బంధాలు బందీ..!

ABN , First Publish Date - 2021-05-08T06:25:38+05:30 IST

మాయమవుతున్నడమ్మా మనిషన్న వాడు అంటూ తెలంగాణ కవి అందేశ్రీ రాసిన పాట నేడు అక్షరాల సాకారమవుతోంది.

బంధాలు బందీ..!

కరోనా మృతదేహాలకు కుటుంబీకులు దూరం 

ఆసుపత్రుల నుంచి శవాలను తీసుకునేందుకు నిరాకరణ 

అంత్యక్రియలకు సైతం వెనకడుగు 

పెద్దదిక్కుగా వ్యవహారిస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌, సిబ్బంది 

ఇప్పటి వరకు 38 కరోనా శవాలకు అంతిమ సంస్కారాలు 

కరోనామృతుల అంత్యక్రియలకు ప్రత్యేక శ్మశానం ఏర్పాటు

 నిర్మల్‌, మే 7 (ఆంధ్రజ్యోతి) : మాయమవుతున్నడమ్మా మనిషన్న వాడు అంటూ తెలంగాణ కవి అందేశ్రీ రాసిన పాట నేడు అక్షరాల సాకారమవుతోంది. కరోనాపుణ్యమా అని మానవ సంబంధాలు, కుటుంబ బంధాలన్నీ పలచబడుతున్నాయి. నిన్నటి వరకు తమతో కలిసి ఉన్న,  తమకు అండగా నిలిచిన కుటుంబసభ్యులు కరోనా కారణంగా మరణిస్తే వారి శవాలకు అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంటోంది. కరోనా రోగులను చూస్తేనే జడుసుకుంటున్న జనం వారి మృతదేహాలు అంటే ఆమడదూరం పరుగు తీస్తున్నారు. ఇతరుల మాట దెవుడెరుగు కాని స్వయంగా కుటుంబసభ్యులే మృతదేహాలకు అంత్యక్రియలు జరిపేందుకు వెనకాడుతున్నారు. కొంతమంది దైర్యంచేసి దహన సంస్కారాలు నిర్వహిస్తున్నప్పటికీ చాలామంది మాత్రం ఆసుపత్రుల్లో మరణిస్తున్న తమ కుటుంబ సభ్యుల శవాలను ఇళ్లకు తీసుకువెళ్ళడం లేదు. దీంతో పాటు వారి అంత్యక్రియలు సైతం జరిపేందుకు జడుసుకుంటున్నారు. హైదరాబాద్‌, నిజామాబాద్‌ ఆసుపత్రుల్లో మరణిస్తున్న కరోనా బాధితుల శవాలకు అక్కడే దహన సంస్కారాలు పూర్తిచేసి తిరిగి వస్తున్నారు. అయితే నిర్మల్‌ జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 77 మంది కరోనా కారణంగా మృతి చెందినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. వీరిలో 67 మంది జిల్లా కేంద్రమైన నిర్మల్‌లో మరణించగా మరో 10 మంది భైంసా ఏరియా ఆసుపత్రి పరిధిలో మృతి చెందారు. కాగా జిల్లా ఆసుపత్రిలో 36 మంది కరోనాతో మృతి చెందగా ఇందులో దాదాపు 10 మంది శవాలను వారి కుటుంబసభ్యులు తీసుకువెళ్లలేదు. అలాగే ప్రైవేటు ఆసుపత్రుల్లో 31 మంది మరణించగా ఏ ఒక్కరి శవాన్ని కూడా వారి కుటుంబసభ్యులు తీసుకువెళ్లకుండా చేతులేత్తేశారు. అయితే ఇలాం టి విఫత్కర పరిస్థితుల్లో కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు జరిపేందు కోసం తామున్నామంటూ మున్సిపాలిటీ తరపున చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ పెద్దదిక్కుగా వ్యవహారిస్తుండడం మానవత్వానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రైవేటు, ప్రభుత్వాసుపత్రుల్లో మరణిస్తున్న కరోనా రోగుల కోసం అంత్యక్రియలు నిర్వహించేందుకు నియమించిన కమిటీకి చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. మున్సిపాలిటీ తరపున అంత్యక్రియల నిర్వహణ కోసం నలుగురు సిబ్బందిని తాత్కాలిక ప్రతిపాదికన నిర్వహించారు. అలాగే మున్సిపల్‌ ప్రత్యేక వాహనాన్ని కూడా సమకూర్చింది. స్థానికంగా ఉన్న శ్మశానవాటికల్లో అంత్యక్రియలు నిర్వహించేం



దుకు స్థానికులు వ్యతిరేకిస్తున్న కారణంగా వీరి కోసం ప్రత్యేక శ్మశాన వాటికను కూడా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నటరాజ్‌ సమీపంలోని శ్మశానవాటికకు వెనకభాగంలో ప్రత్యేకంగా దీనిని ఏర్పాటు చేయడంతో స్థానికులకు ఇబ్బంది లేకుండా పోయింది. అలాగే కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు జరిపే ప్రక్రియలో నిర్మల్‌ సేవాసమితితో పాటు సహారాసొసైటీ, మరికొన్ని స్వచ్చందసంస్థలు తమ వంతు చేయూతను అందిస్తున్నాయి. మొత్తానికి కరోనా కారణంగా వీగిపోతున్న కుటుం బ బంధాలతో మానవీయ విలువలు మసకబారుతున్నాయంటున్నారు. దీంతో పాటు కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు జరిపేందుకు ముం దుకు వచ్చిన నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌తో పాటు సిబ్బంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని డాక్టర్‌లపై భారాన్ని తగ్గించడమే కాకుండా మృతుల కుటుంబీకుల ఆపన్నహస్తం అందిస్తున్నారు. 

ఇప్పటి వరకు జిల్లాలో 77 కరోనా మరణాలు

జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 77 మంది కరోనా కారణంగా మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. భైంసాలో 10 మంది మరణించగా, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో 36 మంది, ప్రైవేటు ఆసుపత్రుల్లో 31 మంది మరణించారు. అయితే నిర్మల్‌లో మొత్తం 67 మంది మరణించగా ఇందులో నుంచి 38 మందికి అంత్యక్రియలు అధికారంగా నిర్వహించినప్పటికీ ఇతర ప్రాంతాల్లో మరణించిన మరో 15  మృతదేహాలకు సైతం మున్సిపాలిటే అంత్యక్రియలు జరిపింది. ఈ లెక్కన దాదాపు 50 మందికి పైగా కరోనా మృతులకు మున్సిపాలిటీ అంత్యక్రియలు జరిపినట్లు చెబుతున్నారు. మృతదేహాలకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఈ 38 మంది మృతుల కుటుంబసభ్యులు ఎవరు కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాకపోవడంతో మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది అంత్యక్రియలకు చేయూతనందించి తమ మానవీయ విలువలను చాటుకున్నారంటున్నారు. అయితే అధికారికంగా మాత్రమే ఈ లెక్కలు చెబుతున్నప్పటికీ అనధికారికంగా మాత్రం మరో 100 నుంచి 200 వరకు కరోనాకారణంగా మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. 



కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో ఆ బాధ్యతను నిర్మల్‌ మున్సిపాలిటీ తన భుజ స్కంధాలపై వేసుకుంటోంది. ముఖ్యంగా సెకండ్‌వేవ్‌ కరోనా సమయంలో మరణాల రేటు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో మృతుల శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం సమస్యగా మారింది. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపేందుకు ముందుకు రాకపోతుండడం అటు వైద్యులను ఇటు ఆసుపత్రి సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. శవాలను తీసుకువెళ్లాలంటూ ప్రభుత్వాసుపత్రి వైద్యులు మృతుల కుటుంబీకులను కోరుతున్నప్పటికీ వారు ముందుకు రావడం లేదు. ఇలాంటి సమయంలో తామున్నామంటూ నిర్మల్‌ మున్సిపాలిటీ ముందుకు వచ్చి చేయూతనందిస్తోంది. చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, మున్సిపల్‌ సిబ్బందిని సమన్వయ పరుస్తూ ఈ అంతిమ క్రతువును పూర్తి చేయిస్తున్నారు. శవాలను తరలించేందుకు ప్రత్యేక వాహనాన్ని కూడా ఏర్పాటు చేయడమే కాకుండా అంత్యక్రియల నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించారు. చైర్మన్‌ ఈశ్వర్‌ స్వయంగా ఓ అడుగు ముందుకు వేసి ఒకరిద్దరు కుటుంబ సభ్యులను వెంట తీసుకొని ఏకంగా శ్మశాన వాటికకే వెళ్లి దహ న సంస్కారాలను పర్యవేక్షిస్తుండడమే కాకుండా కుటుంబ సభ్యులను ఓదార్చుతుండడం విశేషం. 

ముందుకు వస్తున్న స్వచ్ఛంద సంస్థలు

నిర్మల్‌ మున్సిపాలిటీ నిర్వహిస్తున్న కరోనా మృతదేహాల అంత్యక్రియల ప్రక్రియకు వివిధ స్వచ్చంద సంస్థలు సైతం తమ వంతు చేయూతనందిస్తున్నాయి. నిర్మల్‌ సేవా సమితి, సహరా సొసైటీతో పాటు మరికొన్ని సంస్థలు తమ వంతు బాధ్యతగా కరోనా రోగులకు సహాయపడుతుండడమే కాకుండా మృతదేహాల అంత్యక్రియలకు తోడ్పాటునందిస్తున్నాయి. నిర్మల్‌ సేవా సమితి కరోనా మృతదేహాల దహన సంస్కారాల కోసం 50 క్వింటాళ్ల కలపను అందించింది.  దీంతో పాటు కరోనాతో భాధపడుతున్న వారికే కాకుండా కుటుంబ సభ్యులకు సైతం సహరా సొసైటీ ఆహారం, ఇతర సౌకర్యాలను సమకూరుస్తోంది. వీటితో పాటు మరి కొన్ని సంస్థలు తమ వంతు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి.

-  

కరోనా కారణంగా మరణిస్తున్న వారికి అంత్యక్రియలు జరిపేందుకు వారి కుటుంబసభ్యులు వెనకడుగు వేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహింపజేయాలని ఆదే శించారు. మంత్రి ఆదేశాల మేరకు కరోనా మృతదేహాల అంత్యక్రియల కోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు మంత్రికి ఇక్కడి కరోనాతీవ్రతపై వివరిస్తున్నాం. అలాగే శవాలను తరలించేందుకు వాహనాన్ని ఏర్పాటు చేశాం. అంత్యక్రియల కోసం ప్రత్యేక శ్మశాన వాటికతో పాటు తాత్కాలిక సిబ్బందిని నియమించాం. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా కారణంగా మరణిస్తున్న వారి శవాలను తీసుకువెళ్ళేందుకు వారి కుటుంబ సభ్యులు ముందుకు రానట్లయితే   ముందుం డి దహన సంస్కారాలు జరిపిస్తున్నాం. 

గండ్రత్‌ ఈశ్వర్‌, మున్సిపల్‌ చైర్మన్‌, నిర్మల్‌


ఆసుపత్రులకు భారమవుతున్న  మృతదేహాల నిర్వహణ

కరోనా కారణంగా ఇప్పటి వరకు జిల్లా ఆసుపత్రిలో 36 మంది మరణించారు. వీరిలో 29 మంది శవాలను వారి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా మరో 10 మృతదేహాలను మాత్రం వారి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లేందుకు ముందుకు రాలేదు. తాము ఎంతగా ప్రయత్నించినప్పటికీ ప్రయత్నం ఫలించలేదు. కరోనాశవాల కారణంగా ఆసుపత్రిలో వైద్య సేవలకు ఇబ్బంది కలుగుతోంది. ఇలాంటి సమయంలో మున్సిపాలిటీ కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు జరిపేందుకు ముందుకు రావడం అభినందనీయం. దీని కారణంగా జిల్లా ఆసుపత్రిపై కొంత మేరకు భారం తగ్గినట్లయ్యింది. 

- దేవేందర్‌రెడ్డి , జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్‌ 

Updated Date - 2021-05-08T06:25:38+05:30 IST