వేసవొచ్చినా బోరు..భోరు..

ABN , First Publish Date - 2021-04-17T09:58:35+05:30 IST

రైతురాజ్యం అని చెప్పుకొంటున్న వైసీపీ ప్రభుత్వం... పేద, బడుగు రైతులతోనే ఆడుకుంటున్నదా? పేద రైతుల పొలాలకు రూ.ఆరు వేలుతో జలాలను అందిస్తున్న

వేసవొచ్చినా బోరు..భోరు..

ఏడాదిగా పడని ‘జలకళ’ బోరు

అమల్లో ఉన్న పథకం ఆపేశారు

బాలారిష్టాలు దాటని కొత్తస్కీమ్‌

మార్గదర్శకాల్లో పదేపదే మార్పులు

ఒక పథకంపై ఇప్పటికి 3 జీవోలు

ఎట్టకేలకు కార్యాచరణ ఉత్తర్వులు

ఇక ఎప్పటికి అమలయ్యేనో?


అమరావతి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): రైతురాజ్యం అని చెప్పుకొంటున్న వైసీపీ ప్రభుత్వం... పేద, బడుగు రైతులతోనే ఆడుకుంటున్నదా? పేద రైతుల పొలాలకు రూ.ఆరు వేలుతో జలాలను అందిస్తున్న ఎన్టీఆర్‌ జలసిరి పథకాన్ని రద్దు చేశారు. దాని స్థానంలో రైతు రూపాయి పెట్టకుండా ఉచితంగా బోర్లు వేయిస్తామంటున్నారు. సర్కారు ఏర్పడి రెండేళ్లయితే, ఈ మాటలు చెప్పి ఏడాది దాటిపోతోంది. కానీ, కళ్లు కాయలు గాచేటట్లు ఎదురుచూడటమేగానీ సర్కారు తెచ్చిన కొత్త పథకం ‘వైఎస్సార్‌ జలకళ’ జాడ మాత్రం కనిపించడం లేదని లబ్ధిదారులైన పేద రైతులు వాపోతున్నారు.


పదే పదే జీవోలు, మార్గదర్శకాల కోసం మెమోల మీద మెమోలు ఇస్తూ కాలయాపన చేయడమేగానీ, వేసవిలో పైర్లు ఎండనీయకుండా బోర్లు వేయాలన్న యోచనే చేయడం లేదు. రైతులందరికీ ఉపయోగపడేలా మూడేళ్లపాటు శ్రమించి గతంలో ఉన్నఅధికారులు మార్గదర్శకాలు తయారుచేశారు. వాటిని కాదని కొత్త మార్గదర్శకాలు రూపొందించేక్రమంలో అసలు పథకం అమలే ఆలస్యమయిపోతోంది. విచిత్రంగా అటు తిప్పి ఇటు తిప్పి ఇప్పుడు పాత మార్గదర్శకాలనే అమలుచేసేందుకు అధికారులు మొగ్గుచూపారు. ఈమేరకు శుక్రవారం సర్య్యులర్‌ జారీ చేశారు. ఇదంతా చూసినవారు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉన్న అధికారుల వింత ధోరణి ఉన్నదని వ్యాఖ్యానిస్తున్నారు. 


పదే పదే జీవోలు, మెమోలు..

అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత, అంటే గత ఏడాది  జూలై మూడో తేదీన వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఉచితంగా రైతులందరికీ బోర్లు వేయిస్తామంటూ ప్రభుత్వం జీవో నెం.641 విడుదల చేసింది. దరఖాస్తులను గ్రామ సచివాలయాల ద్వారా ఎలా అప్‌లోడ్‌ చేసుకోవాలి.. ఏ అధికారి వీటి మంజూరులో ఏ చర్యలు తీసుకోవాలనేది మార్గదర్శకాలు ఇచ్చారు. మార్గదర్శకాలను విడుదల చేయడమే గానీ ఇంతవరకు కార్యాచరణ మాత్రం ప్రారంభం కాలేదు. ఈ మార్గదర్శకాలను సవరిస్తూ గత ఏడాది అక్టోబరు 9న జీవో నెం.676 విడుదల చేశారు. ఈ జీవోలు చాలవన్నట్లు గత ఏడాది డిసెంబరు 14న మరి కొన్ని సవరణలతో ముచ్చటగా మూడోజీవో (జీఓ నెం. 689) తెచ్చారు. తాజాగా శుక్రవారం గ్రామీణాభివృద్ధిశాఖ తాపీగా కార్యాచరణ మార్గదర్శకాలంటూ సర్క్యులర్‌ నం.22ను విడుదల చేసింది. ఇన్ని జీవోలు, సర్క్యులర్లు జారీచేసినా కొత్తగా  సాధించిందేమీ లేదని రైతులు పెదవి విరుస్తున్నారు. 


తొలుత అలా.. ఆపై తూచ్‌..

అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిపాటు ఎన్టీఆర్‌ జలసిరి బదులు కొత్త పథకం తీసుకురావాలన్న ఆలోచనే సర్కారు చేయలేదు. ఆ తర్వాత ఎప్పుడో వైఎస్సార్‌ జలకళ పథకం ప్రకటించారు. మోటారు,విద్యుత్‌ కనెక్షన్‌ లేకుండానే బోర్లు వేస్తామని తొలుత ప్రకటించారు. బడ్జెట్‌లో ఆ మేరకే నిధులు కేటాయించారు. బడ్జెట్‌లో గత రెండేళ్ల పాటు వరుసగా రూ.200 కోట్లు, రూ.100 కోట్లు ఈ పథకం కోసం కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష బోర్లను ఉచితంగా తవ్వాలని, తవ్వకపు ఖర్చును భరించేందుకు రాష్ట్రప్రభుత్వ నిధి నుంచి రూ.300 కోట్లు అవసరమవుతాయని లెక్కించింది. బోర్లు తవ్వడం సరే.. వాటికి మోటార్‌, విద్యుత్‌ కనెక్షన్‌ మాటేమిటి? పథకం మార్గదర్శకాల్లో ఆ ఊసే లేని విషయాన్ని ‘ఆంరఽధజ్యోతి’ కథనాలు ఎత్తిచూపాయి. దీంతో సర్కారు ఆలోచనలో పడింది. పేద రైతులందరికీ బోర్లుతో పాటు మోటార్‌, విద్యుత్‌ కనెక్షన్‌, ఇతర వైరు తదితర వస్తువులు ఉచితంగా ఇస్తామని ఉత్తర్వులు జారీచేసింది. 


వేసవి వచ్చేసినా, ఏడాది క్రితం ఇచ్చిన ‘జలకళ’ హామీకి మాత్రం అతీగతీ లేదు. వైఎస్సార్‌ జలకళ పథకానికి మార్గదర్శకాలను రూపొందించడంలోనే పొద్దుపుచ్చేసిన సర్కారు, తాజాగా కార్యాచరణను ప్రకటించింది. కార్యాచరణకే ఇంతకాలం పడితే... పఽథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు.. పొలాల్లో బోర్లు ఎప్పటికి వేస్తారని రైతులు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. 


ఆ లబ్ధిదారులను ఏం చేస్తారు?

అధికారంలోకి రాగానే పాత పథకాలన్నీ రద్దు చేసినట్టే, ఎన్టీఆర్‌ జలసిరినీ వైసీపీ సర్కారు కాలగర్భంలో కలిపేసింది. అదే సమయంలో గతంలో ఈ పథకానికి ఎంపికయిన వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కొంత మంది పేద రైతుల పొలాల్లో బోర్లువేసిన అప్పటి సర్కార్‌, సోలార్‌ పంపుసెట్లు ఇచ్చే లోపే మారిపోయింది. కొత్త ప్రభుత్వం అసలే పట్టించుకోకపోవడంతో కొంత మంది రైతులు సోలార్‌ సెట్లు కోసం చేసిన డిపాజిట్‌ డీడీలను వెనక్కి తీసుకుంటున్నారు. ఇప్పటికే గత పథకంలో బోర్లు వేసుకున్న పేద రైతులు.. మోటార్‌ పంపుసెట్లు, సోలార్‌ సెట్‌ పొందలేని పరిస్థితి! పైగా అప్పట్లో బోరు వేసినందున కొత్త పథకంలో వారు అర్హులు కారని చెప్పడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

Updated Date - 2021-04-17T09:58:35+05:30 IST