ఆంక్షల హద్దులు

ABN , First Publish Date - 2021-05-06T06:33:45+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి తెలుగు రాష్ట్రాల మధ్య రాక పోకలపై పడింది. ఏపీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ నుంచి 18 వరకు మధ్యాహ్నం 12గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలను అనుమతించడంలేదు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చి, మిగతా వాటిని వెన క్కు పంపుతున్నారు.

ఆంక్షల హద్దులు
నల్లగొండ జిల్లా దామరచర మండలం వాడపల్లి సమీపంలోని ఏపీలోని పొందుగల చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న ఏపీ పోలీసులు

రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకల కట్టడి 

కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చర్యలు 

సరిహద్దుల్లో నిలిచిపోయిన వాహనాలు 

ఇబ్బందులుపడిన వాహనదారులు

గుర్తింపు కార్డు ఉన్నా అనుమతించని పోలీసులు


కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి తెలుగు రాష్ట్రాల మధ్య రాక పోకలపై పడింది.  ఏపీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ నుంచి 18 వరకు మధ్యాహ్నం 12గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలను అనుమతించడంలేదు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చి, మిగతా వాటిని వెన క్కు పంపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు పంచుకుంటు న్న ఉమ్మడి నల్లగొండ జరిధిలో కోదాడ మండలం రామాపు రం, వాడపల్లి మండలంలోని పొందుగుల, నాగార్జునసాగర్‌ నుంచి మాచర్ల వైపు మూడు సరిహద్దులు(చెక్‌పోస్టులు) ఉన్నాయి. వీటిని ప్రస్తుతం మూసి వేశారు. దీంతో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వెళ్లే ప్రజలు, వాహనాదారులు ఇబ్బందు లు పడుతున్నారు. తెలంగాణలో లేని లాక్‌డౌన్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఏమిటంటూ ప్రజలు పోలీసులను నిలదీస్తున్నారు. 


ఏపీ సరిహద్దు వైపు తనిఖీలు

దామరచర్ల: కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల మధ్య రాకపోకలు ఈ నెల 5వ తేదీ నుంచి 18 వరకు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈనేపథ్యంలో నల్లగొం డ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి రాష్ట్ర సరిహద్దు అవతలి వైపున ఉన్న ఏపీలోని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని పొం దుగల చెక్‌పోస్ట్‌ వద్ద అక్కడి పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. తొలుత అత్యవసర వాహనాలు మినహా మిగిలిన వాహనాలను మధ్యాహ్నం 12 గంటలనుంచి ఉదయం 6గంటల వరకు అనుమతించమని అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వాహనాలు తక్కువసంఖ్యలో సరిహద్దుకు చేరుకోవటం, మొదటి రోజుకావటంతో వాహనదారులను తనిఖీలు చేసి ఆంధ్రప్రదేశ్‌కు పంపుతున్నారు. హైదరాబాద్‌, నార్కట్‌పల్లి నుంచి నల్లగొండ మీదుగా మిర్యాలగూడ, సూర్యాపేట జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మిర్యాలగూడకు, అక్కడి నుంచి దామరచర్ల మం డలంలోని వాడపల్లి రాష్ట్ర సరిహద్దుకు నిత్యం భారీ వా హనాలు సుమారు 4వేలు, మినీ వాహనాలు 500, కా ర్లు 1000కి పైగా రాష్ట్రం నుంచి ఏపీకి వెళ్తుంటాయి. సరిహద్దు వద్ద వాహనాలను నిలిపి వేయనున్న సమాచారంతో తక్కువ సంఖ్యలో వాహనాలు సరిహద్దు వద్దకు చేరుకొంటున్నాయి. గతేడాది కరోనా మొదటి దశలో ఏపీ ప్రభుత్వం సరిహద్దు మూసివేయటంతో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్న వేలాది మంది ప్రజలు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు వాడపల్లి సరిహద్దు వద్దకు చేరుకొని ఏపీ పోలీసులు అనుమతించకపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణికులను అదుపు చే యలేక ఏపీ పోలీసులు పలుమార్లు లాఠీచార్జ్‌ చేశారు. అప్పట్లో వారికి ఎస్పీ ఏవీ రంగనాథ్‌ ఆధ్వర్యంలో పోలీసులు, స్థానికులు భోజన సదుపా యం కల్పించి వారి ఆకలితీర్చారు. రెండోదశ కరోనా ఉధృతంకావటంతో సరిహద్దులో తనిఖీలు ప్రారంభించి అత్యవసర వాహనాలను మాత్రమే రాష్ట్రంలోనికి అనుమతిస్తున్నట్లు ఏపీ పోలీసులు చెబుతున్నారు. 


తెలుగు రాష్ట్రాల వారధిపై ..

మఠంపల్లి : కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి, ఏపీ ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో తెలుగు రాష్ర్టాల వారధి మట్టపల్లి వంతెన వద్ద వాహనాలను తహసీల్దార్‌ లక్ష్మణ్‌బాబు, ఎస్‌ఐ ఎల్లయ్య తనిఖీ చేశారు. ఆంధ్ర నుంచి వచ్చే వాహనాలు, తెలంగాణ నుంచి వెళ్లే వాహనాలను ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆక్సిజన్‌ సిలిండర్లను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో తెలుగురాష్ట్రాల సరిహద్దు వారధిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.   


అనుమతి నిరాకరణ.. రోడ్లపైనే నిరీక్షణ 

కోదాడ: కరోనా నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈనెల 18వరకు లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు కోదాడ పరిధిలోని చెక్‌పోస్టు వద్ద గంటల కొద్దీ ఇబ్బంది పడాల్సి వస్తోంది. గుర్తింపుకార్డు ఉండే వాహనాలను పోలీసులు అనుమతిస్తుండగా, గుర్తింపుకార్డుల లేని వారు రోడ్లపైనే నిరీక్షించాల్సి వస్తోంది. విమాన, రైల్వే ప్రయాణికులు టికెట్లు చూపిస్తే ఇరు రాష్ట్రాల్లోకి ప్రయాణికులను అనుమతిస్తున్నారు. సాధారణ రోజుల్లో 65 నెంబరు జాతీయరహదారిపై ఏపీ, తెలంగాణకు నిత్యం 35వేల వాహనాలు ప్రయాణికులు, సరుకులను రవాణా చేస్తూ ఉంటాయి. పండుగ రోజుల్లో 50వేల వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. వాటిలో కార్లు సుమారు 18వేలు, కాగా గంటకు 750 కార్లు రెండు రాష్ట్రాల మధ్య నడిచేవి. లాక్‌డౌన్‌ ప్రకటనతో కార్ల ప్రయాణాలు తగ్గాయి.


ఉదయం గంటకు 300 కార్లు,  మధ్నాహ్యం 30 కార్లు

ఏపీ ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆంక్షలు అమలు చేసింది. అయితే ఉదయం వాహనాల రాకపోకలకు ఆంక్షలు లేకపోవటంతో రహదారిపై గంటకు సుమారు 300 కార్లు రాకపోకలు సాగించగా, మధ్యాహ్నం లాక్‌డౌన్‌తో వాటి సంఖ్య 30కి తగ్గింది. కార్లలో ప్రయాణించే వారిని ఏపీలోకి అనుమంతిచకపోవటంతో చాలా మంది ఇబ్బంది పడ్డారు. కొందరు ప్రయాణికులు హైదరాబాద్‌ వెనుదిరిగారు. 


సరిహద్దు గ్రామాలకు తప్పని తిప్పలు

రామాపురం, రెడ్లకుంట, నల్లబండగూడెం, అన్నవరం, మంగలతండా, కూచిపూడి తెలంగాణ సరిహద్దు గ్రామాలు. అదేవిధంగా జగ్గయ్యపేట, చిల్లకల్లు, గరికపాడు, తక్కెళ్లపాడు, అనుమంచిపల్లి ఏపీ సరిహద్దు గ్రామాలు. అయితే వివిధ పనులకోసం ఆయా గ్రామాల ప్రజలు నిత్యం ద్విచక్రవాహనాలు, ఆటోల్లో అటూ, ఇటూ ప్రయాణిస్తూ ఉంటారు. ఏపీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడం, పోలీసులు రహదారులపై ఆయా గ్రామస్థులను అనుమంతిచకపోవటంతో పనులు జరగక తిప్పలు పడుతున్నారు. లాక్‌డౌన్‌ నుంచి సరిహద్దు గ్రామాలవారికి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. 


12 దాటితే ఆంధ్రాకు వాహనాలు బంద్‌ 

కోదాడరూరల్‌, మే 5: రోజు రోజుకూ ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా అక్కడి ప్రభుత్వం ప్రకటించిన కర్ఫ్యూతో మధ్యాహ్నం 12దాటితే వాహనాల ను ఆంధ్రాకు అనుమతించడంలేదు. దీంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బయలుదేరిన వాహనాలను అధికారులు కోదాడ సూర్యాపేట జిల్లా కోదాడ మండ లం గరికపాడు చెక్‌పోస్టు వద్ద అడ్డుకోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సులు సైతం నిలిపివేయటంతో ప్రయాణికులు రోడ్డుపైనే నిరీక్షించా ల్సి వచ్చింది. అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలు మాత్రమే అనుమంతించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.  


ఆర్టీసీ బస్సులు నిలిపివేత 

హైదరాబాద్‌ విజయవాడ మద్య రోజుకు 500 కు పైగా ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. అక్కడి ప్రభుత్వ నిర్ణయం వలన హైదరాబాద్‌ నుంచి వచ్చే కొన్నింటిని రద్దు చేయగా మరికొన్ని బస్సులను తెలంగాణ సరిహద్దు వరకు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. కోదాడ, ఖమ్మం, సూర్యాపేట, కరీంనగర్‌, హైదరాబాద్‌ డిపోల బస్సులు సైతం పూర్తిగా రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.   


కానరాని వాహనాల రద్దీ

నాగార్జునసాగర్‌, మే 5: ఏపీలో కర్ఫ్యూ నిబంధనలు కఠినం చేయడంతో నల్లగొం డ జిల్లా నాగార్జునసాగర్‌ ఫైలాన్‌కాలనీ కొత్తవంతెన వద్ద ఏపీ పోలీసులు చెక్‌ పోస్టు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎలాంటి వాహనాలను ఏపీలోకి అనుమతించలేదు. తెలంగాణ వైపు నుంచి వచ్చే అత్యవసర వాహనాలను మాత్రమే ఏపీలోకి అనుమతించారు. దీంతో ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఉన్న నాగార్జునసాగర్‌ వద్ద వాహనాల రద్దీ కానరాలేదు. ప్రజా రవాణా వ్యవస్థ ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలను కూడా మధ్యాహ్నం 12 గంటలనుంచే ఏపీ వైపునకు వెళ్లకుండా నిలిపివేశారు. దీంతో ఏపీ-తెలంగాణ సరిహద్దులో నిర్మానుష్య వాతావరణం ఏర్పడింది. 


అధికారుల నిర్ణయంతో ఇబ్బందులు : రామచందర్‌రావు, కూకట్‌పల్లి 

అధికారుల నిర్ణయంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉదయం హైదరాబాద్‌లో తొమ్మిది గంటలకు బయలుదేరాను, ఆంద్రా సరిహద్దుకు వచ్చే సరికే 12 గంటలు అయింది. గుర్తింపు కార్డు ఉన్నా అనుమతించడంలేదు. పొద్దుపోయే వరకు కారులోనే గడపాల్సి వచ్చింది. 



నేటి నుంచి పకడ్బందీగా అమలు : నర్సింహరావు, ఎస్‌ఐ, నాగార్జునసాగర్‌ 

నేటినుంచి తెలంగాణ-ఏపీ సరిహద్దులో కర్ఫ్యూను పకడ్బందీగా అమ లు చేస్తాం. తెలంగాణ వైపు నుంచి ఎలాంటి ప్రజారవాణా వాహనాలను కూడా ఏపీలోకి అనుమతించరు. కాబట్టి వాహనదారులు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎవరూ ఆంధ్రా వైపునకు వెళ్లవద్దు.


Updated Date - 2021-05-06T06:33:45+05:30 IST