భరోసా ఇలాగేనా..!

ABN , First Publish Date - 2020-07-03T10:14:56+05:30 IST

పదును వాన పడింది. పత్తి నాటాలని రాజుపాలెంకు చెందిన ఓ రైతు విత్తనాలు కొనేందుకు ‘రైతు భరోసా కేంద్రాని’కి వెళ్లారు

భరోసా ఇలాగేనా..!

ఆర్బీకేల్ల్లో పత్తి విత్తన ప్యాకేట్‌ రూ.695

రూ.660-680లకే ఇస్తున్న ప్రైవేటు డీలర్లు 

ఆన్‌లైన్లో బుక్‌ చేసి 48 గంటలు ఆగాలి

రైతు భరోసా కేంద్రాలకు వెళ్లని అన్నదాతలు


(కడప - ఆంధ్రజ్యోతి): పదును వాన పడింది. పత్తి నాటాలని రాజుపాలెంకు చెందిన ఓ రైతు విత్తనాలు కొనేందుకు ‘రైతు భరోసా కేంద్రాని’కి వెళ్లారు. బీజీ-2 పత్తి 475 గ్రాముల ప్యాకెట్‌కు రూ.695 డబ్బు కట్టి ఆన్‌లైన్లో బుక్‌ చేస్తే 48 గంటల్లో ఇస్తామన్నారు. అప్పటికే పొలానికి కూలీలను పంపిన ఆ రైతు చేసేది లేక ప్రైవేట్‌ డీలర్‌ వద్దకు వెళితే ప్యాకెట్‌ రూ.670 ప్రకారం అడిగినన్ని తక్షణమే ఇచ్చారు. ఆర్బీకేలతో పోలిస్తే ప్రైవేటు డీలర్ల దగ్గరే రూ.25-35 తక్కువకు అభిస్తున్నాయి. అంతేకాదు.. ఆర్బీకేల్లో కావలసిన ఎరువులు కూడా దొరకడం లేదని రైతుల ఆవేదన. ఆ వివరాలు ఇలా.. 


జిల్లాలో ఖరీఫ్‌లో 1.15 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ యంత్రాగం అంచనా. సీజన్‌ ప్రారంభమై నెల దాటింది. జూన్‌ ఆఖరు వరకు సాగైంది కేవలం 2,807 హెక్టార్లే. రెండు రోజులుగా జిల్లాలో ఆశాజనకంగా వానలు కురిశాయి. జూన్‌ సాధారణ వర్షపాతం 69.2 మి.మీలు. నెల ఆఖరు నాటికి 82.4 మి.మీలు కురిసింది. 19.1 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు అయింది. బుధవారం నుంచి రాజుపాలెం, మైలవరం, జమ్మలమడుగు, చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ఖాజీపేట తదితర ప్రాంతాల్లో పొలంలో విత్తనాలు వేసే కూలీలు, రైతులతో చేలు కళకలలాడుతున్నాయి. పత్తి విత్తనాలు నాటుతున్నారు.


ప్యాకెట్‌పై రూ.25 ఎక్కువ ధర

జిల్లాలో 20 వేల హెక్టార్లలో పత్తి సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా. ఎకరాకు నాలుగు చొప్పున హెక్టారుకు 10 ప్యాకెట్లు బీజీ-2 పత్తి విత్తనాలు నాటుతామని రైతులు తెలిపారు. ఈ లెక్కన 2 లక్షల ప్యాకెట్లకు పైగా అవసరం ఉంది. ఆయా విత్తన కంపెనీలతో ఒప్పందం చేసుకొని ఆర్బీకేలలో అమ్మకాలకు ఉంచారు.


జిల్లాలో భాగా డిమాండ్‌ ఉన్న ఓ ప్రధాన కంపెనీ 475 గ్రాముల విత్తన ప్యాకెట్‌ ధర ఆర్బీకేలో రూ.695. అదే కంపెనీ పత్తి విత్తన ప్యాకెట్‌ ప్రైవేటు లైసెన్డ్‌ డీలర్లు రూ.660 నుంచి రూ.670కే విక్రయిస్తున్నారు. అంటే.. ఆర్బీకేలతో పోలిస్తే ఒక్కో ప్యాకెట్‌పై రూ25-35 తక్కువకు డీలర్లు ఇస్తున్నారు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన ఆర్బీకేల్లో ధర తక్కువ, నాణ్యత, తక్షణ సరఫరా ఉంటుందని ఆశతో వెళ్లిన రైతులకు నిరాశే ఎదురౌతోంది. చేసేది లేక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా రైతులు రాకపోవడంతో ఆర్బీకేలు వెలవెలబోతున్నాయి.


డ్రిప్‌ మందులు ఏవీ..?

ఉద్యాన పంటల సాగుకు జిల్లా ప్రసిద్ధి. అరటి, మామిడి, బొప్పాయి, బత్తాయి, దోస, కరుబూజ.. వంటి పంటలు 1.22 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. డ్రిప్‌ ద్వారా పండ్ల చెట్లకు ఎరువులు ఇస్తున్నారు. నీటిలో కరిగే పాలిఫడ్‌ - 19:19:19, మల్టీకే-130-45, మోనోపొటాషియం పాస్ఫరస్‌, అమ్మోనియం పాస్ఫేట్‌, కాల్షియం నైట్రేట్‌, బోరాక్స్‌, మెగ్నీషియం సల్ఫేట్‌, సాస్ఫరిక్‌ యాసిడ్‌.. వంటి ఎరువులు కావాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికీ ఆ ఎరువులు ఆర్బీకేలలో అందుబాటులో లేవు.


కంపెనీలతో మాట్లాడుతాం - శశిధర్‌రెడ్డి, ఏడీ, జేడీఏ ఆఫీస్‌, కడప

రైతు భరోసా కేంద్రాల్లో విత్తన కంపెనీలు ఎంవోయూలో నిర్ణయించిన ధరలకే విక్రయించాలి. ప్రైవేటు డీలర్ల వద్ద తక్కువ ధరకే లభిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. బహిరంగ మార్కెట్‌ కన్నా ఆర్బీకేల్లో తక్కువ ధరకు ఇచ్చేలా ఆయా కంపెనీలతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. డ్రిప్‌ మందుల కోసం ఎంవోయూ చేసుకున్న కంపెనీలకు ఇండెంట్‌ పంపాం. త్వరలో వస్తాయి.


డీలర్లే తక్కువ ధరకు ఇస్తున్నారు- బి.నవీర్‌రెడ్డి, రాజుపాలెం

నాకు 28 ఎకరాల పొలం ఉంది. వర్షం రావడంతో పత్తి విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రానికి వెళ్లాను. ప్యాకెట్‌ ధర రూ.695 అన్నారు. ప్రైవేటు వ్యాపారుల వద్దకు వెళితే ప్యాకెట్‌ రూ.670లకే ఇచ్చారు. బిల్లు మాత్రం రూ.680లకు వేశారు. ఆర్బీకేల కన్నా డీలర్ల వద్దే తక్కువ ధరకు లభిస్తున్నాయి. 


తక్షణమే ఇవ్వాలి- సానా సంజీవరెడ్డి, రాజుపాలెం

నేను 32 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాను. ఎకరాకు నాలుగు ప్యాకెట్ల విత్తనాలు నాటుతున్నాం. రైతు భరోసా కేంద్రాల్లో డబ్బు కట్టి ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తే 48 గంటల్లోగా ఇస్తామంటున్నారు. రాత్రి వర్షం పడితే ఉదయమే విత్తనాలు నాటడం, ఎరువులు వేయడం చేస్తాం. ఆర్బీకే నిబంధనల ప్రకారం రెండు రోజులు ఆగితే భూమి ఎండిపోతుంది. డబ్బు కట్టిన తక్షణమే విత్తనాలు, ఎరువులు ఇచ్చేలా ఏర్పాటు చేయాలి.


Updated Date - 2020-07-03T10:14:56+05:30 IST