షాకింగ్ : అమ్మాయిల అశ్లీల ఫొటోలపై పాఠశాల విద్యార్థుల ఛాటింగ్

ABN , First Publish Date - 2020-05-05T15:40:52+05:30 IST

పాఠశాల విద్యార్థులు అమ్మాయిల అశ్లీల ఫొటోలు పోస్టు చేసి, అసభ్య వ్యాఖ్యలతో ఛాటింగ్ చేసిన బాగోతం దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది....

షాకింగ్ : అమ్మాయిల అశ్లీల ఫొటోలపై పాఠశాల విద్యార్థుల ఛాటింగ్

ఢిల్లీలో సంచలనం, పోలీసు కేసు

న్యూఢిల్లీ : పాఠశాల విద్యార్థులు అమ్మాయిల అశ్లీల ఫొటోలు పోస్టు చేసి, అసభ్య వ్యాఖ్యలతో ఛాటింగ్ చేసిన బాగోతం దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది. ఢిల్లీ నగరంలోని ప్రముఖ పాఠశాలల్లో చదువుతున్న 20 మంది విద్యార్థులు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘బోయిస్ లాకర్ రూం’ పేరిట ఓ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. అమ్మాయిల అర్దనగ్న ఫొటోలను ఈ గ్రూపులో పోస్టు చేసి వారి శరీరాలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. మైనర్ బాలికల అశ్లీల చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేయడమే కాకుండా వారిపై అత్యాచారం చేసేందుకు పాఠశాల విద్యార్థులే పథకం పన్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మహిళా కమిషన్ పోలీసులకు జారీ చేసిన నోటీసులో కోరింది. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు సుమోటోగా బోయిస్ లాకర్ రూం గ్రూపు పాఠశాల విద్యార్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇలా విద్యార్థుల ఇన్‌స్టాగ్రామ్ ఛాట్ పై పోలీసులు కేసు నమోదు చేయడం దేశంలోనే ప్రథమం. ఈ పాఠశాల విద్యార్థులపై ఐపీసీ సెక్షన్ 465, 471, 469, 509, ఐటీ చట్టం సెక్షన్ 67, 67 ఎల కింద కేసు నమోదు చేశారు. ఈ ఛాటింగులో నగ్నంగా ఉన్న అమ్మాయిల చిత్రాలను మార్ఫింగ్ చేశారని, వారి శరీర భాగాల గురించి అశ్లీల, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఛాటింగులో విద్యార్థులు తమ క్లాస్ మేట్స్ అయిన అమ్మాయిలపై  అత్యాచారం చేయడం గురించి చర్చించారు...ఈ అశ్లీల, అసభ్య వ్యాఖ్యల ఛాటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 16 నుంచి 18 ఏళ్ల వయసు గల బాలురు తమ క్లాస్ మేట్స్ అయిన అమ్మాయిలపై జరిపిన అత్యాచారాలకు వారి అందాన్ని బట్టి రేటింగ్ కూడా ఇచ్చారు. అమ్మాయిలు ధరించిన దుస్తులు, వారి వక్షోజాల సైజులు, అందం ప్రాతిపదికగా బాలురు అసభ్యంగా ఛాటింగ్ జరిపారు. తమ గురించి అమ్మాయిలు పెదవి విప్పితే వారి నగ్న చిత్రాలను బయటపెడతామని కూడా బాలురు హెచ్చరించడం కొసమెరుపు. ఈ గ్రూపు బాలురపై సైబర్ చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. విద్యార్థులను గుర్తించి వారిని అరెస్టు చేసి, వారి నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-05-05T15:40:52+05:30 IST