Oct 16 2021 @ 20:14PM

Bommarillu Bhakar: ‘బొమ్మరిల్లు’ నా శక్తి!

‘‘సినిమా, సినిమాకు గ్యాప్‌ వస్తుందని, వెనకబడి పోతున్నానని టెన్షన్‌ తీసుకోను. ప్రేక్షకులకు ఏం చెబుతున్నాం అనేది నా ఇంటెన్షన్‌. నా నిర్మాత ముఖంలో చిరునవ్వు చూసినప్పుడే నేను సక్సెస్‌గా ఫీలవుతా’’ అని దర్శకుడు ‘బొమ్మరిల్లు భాస్కర్‌’ అన్నారు. అఖిల్‌ అక్కినేని, పూజాహెగ్డే జంటగా ఆయన దర్శకత్వం వహించిన మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రం దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. సినిమాకొస్తున్న స్పందన గురించి బొమ్మరిల్లు భాస్కర్‌ విలేకర్లతో మాట్లాడారు. 


‘‘బొమ్మరిల్లు’ నుంచి సాగుతున్న ఈ జర్నీలో నా లైఫ్‌ని అబ్జర్వ్‌ చేసుకుంటూ నేను ఎక్కడో ఫీల్‌ అయిన విషయాలను కథగా రాసుకొని తెరపై చూపించే ప్రయత్నం చేస్తూ వచ్చాను. అలాగే నేను చేసిన తప్పుల్ని తెలుసుకుంటూ నా లైఫ్‌తో పాటు అందరి జీవితాలు బావుండాలని కొత్త ఆలోచలతో కథలు రాస్తుంటా. నా కథలన్ని నిజజీవితం నుంచి పుట్టుకొచ్చినవే! 


ఎలిజిబిలిటీస్‌ ఏంటి? 

‘‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లో మ్యారేజ్‌ విషయంలో మనకున్న ఎలిజిబిలిటీస్‌ ఏంటి? అన్న విషయాన్ని చెప్పాం. పెళ్లి ఒక సెలబ్రేషన్‌లా జరిగినా ఆ తర్వాత ఎలా బ్రతకాలో అనే విషయంలో కొందరికి క్లారిటీ ఉండదు. ఆ విషయాలను ఒక ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌తో చెప్పాలి కాబట్టి నాకున్న లిమిటేషన్స్‌, ఫ్రీడంలో ఫన్నీ లేయర్‌తో లైట్‌ హార్టెట్‌గా ఈ కథ చెప్పా. 


లైఫ్‌ అంతా ఎమోషన్‌ మీదే...

పెళై జంట లైఫ్‌ లాంగ్‌ హ్యాపీగా ఉండాలని అందరూ చెబుతారు. లైఫ్‌ లాంగ్‌ పక్కన ఉండడం వేరు! దగ్గర ఉండడం వేరు. పక్కన ఉండడానికి అన్ని అర్హతలు సంపాదిస్తాం. కానీ దగ్గర ఉండడానికి ఎం కావాలి అన్నది ఇందులో చూపించాము. మన పిల్లలకి వస్తువులతో కానివ్వండి, మనసుతో కానివ్వండి చిన్నప్పటి నుంచి ఎమోషన్స్‌ అర్థం అయ్యేలా నేర్పించి ఉంటే ఇంకో లెవెల్లో మన లైఫ్‌ బెటర్‌గా ఉండేది. లైఫ్‌ అంతా ఎమోషన్‌ మీదే ఆధారపడి ఉంటుంది. మనకు ఆకలి ఎంత ముఖ్యమో.. మానసిక అవసరాలు తీర్చుకోవడమూ అంతే ముఖ్యం. ‘ఎమోషనల్‌ అవసరాలు తీర్చుకోవడానికి, షేర్‌ చేసుకోవడానికి మాకంటూ ఒకడు ఉండాలి’ అనే డైలాగ్‌ అందుకే పెట్టాం. 


అందుకే ఎక్కువ సమయం...

15 ఏళ్ల  జర్నీలో నేను చేసింది తక్కువ చిత్రాలే అయినా చేసినంత వరకూ ఫ్యామిలీ చిత్రాలే. ఇన్ని తక్కువ సినిమాలు చేయడానికి కారణం ఏంటంటే.. ఒక విషయాన్ని తీసుకొని దాన్ని ఆలోచించడానికే నాకు ఎక్కువ టైం పడుతుంది. ‘ఒంగోలు గిత్త’ తర్వాత తమిళ, తెలుగు మల్టీస్టారర్‌ సినిమా చేద్దామనుకున్నా. రెండు భాషల్లోనూ ముగ్గురు పెద్ద హీరోలు, నలుగురు పెద్ద హీరోయిన్స్‌తో అనుకున్నాం. వారి డేట్స్‌ కుదరక క్యాస్టింగ్‌ కోసమే సంవత్సరం పైనే టైం అయ్యింది. దాంతో ప్రొడ్యూసర్‌కు చాలా టైం వెస్ట్‌ అవుతుందని తమిళంలో సినిమా చేశా. 


‘బొమ్మరిల్లు’ నా శక్తి...

యూత్‌ నుంచి సినిమాక మంచి స్పందన వస్తోంది. ‘కపుల్స్‌ కూడా వారిలో ఏం లోపం ఉందని ఆలోచించుకొనే టాపిక్‌ చెప్పావు’ అని అంటుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అరవింద్‌గారు, వాసు వర్మ, బన్ని వాసు సినిమా బాగా రావడానికి ముఖ్య కారకులు. నాకు టెక్నికల్‌గా,  రైటర్‌గా ‘బొమ్మరిల్లు’ నాకు శక్తి నిచ్చింది. ప్రస్తుతం  కొన్ని కథలు సిదఽ్ధంగా ఉన్నాయి. అవి ఏంటి ఎవరితో చేస్తాను అనే విషయాలు త్వరలో తెలియజేస్తాను.