సివిల్స్‌ పరీక్షల్లోనూ ఏపీని నెంబర్‌ 1 చేస్తా

ABN , First Publish Date - 2020-02-07T22:53:04+05:30 IST

వెల్‌కం టూ ఓపెన్‌ హార్ట్‌.. బీఎస్‌ రావుగారూ నమస్కారం.. ఫలితాల పట్ల చాలా హుషారుగా ఉన్నట్లున్నారు? ఏడాది మొత్తం కష్టపడిన తరువాత ఫలితం వచ్చే రోజు హుషారుగానే ఉంటుంది. ఆశించనంతగా ఫలితాలు వచ్చాయి. ఐఐటీలో ఆలిండియా నంబర్‌ వన్‌తో పాటు అన్ని ర్యాంకులొస్తాయని ఊహించలేదు.

సివిల్స్‌ పరీక్షల్లోనూ ఏపీని నెంబర్‌ 1 చేస్తా

ఆ తర్వాత రిటైర్‌ అవుతా

పోటీ పరీక్షల వల్ల విద్యార్థికి మంచే జరుగుతోంది

మమ్మల్ని విమర్శించే వారికి ఆదాయంలో 15 శాతం ఇవ్వాల్సొస్తోంది

ర్యాంకులొచ్చే విద్యార్థుల మీదే శ్రద్ధ చూపుతున్నామనేది అబద్ధం

13-6-2011న ఓపెన్‌ హార్ట్‌లో చైతన్య విద్యా సంస్థల చైర్మన్‌ బీఎస్‌ రావు


వెల్‌కం టూ ఓపెన్‌ హార్ట్‌.. బీఎస్‌ రావుగారూ నమస్కారం.. ఫలితాల పట్ల చాలా హుషారుగా ఉన్నట్లున్నారు?

ఏడాది మొత్తం కష్టపడిన తరువాత ఫలితం వచ్చే రోజు హుషారుగానే ఉంటుంది. ఆశించనంతగా ఫలితాలు వచ్చాయి. ఐఐటీలో ఆలిండియా నంబర్‌ వన్‌తో పాటు అన్ని ర్యాంకులొస్తాయని ఊహించలేదు. ఏఐఈఈఈలోనూ మంచి ర్యాంకులొచ్చాయి. ఈ ఫలి తాలొచ్చినప్పుడు విద్యార్థుల కంటే ఎక్కువగా ఒత్తిడికి గురవుతాం. విద్యార్థికి కోరుకున్న కాలేజీలో సీటొస్తే చాలు.. మాకు మాత్రం ఏ ర్యాంకు వచ్చిందన్నది కూడా ముఖ్యమే.


మీరు మీ భార్య డాక్టర్లు. వైద్య రంగం నుంచి విద్యారంగానికి ఎందుకొచ్చారు?

నేను నా భార్య విదేశాల్లో పని చేశాం. అక్కడ 12 ఏళ్ల పాటు రేయింబవళ్లు కష్టపడ్డాం. మా పిల్లలకు లోటు లేకుండా సంపాదించిన తరువాత ఇండియాకు తిరిగొచ్చాం. నా భార్యకు విద్యార్థుల మధ్యన ఉండడం ఇష్టం. 1986లో రెసిడెన్షియల్‌ కాలేజీతో పాటు క్లినిక్‌ను మాత్రం నడుపుదామని అనుకున్నాం. అయితే.. తల్లిదండ్రులు తమ పిల్లలను మాకు అప్పచెబుతున్నప్పుడు మా బాధ్యత ఏమిటో అర్థమై.. క్లినిక్‌ను నడపాలన్న ఉద్దేశాన్ని మానుకుని కాలేజీని మాత్రమే నడపాలని నిర్ణయించుకున్నాం. 86 మందితో మొదలుపె ట్టాం. సక్సెస్‌ను సాధించాం.


విద్యా రంగంలో పోటీ వలన సమాజానికి మంచి జరుగుతోందా? చెడు జరుగుతోందా?

100 శాతం మంచే జరుగుతోంది. టీనేజి విద్యార్థుల్లో చాలా సమస్యలుంటాయి. వాటిని గుర్తించి వారికి మార్గదర్శకత్వం వహిస్తే.. పరికపక్వమైన మనుషులుగా బయటికి వెళుతున్నారు. సిలబస్‌లో లోపం ఉన్న మాట నిజమే. అందులో నైతిక విలువలు లేవు. (ఆర్కే: కాలేజీల నుంచి ‘హ్యూమన్‌ బీయింగ్‌’లు వస్తున్నారా?) ఎడ్యుకేషన్‌ వలన అది కూడా వస్తుంది. సమాజంలో ఎలా ఉంటే విద్యార్థులు కూడా అలా తయారవుతున్నారు. దేశానికి ఏమైనా చేయాలని నేను కూడా విద్యార్థులకు చెబుతుంటాను. ఉదాహరణకు దేశం అభివృద్ధి చేయాలని నెహ్రూగారు ఏర్పాటు చేసిన ఐఐటీల్లో చదువుకున్న వారు విదేశాలకు వెళ్లిపోతున్నారు.


ర్యాంకింగ్‌ విధానం వలన మీకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకూ.. ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోతోంది. పుస్తకాల పురుగులు కాలేజీల నుంచి బయటికి వస్తున్నారు. దీనిలో మార్పు తెచ్చే అవకాశం ఉందా?

ఐఐటీ, ఏఐఈఈఈ లాంటి పరీక్షల్లో పుస్తకాల పురుగులు పనికిరారు. విశ్లేషణ సామర్థ్యంతో పాటు విషయాల పట్ల అవగాహన, అప్లికేషన్‌ ఉండాలి. లాజికల్‌ స్కిల్స్‌ జీవితంలోనూ ఉపయోగపడతాయి. పోటీ పరీక్షల్లో సఫలమైన వారు జీవితంలో మిగిలిన వారికంటే సమస్యలను బాగా పరిష్కరించగలుగుతున్నారు.


హైస్కూలు నుంచి విద్య ప్రైవేటు అయిపోయినప్పుడు ఇవన్నీ ఎలా సాధ్యం?

నేను ప్రభుత్వ పాఠశాలలో చదివాను. నాలో ప్రతిభను గుర్తించి నా టీచర్‌ నాకు గ్రా మర్‌ చెప్పారు. ఈ రోజున అలాంటి వారు లేరు. నేను విదేశాల నుంచి తిరిగొచ్చాక ఆయన కుటుంబానికి సాయం చేశాను. మితిమీరిన పోటీతత్వం వలన విద్యార్థులకు తీరాల్సిన సరదాలు తీరడం లేదు. రెసిడెన్షియల్‌ కాలేజీ అంటేనే కమ్యూనిటీ అని చెప్పొచ్చు. ఇక్కడ విద్యార్థులకు స్వేచ్ఛ ఉండదు. చైతన్యం ఉంటుంది. నేను చదువుకున్న రోజుల్లో అప్పుడున్న ట్రెండ్‌ను బట్టి డాక్టరయ్యాను. ఇప్పుడు పరిస్థితి అలా లేదు.


కార్పొరేట్‌ విద్యా సంస్థల మీద వచ్చే విమర్శలను ఎలా రిసీవ్‌ చేసుకుంటారు?

సద్విమర్శలను స్వీకరిస్తాం. విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల వలన సమస్య వ స్తోంది. విమర్శల్లో ఒత్తిడిని సమస్యగా చెబుతుంటారు. అయితే.. నిజంగా బాగా చదివే విద్యార్థి ఒత్తిడికి గురి కాడు. తల్లిదండ్రులు పిల్లలను ఇతరులతో పోల్చడం వలన కూడా ఒత్తిడి ఉంటుంది.


కొన్ని కోచింగ్‌ సెంటర్లలో సీట్‌ వస్తుందని నమ్మకం ఉన్న విద్యార్థుల మీదే శ్రద్ధ చూపుతారని విమర్శ ఉంది..

కొంత మంది టీచర్లు అలా అని ఉండొచ్చు. ‘శ్రీ చైతన్య’లో 10,000 మంది టీచర్లున్నా రు. వారి మీద చాలా ఒత్తిడి ఉంటుంది. వారి పర్ఫామెన్స్‌ను బట్టి ఇంక్రిమెంట్‌ ఉంటుం ది. వారు ఒత్తిడికి గురైనప్పుడు‘సీటు వచ్చే విద్యార్థులనే పట్టించుకుంటాం’ అనే మాటలు రావచ్చు. పిల్లల్లో బాగా చదివే వారికి వేరేగా చెప్పినా, బాటమ్‌ లేయర్‌ వారి మీద బాగా శ్రద్ధ చూపుతాం. ఒకే క్లాసులో టాప్‌ స్టూడెంట్లు, సాధారణ విద్యార్థులుంటే ఎవరికీ న్యాయం జరగదు. వారిని వేరు చేస్తేనే న్యాయం జరుగుతుంది.


ప్రైవేటు విద్యా సంస్థల్లోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. విద్యార్థుల్లో ఒత్తిడి ఎందుకు పెరుగుతోంది?

చదువులో వెనకబడినందు వలన ఆత్మహత్యలు జరగవు. కుటుంబ, వ్యకిగత సమస్యల వలనే జరుగుతాయి. ఇక్కడి కంటే విదేశాల్లోనే ఇలాంటి సమస్యలు ఉన్నాయి.


మీ సంస్థతో పాటు ఇతర సంస్థల పైన ఇంటర్‌ ప్రశ్నపత్రాల లీకేజీ గురించి కేసులు నమోదయ్యాయి. వాటి వివరాలు..?

1997లో పేపర్‌ లీకయిన మాట వాస్తవం. కిళ్లీ కొట్టుల్లోనూ పేపర్‌ అమ్మారు. తల్లిదండ్రులే ఆ పేపర్‌ తీసుకొచ్చి పిల్లలకు ఇచ్చారు. మాకు సంబంధం లేదు.


ఈ సంస్థను 86 మంది నుంచి రెండు లక్షల 40 వేల మందికి తీసుకురావడంలో చాలా ప్రయత్నం చేసి ఉంటారు. ఇంత చేసినా ప్రైవేటురంగం వారు విద్యా వ్యాపారం చేస్తున్నారని అంటున్నారు..

ఈ రంగంలో చాలా ఖర్చులుంటాయి. చెప్పుకోలేనివి కూడా ఉంటాయి. డబ్బు సంపాదించాలంటే.. ఇతర వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఈ 25 ఏళ్లలో నేను బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చూసుకోలేదు. ఒక ఏడాది గడిచిన తరువాత మిగిలింది మాత్రమే నాది అనుకుంటాను. అయితే.. గ్రోత్‌ లేనిదే ఉత్సాహం రాదు. ‘స్టేటస్‌ కో’ డెత్‌తో సమానం. అందుకే ఈ వయసులోనూ.. మరో బ్రాంచ్‌ ఎక్కడ పెడదామా అని చూస్తుంటాను. మాలాంటి సంస్థలు వచ్చిన తరువాత ఐఐటీ గురించి, వాటి విలువ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాం. అందుకే ఐఐటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ను నంబర్‌ వన్‌గా నిలబెట్టాం. అనవసరంగా విమర్శించిన వారికి డబ్బు ఇవ్వడం బాధే. మాట పడడం డబ్బు కోల్పోవడం కంటే బాధగా ఉం టుంది. ఈ విధంగా అందరినీ సంతృప్తి పరచడానికి లాభంలో 15 శాతం ఖర్చవుతోంది.


విద్యారంగంలోకి కార్పొరేట్‌ సంస్థలు ప్రవేశిస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం?

స్థాపించిన వ్యక్తి ఉంటేనే విద్యా సంస్థలో సాఫల్యం ఉంటుంది. ఈ విషయంలో మా పిల్లలు నాకంటే బాగా డీల్‌ చేస్తున్నారు. మగ పిల్లాడి విషయానికొస్తే.. అతను టెన్త్‌ చదువుతుండగా యాక్సిడెంట్‌లో చనిపోయాడు. మృతదేహాన్ని బరియల్‌ గ్రౌండ్‌లో ఉంచి ఉదయాన్నే పిల్లలను నవ్వుతూ పరీక్షకు పంపాం. ఆ బాధ ఎప్పటికీ మర్చిపోలేను.


మీ బంధువుల చేతిలో మోసపోయారా?

అవన్నీ మర్చిపోవాలి. ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరు మోసం చేశారు. మా కంటే ముం దు మా అత్త మామలకు స్కూల్‌ ఉన్నా, మాకు సంబంధం లేదు. మేము దగ్గర్లోనే కాలేజీ పెట్టుకున్నాం. అది అభివృద్ధి చెందిన తరువాత మమ్మల్ని డాక్టర్లుగా ఉండిపోయి.. కాలేజీని తమకిచ్చేయాలని మా అత్తమామలు అడిగారు. నేను ఒప్పుకోలేదు.


మీది లవ్‌ మ్యారేజా? ఎవరు ఎవరిని మొదట లవ్‌ చేశారు?

నా తరపు నుంచే మొదలైంది. విజయవాడలో చదువుకున్నప్పుడే ఆమెతో నాకు పరిచయం. ఆ పరిచయం మెడిసిన్‌ చదవడం కోసం గుంటూరులో జాయినయినప్పుడు ప్రే మగా మారింది. ఆ తరువాత రెండు కుటుంబాలూ ఒప్పుకున్నాయి.


మీకు, నారాయణ మధ్య రాజీ కుదిరిందంటారు. నిజమేనా?

కొంత వరకూ నిజమే. ఒకప్పుడు ఒకరి లెక్చరర్లను ఒకరు తీసుకెళ్లడమనే వ్యవహారం పిల్లలను కూడా తీసుకెళ్లడమనే వరకూ వచ్చింది. అయితే.. ఒకరి లెక్చరర్లను ఒకరు తీసుకెళ్లరాదని ఒప్పందానికి వచ్చాం. పిల్లల విషయంలోనూ ఇదే ఒప్పందానికి వచ్చాం. విస్తరణ విషయంలో ఎలాంటి ఒప్పందాలూ లేవు. సివిల్స్‌లోనూ ఆంధ్రప్రదేశ్‌ను నంబర్‌ వన్‌గా నిలబెట్టి రిటైర్‌ అవుదామనుకుంటున్నా.

Updated Date - 2020-02-07T22:53:04+05:30 IST