Abn logo
Aug 2 2021 @ 01:52AM

బోనమో నమః

ఆనందోత్సాహాల మధ్య లాల్‌దర్వాజ బోనాలు

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

పట్టువస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్‌, తలసాని, అలీ

ఉత్సవాల్లో దత్తాత్రేయ, రేవంత్‌, మధుయాష్కి, సంజయ్‌

బోనమెత్తిన విజయశాంతి, వైఎస్సార్‌టీపీ నేత షర్మిల 


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని గల్లీగల్లీలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు కనువిందు చేశాయి. ఆదివారం నగరవ్యాప్తంగా బోనాల పండుగ వైభవంగా జరిగింది. ప్రకృతి దేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు భారీగా తరలివచ్చారు. అమ్మవార్లకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు. చార్మినార్‌ భాగ్యలక్ష్మి దేవాలయం, లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి, హరిబౌలి శ్రీఅక్కన్న మాదన్న దేవాలయాల్లో ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌.. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.

ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ, అంజన్‌కుమార్‌ యాదవ్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, బీజేపీ నాయకురాలు విజయశాంతి, ఎమ్మెల్యే నాగేందర్‌, ఆంధ్రప్రదేశ్‌ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి దర్శించుకున్న ప్రముఖుల్లో ఉన్నారు.బీజేపీ నాయకురాలు విజయశాంతి, ఏపీ తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అమ్మవారికి బోనం సమర్పించారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని కనకాలకట్ట మైసమ్మ దేవాలయంలో జరిగిన ఉత్సవాల్లో రేవంత్‌రెడ్డి, అంజన్‌ కుమార్‌ యాదవ్‌, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ పాల్గొన్నారు. వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండల పరిధిలోని పెద్దమంగళారం రెవెన్యూ పరిధిలోని వైఎస్సార్‌టీపీ నాయకుడు రాజగోపాల్‌కు చెందిన ఫాంహౌ్‌సలో బోనాల వేడుకలో పాల్గొన్నారు.