Abn logo
Nov 27 2020 @ 00:16AM

ఒకరిలో ఇద్దరు!

విరుద్ధమైన ద్వంద్వాల వల్ల మనోరుగ్మతలు పుడతాయి. ‘క్రోధం, ద్వేషం, అసూయ లాంటివన్నీ కలిగేది ఈ రుగ్మతల వల్లే. మనం ఇద్దరుగా కాదు, ఒక్కరుగా ఉండాలి. అప్పుడే దుఃఖం ఉండదు’ అంటూ మనస్సుకు వైద్యం చేసిన తొలి మనో వైజ్ఞానిక శాస్తవేత్త బుద్ధుడు. అందుకే ‘అన్నిటికీ అగ్రగామి మనసే!’ అంటుంది బౌద్ధం. 


దుఃఖం బయట నుంచి కొని తెచ్చుకొనే వస్తువు కాదు. మనిషి తనకు తాను రూపొందించుకొనే మనో స్థితి. లోపలా, బయటా ఏ వ్యక్తి ఒకే తీరుగా ఉంటాడో అతని మనస్సు సమతా స్థితిని పొందుతుంది. అలాంటి వారు దుఃఖాన్ని దూరం చేసుకుంటారు. కానీ చాలామంది లోపల ఒక రకంగా ఉంటారు. బయటకు మరో రకంగా కనిపిస్తారు, ప్రవర్తిస్తారు, నటిస్తారు. ఇలాంటి నటనా స్థితిలో ఉండే వ్యక్తి ఎలా శాంతంగా ఉండలేడో... అలాంటి వ్యక్తులున్న సమాజం కూడా ప్రశాంతంగా ఉండదు. ఈ ద్వంద్వ ప్రవృత్తి కేవలం సాధారణ మనుషుల్లోనే కాదు.. తాపసులు, సాధు పుంగవులు, భిక్షువుల్లో కూడా ఉంటుంది. ‘మనిషి నిజం చెబుతున్నాడా? లేదా?’ అనేది తేల్చే లై డిటెక్టర్లు ఇప్పుడు వచ్చాయి. కానీ నిజాన్ని కక్కించే ఇలాంటి పరీక్ష జరిగిన ఒక కథ బౌద్ధంలో ఉంది. 


ద్వీపాయనుడు గొప్ప తాపసి. హిమాలయాల్లో యాభై ఏళ్ళపాటు ఏకాంతంగా గడిపిన మహా మౌని. ఆయన ఒకసారి వారణాసి రాజ్యానికి వచ్చాడు. ఆ నగర శివారులోని ఓ గ్రామంలో మాండవ్యుడు అనే గృహస్థు ఆయనకు ఆశ్రయం ఇచ్చాడు. మాండవ్యుడికి గొప్ప దాతగా పేరుంది. ఆయన భార్య మహా సాధ్వి. అతిథుల్ని చక్కగా ఆదరిస్తూ ఉండేది. ఆమె పేరు మాండవి. వారు తమ ఇంటి దగ్గరలోని తోటలో ఒక పర్ణశాలను ద్వీపాయనుడికి నిర్మించి ఇచ్చారు.  ఆయనకు కావలసినవి అందించేవారు. 


ఆ దంపతులకు లేకలేక సంతానం కలిగింది. ఆ బిడ్డకు ఆరేళ్ళు. ఒక రోజు ద్వీపాయనుడి కుటీరం దగ్గర ఆయన ప్రబోధాన్ని మాండవ్యుడు, మాండవి వింటున్నారు. వారి పిల్లవాడు బంతితో ఆడుకుంటూ ఉండగా, ఆ బంతి వెళ్ళి ఒక కలుగులో పడింది. పిల్లవాడు ఆ బంతిని తీసుకొనే సమయంలో, కలుగులో ఉన్న పాము అతణ్ణి కాటేసింది. పిల్లవాడు భయంతో అరిచాడు. అది విన్న ఆ దంపతులు పరుగున వెళ్ళి, జరిగింది గమనించి, తమ బిడ్డను ద్వీపాయనుడి దగ్గరకు తీసుకువచ్చారు. అప్పటికే ఆ పిల్లవాడు స్పృహ తప్పాడు.  ‘‘స్వామీ! మీకు దివ్య శక్తులు ఉన్నాయి. మా పిల్లవాడిని బ్రతికించండి’’ అంటూ బిడ్డను ఆయన పాదాల ముందు ఉంచారు.


‘‘నా దగ్గర మహిమలేవీ లేవు. అయితే ఇలాంటి స్థితిలో ఉన్నవారిని బ్రతికించేది సత్యక్రియ మాత్రమే!’’ అన్నాడు ద్వీపాయనుడు.


‘‘మీలోని సత్యక్రియ ద్వారా మా పిల్లవాడిని బ్రతికించండి’’ అని ఆ దంపతులు వేడుకున్నారు.


‘‘సరే!’’ అని, ఆ బిడ్డ తలపై ఆయన చెయ్యి పెట్టి, ‘‘సత్యక్రియ అంటే మనస్సులో ఉన్న నిజాన్ని చెప్పడం. నా సత్యక్రియ వల్ల ఈ బిడ్డ జీవించుగాక!’’ అన్నాడు.


వెంటనే పాము కాటు వేసిన చోటు నుంచి కొద్దిగా విషం జారి వచ్చింది. పిల్లవాడు కొంచెం లేచి, కళ్ళు తెరిచి, ‘‘అమ్మా!’’ అని అరచి మళ్ళీ పడిపోయాడు.


అప్పుడు ద్వీపాయనుడు ‘‘మాండవ్యా! నా సత్యక్రియ ప్రభావం ఇంతే... ఇప్పుడు నీవు ప్రయత్నించు’’ అన్నాడు.


మాండవ్యుడు తన బిడ్డ ఛాతీ భాగాన చెయ్యి ఉంచి ‘‘నా సత్యక్రియ వల్ల నా బిడ్డ జీవించుగాక!’’ అన్నాడు. బిడ్డ శరీరంలోని విషం దిగి కాళ్ళ వరకూ వచ్చింది. బిడ్డ లేచి కూర్చున్నాడు. కానీ నిలబడలేకపోయాడు.


‘‘అమ్మా! మాండవీ! ఇక నీవంతు’’ అన్నాడు ద్వీపాయనుడు. ఆమె కూడా బిడ్డను పట్టుకొని అలాగే చేసింది. విషం పూర్తిగా దిగిపోయి ఆ పిల్లవాడు లేచాడు. తిరిగి ఆటల్లో పడిపోయాడు.


‘‘స్వామీ! మన ముగ్గురిలో ఏ ఒక్కరం సంపూర్ణంగా సత్యక్రియ ఆచరించలేదా?’’ అని అడిగాడు మాండవ్యుడు.


‘‘అవును! మనం మనస్సులోని నిజాన్ని తలచుకుంటేనే ఆ బిడ్డ బ్రతికాడు. నేను కూడా సత్యక్రియను పూర్తిగా ఆచరించలేదు. ప్రజలు ఇచ్చే గౌరవం కోసం ఇలా తాపసిలా ఉంటున్నాను కానీ, నాకూ కుటుంబ జీవనం సాగించాలనే కోరిక లోపల ఉంది. అందుకే దాని ఫలితం అంతవరకే కనిపించింది’’ అన్నాడాయన.


‘‘స్వామీ! నేను అంతే ! నా తాతలు, తల్లితండ్రుడు దానాలు చేశారు. వారి వారసత్వం పోకుండా, మా కుటుంబ కీర్తి చెడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే దానాలు చేస్తూ... దాతగా కీర్తి పొందాను’’ అన్నాడు మాండవ్యుడు.


‘‘స్వామీ! నా బిడ్డను కరిచిన పామును ఎలా భయంతో ఈసడించుకుంటానో నా భర్త పట్ల కూడా మనస్సులో అలాగే ఉంటాను. మా కుటుంబంలో స్త్రీలెవరూ భర్తల్ని విడిచిపెట్టలేదు. వారికి చెడ్డపేరు తేకూడదనే ఈయన్ని  భరిస్తున్నా’’ అంది మాండవి. 


అందరి మనోగతాలూ బయటపడ్డాయి. తాపసి వారిద్దరి తప్పులూ సరిదిద్దాడు. వారు మనసులు విప్పి చెప్పుకొన్నారు.


అప్పుడు ద్వీపాయనుడు ‘‘మిమ్మల్ని చక్కదిద్దాను. ఇక నన్ను నేను చక్కదిద్దుకోవాలి’’ అని, వారి దగ్గర సెలవు తీసుకొని, హిమాలయాలకు వెళ్ళాడు.

 బొర్రా గోవర్ధన్‌

Advertisement
Advertisement
Advertisement