ చిత్రాలతో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగారు.


డ్రగ్స్‌ వ్యవహారంలో రకుల్‌, సారా అలీఖాన్‌ పేర్లు

రియా చక్రవర్తి తాజాగా ఎన్‌సీబీ దర్యాప్తులో డ్రగ్స్‌ కేసుతో సంబంధం ఉన్న కొంతమంది పేర్లు వెల్లడించింది. ఆ జాబితాలో  రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సారా అలీఖాన్‌ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. రకుల్‌, సారా ఇద్దరూ రియా స్నేహితులు అనే విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement
Advertisement