Tokyo olympics: ఏడుస్తూనే పతకాన్ని జేబులో పెట్టుకున్నాడు!

ABN , First Publish Date - 2021-08-06T02:19:11+05:30 IST

చివర్లో బంగారు పతకం చేజార్చుకుంటే..ఇక ఆ క్రీడాకారుడి వ్యథ వర్ణణాతీతం. సరిగ్గా అటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు బ్రిటన్ చెందిన బాక్సర్ బెన్ విట్టేకర్.

Tokyo olympics: ఏడుస్తూనే పతకాన్ని జేబులో పెట్టుకున్నాడు!

ఇంటర్నెట్ డెస్క్: విశ్వక్రీడల్లో పాల్గొనడమే ఓ అదృష్టం.. ఇక బంగారు పతకం గెలవడం అంటే కీర్తిప్రతిష్ఠల శిఖరాగ్రానికి చేరుకున్నట్టే. అందుకే..ఎందరో క్రీడాకారులు విశ్వక్రీడల్లో పసిడి పతకం కోసం అహోరాత్రాలు శ్రమిస్తారు. వ్యక్తిగత జీవితాల్ని త్యాగం చేస్తూ ఆటకే అంకితమైపోతారు. మరి ఇంతటి విశ్వప్రయత్నం చేసి..ఫైనల్స్‌కు చేరి.. చివర్లో బంగారు పతకం చేజార్చుకుంటే..ఇక ఆ క్రీడాకారుడి వ్యధ వర్ణణాతీతం. సరిగ్గా అటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు బ్రిటన్‌కు చెందిన బాక్సర్ బెన్ విట్టేకర్(24). 


బెన్ లైట్-హెవీ వెయిట్ కేటగిరీలో బరిలోకి దిగాడు. అయితే..పసిడి కోసం జరిగిన తుది పోరులో అపజయం ఎదుర్కొన్నాడు. దీంతో.. అతడు రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ స్థితి అతడిలో తీవ్ర నిరాశకు దారితీసింది. తన ప్రతిభకు గుర్తింపుగా లభించిన రజతం అతడిలో సంతోషాన్ని నింపలేకపోయింది. దీంతో..రజత పతకాన్ని మెడలో వేసుకునేందుకు నిరాకరించాడు. పసిడి పతాకన్ని కోల్పోయిన బాధలో అతడు కన్నీరుమున్నీరవుతూ తన పతకాన్నీ జేబులోనే పెట్టేసుకున్నాడు. ‘‘ఆటలో పాల్గొనేదే పసిడి పతకం కోసం. రజతం కోసం కాదు. ఫైనల్స్‌లో ఓటమి అంటే పసిడి పతకాన్ని కోల్పోవడం. రజతం సాధించడం కాదు. నేను చాలా నిరాశ చెందా. విఫలమైనట్టు భావిస్తున్నా’’ అని అతడు కామెంట్ చేశాడు. మెడల్‌నూ చేతిలో పట్టుకుని ఫొటోలకు ఫోజిచ్చాడు. అయితే.. రెట్టించిన ఉత్సాహంతో తాను మరో పర్యాయం రంగంలోకి దిగుతానని, అనుకున్నది సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు బెన్. 

Updated Date - 2021-08-06T02:19:11+05:30 IST