సెంచరీ కొట్టేదెవరో?

ABN , First Publish Date - 2020-12-26T07:53:10+05:30 IST

తమ టెస్టు చరిత్రలోనే అత్యంత చెత్త ఆటతీరుతో ఇంటా, బయటా విమర్శలు ఎదుర్కొన్న టీమిండియాపై ఇప్పుడు తీవ్ర ఒత్తిడి నెలకొంది. విరాట్‌ పితృత్వ సెలవుల కారణంగా స్వదేశానికి వెళ్లడంతో అజింక్యా రహానె జట్టు సారథిగా మారాడు. జరగబోయే మూడు టెస్టులు

సెంచరీ కొట్టేదెవరో?

  • భారత్‌ - ఆసీస్‌ మధ్య వందో టెస్టు
  • బాక్సింగ్‌ డే పోరు నేటినుంచే


అడిలైడ్‌లో అతి దారుణ ఆటతీరుతో చతికిలపడ్డ టీమిండియా మరో పోరుకు సిద్ధమవుతోంది. పూర్తి స్థాయి జట్టుతోనే చేదు ఫలితం ఎదుర్కొన్న భారత్‌కు ఈసారి రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌, పేసర్‌ షమి కూడా అందుబాటులో లేరు. అయినా పటిష్ట ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టు కోసం సై అంటోంది. ఈ సిరీస్‌ను సమం చేసేందుకు ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది. దీంతో కొత్త కెప్టెన్‌.. కొత్త కీపర్‌.. కొత్త ఓపెనర్‌.. కొత్త పేసర్‌తో భారత్‌ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది. అటు వార్నర్‌ ఈ మ్యాచ్‌కు కూడా దూరమవుతున్నా ఆసీస్‌ బలంగానే కనిపిస్తోంది. అన్నట్టు.. ఇది ఇరుజట్ల మధ్య వందో టెస్టు కావడం విశేషం. మరి..ఈ చారిత్రక పోరులో గెలిచి ‘సెంచరీ’ కొట్టేదెవరో..?


మెల్‌బోర్న్‌: తమ టెస్టు చరిత్రలోనే అత్యంత చెత్త ఆటతీరుతో ఇంటా, బయటా విమర్శలు ఎదుర్కొన్న టీమిండియాపై ఇప్పుడు తీవ్ర ఒత్తిడి నెలకొంది. విరాట్‌ పితృత్వ సెలవుల కారణంగా స్వదేశానికి వెళ్లడంతో అజింక్యా రహానె జట్టు సారథిగా మారాడు. జరగబోయే మూడు టెస్టులు అతడికి సవాల్‌గా మారనున్నాయి. అలాగే ఆసీస్‌ను దీటుగా ఎదుర్కొని మెల్‌బోర్న్‌లో మెరిసేందుకు భారత క్రికెటర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. దీంట్లో భాగంగా గురువారం విభిన్న రీతిలో టీమ్‌ ప్రాక్టీస్‌ చేసింది. మరోవైపు ఈ మ్యాచ్‌కు కూడా ముందు రోజే భారత జట్టును ప్రకటించారు. ఊహించినట్టుగానే వృద్ధిమాన్‌ సాహా, పృథ్వీ షాలకు ఉద్వాసన పలికి రిషభ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌ను తీసుకున్నారు. కోహ్లీ స్థానంలో రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమి స్థానంలో సిరాజ్‌ ఆడబోతున్నారు. కేఎల్‌ రాహుల్‌కు నిరాశే ఎదురైంది. క్రితంసారి ఇదే మైదానంలో ఆసీ్‌సను ఓడించిన భారత్‌ అదే స్ఫూర్తిని కొనసాగించాల్సి ఉంటుంది.


సిరాజ్‌, గిల్‌ అరంగేట్రం

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటైన తీరు జట్టును చాన్నాళ్లు వెంటాడనుంది. ఈ చేదు జ్ఞాపకాన్ని వీలైనంత త్వరగా మర్చిపోవాలంటే మెల్‌బోర్న్‌ మైదానంలో భారత జట్టు కసిగా ఆడాల్సి ఉంటుంది. అయితే ఇది అంత సులువుగా మాత్రం కనిపించడం లేదు. బ్యాట్స్‌మెన్‌ మూకుమ్మడిగా విఫలం కావడం ఆందోళనపరిచే అంశం. ఇక ఆసీ్‌సలో అద్భుత రికార్డు కలిగిన కోహ్లీ జట్టుకు అందుబాటులో లేడు. ప్రధాన బౌలర్‌ షమి లేని లోటు కూడా ఉంది. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆసీ్‌సను ఎదుర్కోవాల్సి ఉంది. కెప్టెన్‌ రహానె, పుజార తమ టెస్టు సత్తా ఏమిటో ప్రదర్శించాల్సి ఉంది. మరోవైపు ఇలాంటి కఠిన పరిస్థితిలో యువ ఆటగాళ్లు మహ్మద్‌ సిరాజ్‌, గిల్‌ అరంగేట్రం చేయబోతున్నారు. పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనే తీరుతో పాటు సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచే నైపుణ్యం గిల్‌ సొంతం. అందుకే మయాంక్‌తో కలిసి తను ఇన్నింగ్స్‌ ఆరంభించబోతున్నాడు. ఇక సాహాతో పోలిస్తే బెదురులేని బ్యాటింగ్‌తో పంత్‌ కాస్త పైచేయిలో ఉంటాడు. అదే ఈ యువ కీపర్‌ను ఈ మ్యాచ్‌లో ఆడేలా చేస్తోంది. మరోవైపు విరాట్‌ స్థానంలో వచ్చిన జడేజాపై జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. అలాగే తన చేరికతో జట్టు ఐదుగురు బౌలర్ల వ్యూహంతో వెళ్లేందుకు వీలవుతుంది. విహారికి మరో అవకాశం ఇవ్వడంతో రాహుల్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు. బౌలింగ్‌లో సిరాజ్‌ను షమితో పోల్చలేకపోయునా తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాడు. తండ్రి మరణంతో బాధను దిగమింగుతూ తన సత్తాను లోకానికి చాటాలనే ఉద్దేశంతో ఉన్నాడు. బుమ్రా, ఉమేశ్‌ అతడిని గైడ్‌ చేయాల్సి ఉంది.


మార్పుల్లేకుండా..

తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన ఆస్ట్రేలియా తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండబోవని చీఫ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ ప్రకటించాడు. డేవిడ్‌ వార్నర్‌ ఫిట్‌గా లేకపోవడంతో ఓపెనర్లుగా మాథ్యూ వేడ్‌, జో బర్న్స్‌ బరిలోకి దిగనున్నారు. ఆ తర్వాత లబుషేన్‌, స్మిత్‌తో మిడిలార్డర్‌ పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎంసీజీలో ఆడిన 9 టెస్టుల్లో స్మిత్‌ 908 పరుగులు సాధించాడు. బౌలింగ్‌లో కమిన్స్‌, స్టార్క్‌, హాజెల్‌వుడ్‌ త్రయాన్ని ఎదుర్కోవడం భారత్‌కు సవాలే.  ఈ మైదానంలో కమిన్స్‌ ఆడిన మూడు టెస్టుల్లోనే 18 వికెట్లు పడగొట్టాడు.


88 ఏళ్లలో తొలిసారి..

ఆస్ట్రేలియాతో శనివారం నుంచి జరగబోయే రెండో టెస్టులో భారత జట్టు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. సిరీ్‌సలో నిలిచేందుకే కాకుండా మరో చెత్త రికార్డు నమోదు చేయకుండా ఉండేందుకు కూడా ఈ గెలుపు అత్యవసరం కానుంది. ఎందుకంటే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడితే తమ 88 ఏళ్ల టెస్టు చరిత్రలో తొలిసారిగా ఓ క్యాలెండర్‌ ఏడాది (కనీసం మూడు టెస్టులు)లో అన్ని మ్యాచ్‌లను ఓడి న జట్టుగా నిలుస్తుంది. అందుకే కనీసం డ్రా చేసుకున్నా కాస్త పరువైనా దక్కుతుంది.


మైండ్‌ గేమ్‌తో ఇబ్బంది లేదు

ఆస్ట్రేలియా జట్టు మైండ్‌ గేమ్‌ ఆడడంలో దిట్ట అయినా.. తాము మాత్రం ఆటపైనే దృష్టి పెడతామని భారత తాత్కాలిక కెప్టెన్‌ రహానె స్పష్టం చేశాడు. రెండో టెస్టులో రహానెపై ఒత్తిడి నెలకొనేలా చూస్తామన్న ఆసీస్‌ కోచ్‌ లాంగర్‌ వ్యాఖ్యలపై తను స్పందించాడు. ‘ఆసీస్‌ ఆటగాళ్ల మైండ్‌ గేమ్‌ గురించి తెలిసిందే. కానీ మేం ఆటపైనే దృష్టి సారిస్తాం. జట్టుగా కలిసి ముందుకు సాగుతాం. కెప్టెన్సీ దక్కడం గర్వకారణంగా భావిస్తున్నా. ఎలాంటి ఒత్తిడికీ గురికాను’ అని రహానె తెలిపాడు.


 పిచ్‌

ఈ ఏడాది మార్చిలో మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ తర్వాత ఎంసీజీలో మరో మ్యాచ్‌ జరగబోతోంది. ఆసీ్‌సలోని ఇతర పిచ్‌లతో పోలిస్తే ఇది మరింత ఫ్లాట్‌గా ఉంటుంది. అయితే ఈసారి బంతికి బ్యాట్‌కు సమతూకంగా ఉండేలా రూపొందించారు. గత ఐదేళ్లుగా ఎంసీజీలో బ్యాట్స్‌మెన్‌దే హవా. ఈ సమయంలో ఇక్కడ నమోదైన సగటు స్కోరు 391.6. దీంతో మొదట బ్యాటింగ్‌ చేసే జట్టుకు ప్రయోజనం ఉంటుంది. 2018లో భారత్‌ గెలిచిన మ్యాచ్‌లోనూ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. బౌలర్లు మాత్రం వికెట్‌ తీయాలంటే కాస్త చెమటోడ్చాల్సిందే.


ఎంసీజీకి ‘శతక’ భాగ్యం

భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న  ఈ ప్రతిష్ఠాత్మక వందో టెస్టుకు మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ) ఆతిథ్యమిస్తోంది. ‘బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా జరిగే ఈ రెండో టెస్టు ఇరుజట్ల మధ్య వందో మ్యాచ్‌ కావడం విశేషం’ అని బీసీసీఐ ట్వీట్‌ చేసింది. 1947/48లో తొలిసారిగా రెండు జట్ల మధ్య టెస్టు సిరీస్‌ జరగగా.. ఆస్ట్రేలియా 4-0తో ఘనవిజయం సాధించింది. 


తుది జట్లు

భారత్‌: మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, పుజార, హనుమ విహారి, అజింక్యా రహానె(కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌, జడేజా, బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌, అశ్విన్‌, సిరాజ్‌.

ఆస్ట్రేలియా: జో బర్న్ప్‌, మాథ్యూ వేడ్‌, లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, టిమ్‌ పెయిన్‌ (కెప్టెన్‌), హెడ్‌, గ్రీన్‌, కమిన్స్‌, హాజెల్‌వుడ్‌, మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లియాన్‌.

Updated Date - 2020-12-26T07:53:10+05:30 IST