బోనాల సందడి.. ఆలయాలు ముస్తాబు...

ABN , First Publish Date - 2021-07-30T06:21:59+05:30 IST

తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బోనాల ఉత్సవాలకు సైదాబాద్‌, మాదన్నపేట, మలక్‌పేట పరిసర ప్రాంతాలలో అమ్మవారి ఆలయాలు ముస్తాబవుతున్నాయి.

బోనాల సందడి.. ఆలయాలు ముస్తాబు...
మాతామైదాన్‌లోని విజయదుర్గమాత దేవాలయం

సైదాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బోనాల ఉత్సవాలకు సైదాబాద్‌, మాదన్నపేట, మలక్‌పేట పరిసర ప్రాంతాలలో అమ్మవారి ఆలయాలు ముస్తాబవుతున్నాయి. ఆది, సోమవారం జరిగే ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలకు ఆలయాలను రంగులు, విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఆలయాల వద్ద రోడ్లకు మరమ్మతులు, ప్రత్యేక వీధిదీపాలు, చెత్త కుప్పలు లేకుండా చర్యలు చేపడుతున్నారు. మాతా మైదాన్‌లోని విజయదుర్గమాత ఆలయం, జీవనజ్యోతి సంఘంలోని జయదుర్గాదేవి ఆలయం, మాతృశ్రీకాలనీలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం, రెడ్డిబస్తీలోని మూడుగుళ్లు, విష్ణునగర్‌లోని పోచమ్మ ఆలయం, పెద్దతోటలోని అమ్మవారి అలయం, కరన్‌బాగ్‌, పల్టన్‌, మాదన్నపేట, సింగరేణి కాలనీలలోని ఆలయాలలో బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. సైదాబాద్‌ ప్రధాన రహదారిపై సోమవారం జరిగే ఘట్టాల ఊరేగింపులో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సైదాబాద్‌, మాదన్నపేట పోలీ్‌సలు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. విష్ణునగర్‌ పోచమ్మ ఆలయంలో ఆదివారం ఉదయం ఫలహార బండి, ఘటాల ఊరేగింపు, పోతరాజుల విన్యాసాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

డీజేలకు అనుమతి లేదు

సైదాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగే బోనాల ఉత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం. సోమవారం సాయంత్రం జరిగే అమ్మవారి ఘటాల నిమజ్జన ఉరేగింపులలో డీజేలకు అనుమతిలేదు.  

-కస్తూరి శ్రీనివాస్‌, ఎస్‌హెచ్‌ఓ, సైదాబాద్‌ పీఎస్‌

ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ఇన్‌స్పెక్టర్‌ సీతారాం

ఎల్‌బీనగర్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): బోనాల ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని సరూర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సీతారాం కోరారు. గురువారం ఆలయ కమిటీ ప్రతినిధులు, వివిధ పార్టీల ప్రతినిధులతో సరూర్‌నగర్‌ చెరువు కట్టపై ఉన్న పోలీస్‌ అవుట్‌పో్‌స్టలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్‌ ఆకుల శ్రీవాణి అంజన్‌, నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్‌, అధ్యక్షుడు ఆకుల అరవింద్‌కుమార్‌, మాజీ కౌన్సిలర్‌ కందికంటి ప్రేమ్‌నాథ్‌గౌడ్‌, బీజేపీ నాయకులు మల్కాజిగిరి కుమార్‌, రాంరెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మహేందర్‌యాదవ్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు నల్లెంకి ధన్‌రాజ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

రూ.92లక్షలతో 37 పనులు

చాదర్‌ఘాట్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని జీహెచ్‌ఎంసీ మంజూరు చేసిన రూ.92లక్షల నిధులతో ఆలయాల వద్ద 37 అవసరమైన పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి ఆలయాల వద్ద అభివృద్ధి పనులతోపాటు రోడ్లకు మరమ్మతులు కూడా నిర్వహిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ మలక్‌పేట సర్కిల్‌-6 పరిధిలో 50 ఆలయాల ఉన్నాయి. ఇప్పటికే ఆలయాల వద్ద 60 శాతం పనులు పూర్తి అయినట్టు ఈఈ రాధిక తెలిపారు.

మలక్‌పేట పీఎస్‌ పరిధిలో 35 ఆలయాలు

మలక్‌పేట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని 35 అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరగనున్నాయని ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ తెలిపారు. అన్ని ఆలయాల్లో ఆదివారం బోనాల ఉత్సవాలు జరగనుండగా, సోమవారం రెండు చోట్ల ఫలహారపు బండ్ల ఊరేగింపు జరగనుందన్నారు. 74 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. 

చాదర్‌ఘాట్‌ పీఎస్‌ పరిధిలో 21 ఆలయాలు

చాదర్‌ఘాట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని 21 ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరగనున్నాయని ఇన్‌స్పెక్టర్‌ వి.సతీష్‌ తెలిపారు. 15 అమ్మవారి ఆలయాల్లో రెండు రోజులపాటు, రెండు ఆలయాల్లో మూడు రోజులు బోనాలు జరగనున్నాయని, 120 మంది  సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 

Updated Date - 2021-07-30T06:21:59+05:30 IST