శ్రీవారి ఆస్తులు వైసీపీ నేతలు కొట్టేయడానికే ఈ నిర్ణయం :బోండా ఉమ

ABN , First Publish Date - 2020-05-24T00:05:21+05:30 IST

శ్రీవారి ఆస్తులు వైసీపీ నేతలు కొట్టేయడానికే ఈ నిర్ణయం :బోండా ఉమ

శ్రీవారి ఆస్తులు వైసీపీ నేతలు కొట్టేయడానికే ఈ నిర్ణయం  :బోండా ఉమ

విజయవాడ: హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని టీడీపీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కలిగియుగ వెంకటేశ్వర స్వామికి భక్తితో కానుకలు  సమర్పిస్తారని, శ్రీవారి ఆస్తులు చౌకగా వైసీపీ నాయకులు కొట్టేయడానికే ఈ అమ్మకం నిర్ణయం తీసుకున్నారని ఉమ విమర్శించారు. 23 ప్రాంతాల్లో ఆస్తులు అమ్మాల్సిన అవసరం టీటీడీకి ఎందుకొచ్చిందని విమర్శించారు. ఇలా చేస్తే... భక్తులు ఎవరైనా .. మరోసారి కానుకలు ఇస్తారా అని, గతంలో సీఎంలు సతీసమేతంగా వెళ్లి పట్టుబట్టలు స్వామికి సమర్పించే వారని, ఈ సీఎం మాత్రం భక్తులు విశ్వాసాలను పట్టించుకోకుండా ఒక్కరే వస్త్రాలు ఇచ్చారని బోండా ఉమ విమర్శించారు. గతంలో పోటులో తవ్విన వేల కోట్ల డైమండ్ లు చంద్రబాబు ఇంట్లో ఉన్నాయన్నారని, అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో‌ బోర్డు సభ్యులు అందరూ చర్చించి నిర్ణయాలు చేసేవాళ్లమని, ఇప్పుడు తాడేపల్లి భవనంలో ‌చేసిన నిర్ణయాలను టీటీడీ బోర్డు అమలు చేస్తుందని బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏడు కొండలను,  వెంకన్నను అవమానించిన వాళ్లు ఏమయ్యారో అందరికీ తెలుసు అని, స్వామి వారి ఆస్తులు పరిరక్షించే విధంగా జగన్ నిర్ణయం తీసుకోవాలని, ఆస్తులు అమ్మకాల నిర్ణయం ఉపసంహరించుకోవాలని, లేదంటే టీడీపీ పోరాటం చేస్తుందని బోండా ఉమ హెచ్చరించారు.

Updated Date - 2020-05-24T00:05:21+05:30 IST