కుప్పకూలిన బీఆర్‌ షెట్టి వ్యాపార సామ్రాజ్యం

ABN , First Publish Date - 2020-05-21T07:06:13+05:30 IST

ఎన్‌ఎంసీ హెల్త్‌ పేరుతో దుబాయ్‌, గల్ఫ్‌ దేశాల్లో చక్రం తిప్పిన వ్యాపారవేత్త బీఆర్‌ షెట్టి వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది. వ్యాపార అక్రమాలు బయటపడడంతో చేసిన అప్పులు తీర్చలేక ప్రాణాలు అరచేత పట్టుకుని సొంతరాష్ట్రం కర్ణాటకకు పారిపోయి...

కుప్పకూలిన బీఆర్‌ షెట్టి వ్యాపార సామ్రాజ్యం

  • ప్రాణ భయంతో స్వదేశానికి పరుగు
  • కంపెనీ వ్యవహారాలపై యూఏఈలో దర్యాప్తు

ఎన్‌ఎంసీ హెల్త్‌ పేరుతో దుబాయ్‌, గల్ఫ్‌ దేశాల్లో చక్రం తిప్పిన వ్యాపారవేత్త బీఆర్‌ షెట్టి వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది. వ్యాపార అక్రమాలు బయటపడడంతో చేసిన అప్పులు తీర్చలేక ప్రాణాలు అరచేత పట్టుకుని సొంతరాష్ట్రం కర్ణాటకకు పారిపోయి వచ్చేశారు. కర్ణాటకలోని ఉడిపి సమీపంలో ఒక గ్రామంలో 1942లో జన్మించిన బీఆర్‌ షెట్టి 1973లో ఎనిమిది డాలర్లతో అబుదాబి వెళ్లి కొద్ది కాలం మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పని చేశారు. ఆ తర్వాత రెండేళ్లకు న్యూ మెడికల్‌ సెంటర్‌ (ఎన్‌ఎంసీ) హెల్త్‌ పేరుతో చిన్న క్లినిక్‌, ఫార్మసీ స్థాపించి దశదిశలుగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. యూఏఈతో పాటు వివిధ గల్ఫ్‌ దేశాల్లో ఎన్‌ఎంసీ గ్రూపు దాదాపు 200 హిస్పిటల్స్‌ నిర్వహిస్తోంది. ఆ తర్వాత ఆయన  యూఏఈ ఎక్స్చేంజ్‌, నియో ఫార్మా, ఎన్‌ఎంసీ ట్రేడింగ్‌, బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌ పేరుతో అనేక వ్యాపారాలు ప్రారంభించారు. 2018 నాటికి షెట్టి వ్యాపార సామ్రా జ్యం విలువ 420 కోట్ల డాలర్లు. 


అసలేమైంది ?

ద మడ్డీ వాటర్స్‌ అనే బ్రిటన్‌కు చెందిన పీఈ సంస్థ ఎన్‌ఎంసీ హెల్త్‌లో  కొంత వాటా కొనుగోలు చేయడంతో ఆయనకు సమస్య మొదలయింది. షెట్టి వ్యాపార లావాదేవీలపై తీగలాగితే డొంకంతా కదిలింది. మడ్డీ వాటర్స్‌ సంస్థ ఎన్‌ఎంసీ హెల్త్‌ ఆస్తులు, బ్యాలెన్స్‌ షీట్స్‌పై ఆరా తీసింది. పెట్టుబడుల కోసం ఎన్‌ఎంసీ హెల్త్‌ ఆస్తుల విలువ, నగదు నిల్వ వాస్తవం కన్నా ఎక్కువ చేసి చూపడమేగాక, అప్పులు తక్కువగా చూపినట్టు తేలింది. గత ఏడాది డిసెంబరు 17న ఆ సంస్థ ఈ వ్యవహారం అంతటినీ బట్టబయలు చేసింది. దాంతో లండన్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్‌ఎంసీ హెల్త్‌ కంపెనీ షేర్లలో ట్రేడింగ్‌ ఆపేసింది. అప్పటికి కంపెనీ షేర్ల విలువ 60 శాతం పడిపోయింది. ఎంఎన్‌సీ హెల్త్‌ కుంభకోణంలో, ఆడిటర్ల పాత్రపైనా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎన్‌ఎంసీతో పాటు బీఆర్‌ షెట్టి సంస్థలన్నిటిని అంతర్జాతీయ గ్లోబల్‌ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) ఆడిట్‌ చేసేది. ఈ సంస్థ ఆడిటర్లు, ఎన్‌ఎంసీలో ఇంత జరుగుతున్నా కనీసం అనమానం కూడా వ్యక్తం చేయక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపైనా యూఏఈ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


బీఓబీకి భారీగా బాకీ

షెట్టి భారత్‌లోనూ భారీగానే  అప్పులు చేశారు. ఒక్క బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) నుంచే 25.3 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,913 కోట్లు) వరకు అప్పులు చేశారు. ఇపుడు ఈ అప్పుల వసూలు కోసం బీఓబీ బెంగుళూరులోని కోర్టుని ఆశ్రయించింది. 


నాకే పాపం తెలియదు : షెట్టి

బీఆర్‌ షెట్టి మాత్రం ఈ మోసాలతో తనకే పాపం తెలియదంటున్నారు. కొంత మంది మాజీ ఉద్యోగులే తన పేరు మీద కంపెనీలు ఏర్పాటు చేసి, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఎడాపెడా అప్పులు చేసి తనను నిండా ముంచారని చెబుతున్నారు. తన నిర్వహణలోని కంపెనీల ఆర్థిక పనితీరునీ మేనేజ్‌మెంట్‌ టీమ్‌ తనకు తెలియకుండా మసిపూసి మారేడుకాయను చేసిందని ఆరోపిస్తున్నారు. 


Updated Date - 2020-05-21T07:06:13+05:30 IST