Abn logo
Jun 23 2021 @ 21:18PM

హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలో భారీ బాంబు పేలుడు..

లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, పాకిస్తాన్‌కి చెందిన అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ నివాసానికి సమీపంలో ఇవాళ భారీ బాంబు పేలుడు చోటుచేసుకుంది. లాహోర్‌లోని జొహార్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముంబై ఉగ్రదాడి సహా ఇతర ఉగ్రవాద కేసుల్లో హఫీజ్ సయీద్‌ను భారత దర్యాప్తు సంస్థల వాంటెడ్ లిస్టులో ఉన్న విషయం తెలిసిందే. నిషేధిత లష్కరే తొయిబా, జామాత్ ఉద్ దవా ఉగ్రవాద మూకలను స్థాపించిన అతడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కాగా బాంబు దాడి నేపథ్యంలో పాక్ భద్రతాధికారులు హఫీజ్ ఇంటిని, పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి గస్తీ ముమ్మరం చేశారు. ఇవాళ జరిగిన బాంబు దాడిలో హఫీజ్ ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు కూడా మృతిచెందినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. చనిపోయిన మరో వ్యక్తిని అటుగా వెళ్తున్న ఓ స్థానికుడిగా గుర్తించారు. ఈ దాడిపై ఇప్పటికే విచారణ ప్రారంభమైందనీ.. ఘటనా స్థలం వద్దకు బాంబు డిస్పోజల్ బృందాన్ని కూడా పంపామని లాహోర్ సిటీ పోలీసులు పేర్కొన్నారు.