అధిక వర్షపాతం వల్లే ఘాట్‌ రోడ్డుపైకి బండరాళ్లు

ABN , First Publish Date - 2021-12-03T09:23:47+05:30 IST

అధిక వర్షపాతం వల్లే ఘాట్‌ రోడ్డుపైకి బండరాళ్లు

అధిక వర్షపాతం వల్లే ఘాట్‌ రోడ్డుపైకి బండరాళ్లు

30-40 టన్నుల బరువున్న రాళ్లు పడటంతో రోడ్డు, రక్షణ గోడలు ధ్వంసం

12 ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం

అలిపిరి, రెండో ఘాట్‌ రోడ్డు పరిశీలించిన ఐఐటీ నిపుణులు

2-3 రోజుల్లో టీటీడీకి సమగ్ర నివేదిక


తిరుమల, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో అధిక వర్షపాతం నమోదు కావడంతోనే ఘాట్‌ రోడ్డులో కొండరాళ్లు పడ్డాయని ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్‌ కెఎస్‌ రావు అభిప్రాయపడ్డారు. బుధవారం తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునే రెండవ ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడి, రక్షణ గోడలు, నాలుగు ప్రాంతాల్లో రోడ్డు ధ్వంసమైంది. రోడ్డు మరమ్మతులతో పాటు కొండ చరియలు విరిగిపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనల కోసం ఐఐటీ నిపుణులను టీటీడీ ఆహ్వానించింది. అలిపిరి, రెండవ ఘాట్‌ రోడ్డులో కొండ చరియలను గురువారం ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్‌ కెఎస్‌ రావు, చెన్నై ఐఐటీ ప్రొఫెసర్‌ ప్రసాద్‌, టీటీడీ పూర్వ చీఫ్‌ ఇంజనీర్‌, సాంకేతిక సలహాదారు రామచంద్రారెడ్డి బృందం పరిశీలించింది. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, గోడలు, కల్వర్టులతో పాటు 22 కిలోమీటర్లున్న రెండవ ఘాట్‌ రోడ్డును పరిశీలించడంతో పాటు.. డ్రోన్‌ ద్వారా దెబ్బతిన్న ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కెఎస్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోని వివిధ కొండ ప్రాంతాల్లో ఘాట్‌ రోడ్లలో వర్షాలకు కొండ చరియలు విరిగిపడకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. 2017వ సంవత్సరంలో వర్షాలకు దెబ్బతిన్న తిరుమల ఘాట్‌రోడ్లలో మరమ్మతులకు ఈ టెక్నాలజీని ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే టీటీడీ ఇంజనీరింగ్‌ విభాగం ఘాట్‌రోడ్లకు ఇరువైపులా సున్నితమైన ప్రాంతాలను గుర్తించి బండరాళ్లకు ఫెన్సింగ్‌, రాక్‌ బోల్టింగ్‌, షాట్‌ క్రీటింగ్‌, బ్రస్ట్‌ వాల్స్‌ ఏర్పాటు చేసిందన్నారు. శేషాచల కొండల్లో, ఘాట్‌ రోడ్లలో వర్షపు నీరు నిలవకుండా ఆరుప్రాంతాల్లో అదనపు కాలువలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుత వర్షాలకు బుధవారం విరిగిపడిన బండరాళ్లు 30 నుంచి 40 టన్నుల బరువుంటాయని, ఇవి చాలా ఎత్తు నుంచి పడటంతో రోడ్లు, రక్షణ గోడలు దెబ్బతిన్నాయన్నారు. మరో 12 ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడే ప్రమాదమున్నట్లు గుర్తించామన్నారు. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయడానికి కనీసం రెండు, మూడు నెలల సమయం పడుతుందన్నారు. కొండచరియలు విరిగిపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి రెండు, మూడు రోజుల్లో టీటీడీకి సమగ్ర నివేదిక అందించనున్నట్లు తెలిపారు. అదనంగా మరో ఘాట్‌రోడ్డును ఏర్పాటు చేసుకోవడం కూడా ఇలాంటి విపత్తు సమయాల్లో ఉపయోగపడుతుందన్నారు. 


2 రోజుల్లో లింక్‌రోడ్డు అందుబాటు..

రెండురోజుల్లో తిరుమలకు చేరుకునేందుకు లింక్‌రోడ్డు అందుబాటులోకి వచ్చే అవకాశముందని టీటీడీ  సాంకేతిక సలహాదారు రామచంద్రారెడ్డి తెలిపారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న మరో భారీ బండరాయిని తొలగించేందుకు పరిశీలన చేస్తున్నట్టు చెప్పారు. మొదటి ఘాట్‌రోడ్డు తరహాలో రెండవ ఘాట్‌రోడ్డు పటిష్టమైనది కాదని, దట్టమైన అడవి, లూజ్‌ సాయిల్‌తో కూడిన బండరాళ్ల మధ్య ఏర్పాటు చేసిన రోడ్డు కావడంతో మరింత జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. పాడైన రోడ్డులో మరమ్మతులు చేసి అలిపిరి నుంచి లింక్‌రోడ్డు వరకు వాహనాలను తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ లింక్‌ రోడ్డు వరకు వాహనాలను తీసుకురాగలిగితే మోకాళ్ల మిట్ట నుంచి వాహనాలను తిరుమలకు తీసుకువెళ్లచ్చన్నారు. 

Updated Date - 2021-12-03T09:23:47+05:30 IST