ఉమ్మడి జిల్లాలో ఇద్దరికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-06-03T09:39:32+05:30 IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ

ఉమ్మడి జిల్లాలో ఇద్దరికి పాజిటివ్‌

దూది వెంకటాపూర్‌లో కరోనాతో బాలింత మృతి


నల్లగొండ ఆర్బన్‌, చౌటుప్పల్‌ టౌన్‌, రాజాపేట, వలిగొండ జూన్‌ 2: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాకేంద్రం పానగల్‌ రోడ్డు శ్రీనగర్‌ కాలనీకి చెందిన యువకుడు, ఇటీవల ఏపీ నుంచి వచ్చాడు. అతడు నాలుగు రోజుల క్రితం జ్వరంతో బాధపడుతుండగా, కుటుంబసభ్యులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్‌ చేశారు. అతడి నమునాలు సేకరించి పరీక్షలకు పంపగా, మంగళవారం పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్‌ చేసి స్వాబ్‌ నమూనాలను పరీక్షలకు పంపారు. అధికారిక లెక్కల ప్రకా రం ఇప్పటివరకు వలస కూలీల పాజిటివ్‌ కేసులు 9కి చేరాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ పట్టణం లో ఒక కూరగాయల వ్యాపారికి మంగళవారం పాజిటివ్‌ నిర్ధారణ అయింది.


కూరగాయల వ్యాపారి గత నెల 25 నుంచి జ్వరం, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా తేలడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, అతడితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులను గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం దూదివెంకటాపూర్‌ గ్రామానికి చెందిన మహిళ కరోనాతో సోమవారం రాత్రి మృతి చెందింది. 23 ఏళ్ల మహిళ రెండో కాన్పు కోసం రాజాపేట, జనగామ జిల్లా బచ్చన్నపేట, జనగామ, హన్మకొండ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకుంది. ఆమెకు రక్తం తక్కువగా ఉండడంతో గత నెల 29న హన్మకొండలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. 30న హైదరాబాద్‌ ఉస్మానియాకు తరలించారు. అక్కడ ప్రసవం జరగ్గా, బిడ్డ మృతిచెందింది. ఆమె పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మృతి చెందింది. కాగా, ఆమెకు వైద్య పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమె కుటుంబ సభ్యులు 9 మందిని బీబీనగర్‌ క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. దీంతో గ్రామాన్ని పోలీసులు, వైద్య సిబ్బంది సందర్శించి హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.


10మంది హోంక్వారంటైన్‌లో:  యాదాద్రిజిల్లా వలిగొండ మండలానికి మంగళవారం ముంబై నుం చి వచ్చిన 10మంది వలస కార్మికులను హోం క్వారంటైన్‌ చేసినట్టు మండల వైద్యాధికారి తెలిపారు.

Updated Date - 2020-06-03T09:39:32+05:30 IST