అమ్మవార్లకు ఆన్‌లైన్‌ బోనం!

ABN , First Publish Date - 2022-06-17T09:44:56+05:30 IST

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, బల్కంపేట ఎల్లమ్మ తల్లికి భక్తులు ఆన్‌లైన్‌లో బోనాలు సమర్పించే అవకాశాన్ని దేవాదాయశాఖ అందుబాటులోకి తెచ్చింది.

అమ్మవార్లకు ఆన్‌లైన్‌ బోనం!

  • మహంకాళి, ఎల్లమ్మకు సమర్పించే చాన్స్‌
  • ఆన్‌లైన్‌లో ఎల్లమ్మ తల్లి కల్యాణ సేవలు
  • ప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌

హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, బల్కంపేట ఎల్లమ్మ తల్లికి భక్తులు ఆన్‌లైన్‌లో బోనాలు సమర్పించే అవకాశాన్ని దేవాదాయశాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అరణ్యభవన్‌లో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... భక్తులు ఆన్‌లైన్‌లో బోనం బుక్‌ చేసుకుంటే ఆలయ నిర్వాహకులే భక్తుల పేరుతో అమ్మవారికి బోనం సమర్పిస్తారన్నారు. భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి బోనంలోని బియ్యాన్ని ప్రసాదంలా తపాల శాఖ, ఆర్టీసీ కొరియర్‌ ద్వారా అందజేస్తారన్నారు. బియ్యంతోపాటు బెల్లం, అక్షింతలు, పసుపు-కుంకుమ భక్తులకు అందుతాయని మంత్రి వివరించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆన్‌లైన్‌ బోనం సేవలు శుక్రవారం నుంచి ప్రారంభమై ఉత్సవాలు ముగిసే వరకు (జూలై 30) అందుబాటులో ఉంటాయన్నారు. ఖీ అఞఞ ఊౌజూజీ, మీ సేవ, ఆలయ వెబ్‌సైట్‌, పోస్టాఫీసు ద్వారా స్వదేశీ, విదేశీ భక్తులు ఆన్‌లైన్‌ బోనం సేవల్ని వినియోగించుకోవచ్చన్నారు. ఆన్‌లైన్‌ బోనానికి స్వదేశీ భక్తులు రూ.300, విదేశాల్లో ఉన్న భక్తులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. 


అలాగే, బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం సందర్భంగా ఆన్‌లైన్‌ సేవలను మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించారు. ఎల్లమ్మ కల్యాణం జూలై 5న వైభవంగా నిర్వహించనున్నారని, జూలై 4 లోగా భక్తులు ఆన్‌లైన్‌ కల్యాణం, బోనం సేవల కోసం బుక్‌ చేసుకోవాలని  భక్తులకు సూచించారు. బుక్‌ చేసుకున్న భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి, పసుపు-కుంకుమ, బియ్యం ప్రసాదం ఇంటికి పంపిస్తారని మంత్రి చెప్పారు. ఖీ అఞఞ ఊౌజూజీ, మీ సేవ, ఆలయ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రూ.500 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ఎమ్మెల్సీ దండే విఠల్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్ర శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-17T09:44:56+05:30 IST