సరిహద్దుల్లో ‘బూబీ ట్రాప్స్‌’

ABN , First Publish Date - 2021-10-09T04:53:44+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లోని చింతూరు మండలంలోని మల్లంపేట గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన బూబీ ట్రాప్స్‌ను పోలీసు బలగాలు గుర్తించాయి.

సరిహద్దుల్లో ‘బూబీ ట్రాప్స్‌’
పోలీసు బలగాలు వెలికి తీసిన వెదురు సూదులు

ఏపీలోని మల్లంపేట అటవీ ప్రాంతంలో వెలుగులోకి

ఇకపై మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మరింత నిఘా

భద్రాచలం, అక్టోబరు 8 : ఆంధ్రప్రదేశ్‌-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లోని చింతూరు మండలంలోని మల్లంపేట గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన బూబీ ట్రాప్స్‌ను పోలీసు బలగాలు గుర్తించాయి. మల్లంపేట అటవీ ప్రాంతంలో చింతూరు ఏఎస్పీ జి.కృష్ణకాంత్‌ నాయకత్వంలో చింతూరు, యటపాక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలో యాంటీ నక్సల్‌ స్క్యాడ్‌, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది కొన్ని రోజులుగా మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పోలీసు బలగాలను మట్టుపెట్టేందుకు ఏర్పాటు చేసిన పది బూబీ ట్రాప్‌లను భద్రత బలగాలు శుక్రవారం గుర్తించాయి. అవి పది అడుగుల లోతు వరకు భూమిలో కందకాలు తవ్వి బూబీ ట్రాప్‌లను ఏర్పాటు చేశారు. వెదురు బొంగులను సూదులుగా చెక్కి ఆకులు, కొమ్మలతో కప్పి పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ట్రాప్‌లను ఏర్పాటు చేసినట్లు పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో తాము చేపడుతున్న గాలింపు చర్యలో 10 బూబీ ట్రాప్‌లు భద్రత బలగాలు గుర్తించడం, వాటిని నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో ఏపీ, చత్తీస్‌గఢ్‌, తెలంగాణ సరిహద్దుల్లోని పోలీసు వర్గాలు కలవరపాటుకు గురయ్యాయి. ఊహించని రీతిలో మావోయిస్టులు బూబీ ట్రాప్‌లను ఏర్పాటు చేయడంతో.. అప్రమత్తమైన పోలీసు వర్గాలు గాలింపు చర్యలను మరింత విస్తృతం చేయాలని నిర్ణయించారు.  చింతూరు పోలీసు సర్కిల్‌ పరిధిలో ఈ విధంగా బూబీ ట్రాప్‌లను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని తెలుస్తోంది. చింతూరు మండలంలోని మల్లంపేట అటవీ ప్రాంతం కొన్ని దశాబ్దాలుగా మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో ఒకటిగా పేర్కొంటుంటారు. అలాంటి ప్రాంతంలో మావోయిస్టులు బూబీట్రాప్‌లను ఏర్పాటు చేయడంతో మూడు రాష్ట్రాల సరిహద్దు పోలీసులు అప్రమత్తమయ్యారు.

మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మరింత నిఘా

మల్లంపేట అటవీ ప్రాంతంలో బూబీ ట్రాప్‌ ఏర్పాటు చేసి పోలీసు బలగాలను మట్టుపెట్టేందుకు మావోయిస్టులు చేసిన ప్రయత్నం వెలుగులోకి రావడంతో తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మరింత నిఘా పెరగనుంది. తెలంగాణ -చత్తీస్‌గడ్‌ సరిహద్దుల్లోనిఅటవీ గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు గతంలోనూ వెలుగులోకి వచ్చాయి. మందుపాతర్లు, ప్రెషర్‌బాంబులు ఏర్పాటు చేసిన సంఘటనలూ ఉన్నాయి. మల్లంపేట ఘటనతో మూడు రాష్ట్రాల పోలీసులు మావోయిస్టులు ఎంచుకున్న మార్గంపై మరింత దృష్టి కేంద్రీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భద్రాద్రి జిల్లాలోని చర్ల, దుమ్ముగూడెంలోని మావోయిస్టు ప్రభావిత సరిహద్దు ప్రాంతాల్లో ఇలాంటి బూబీ ట్రాప్స్‌ ఉండే అవకాశాలు లేకపోలేదని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతంలో ఉంటున్న మావోయిస్టులు వయోభారం, ఆరోగ్య రీత్యా ఇతరత్రా కారణాలతో పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. అలాగే గత 18నెలలుగా మావోస్టులు ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా. ఈ పరిస్థితుల్లో కూంబింగ్‌కు వచ్చే పోలీసుబలగాలను నియంత్రించేందుకు బూబీ ట్రాప్‌ విధానాన్ని ఎంచుకున్నారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని పోలీసు అధికారులు సమావేశమై పరస్పర సహకారాన్ని ఇచ్చిపుచ్చుకునేలా సమీక్షలు నిర్వహించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల మూడు రాష్ట్రాల పోలీసు ఉన్నతాఽధికారుల కీలక భేటీ  ఛత్తీస్‌గఢ్‌లోని కుంటలో జరిగింది. మల్లంపేటలో వెలుగు చూసిన తాజా ఘటనతో పోలీసు వర్గాలు మరింత నిఘాను పెంచడమే కాకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కార్యకలాపాలను కొనసాగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2021-10-09T04:53:44+05:30 IST