ఒకే లింగంలో త్రిమూర్తులు!

ABN , First Publish Date - 2021-01-22T06:20:39+05:30 IST

సృష్టి, స్థితి, లయకారకులైన బ్రహ్మ, విష్ణువు, శివుడు ఒకే ఆలయంలో కనిపించే అరుదైన చోటు తమిళనాడులోని శుచీంద్రం. పౌరాణికంగానే కాదు,

ఒకే లింగంలో త్రిమూర్తులు!

సృష్టి, స్థితి, లయకారకులైన బ్రహ్మ, విష్ణువు, శివుడు ఒకే ఆలయంలో కనిపించే అరుదైన చోటు తమిళనాడులోని శుచీంద్రం. పౌరాణికంగానే కాదు, శిల్పకళావైభవంలోనూ ఎన్నో విశిష్టతలున్న క్షేత్రం ఇది. ఇరవై ఆరు ముఖాలతో, యాభై రెండు చేతులతో దర్శనమిచ్చే శివుడి శిల్పం ఇక్కడ మాత్రమే దర్శనమిస్తుంది.


పవిత్రమైన 108 శైవ క్షేత్రాల్లో శుచీంద్రం ఒకటి. శైవులే కాదు, వైష్ణవులు కూడా పవిత్ర క్షేత్రంగా దీన్ని భావిస్తారు. త్రిమూర్తులు ఇక్కడ కొలువు తీరి ఉండడమే దీనికి కారణం.  తమిళనాడులోని కన్యాకుమారికి దాదాపు పదిహేను కిలోమీటర్ల దూరంలో శుచీంద్రం ఉంది. ఇక్కడి స్థాణుమలయన్‌ ఆలయంలోని గర్భగుడిలో ఒకే లింగంలో...  పై భాగంలో శివుడు,  మధ్య భాగంలో విష్ణువు, కింది భాగంలో బ్రహ్మ దర్శనమిస్తారు. ‘స్థాణు’ అంటే శివుడు, ‘మల్‌’ అంటే విష్ణువు, ‘అయన్‌’ అంటే బ్రహ్మ. ఈ ముగ్గురి పేర్ల మీదుగానే ఆలయానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. సుమారు ముప్ఫై దేవతామూర్తులు ఉన్న ఈ ఆలయంలోని మూల విరాట్‌ను ‘స్థాణుమలయన్‌ పెరుమాళ్‌ అని పిలుస్తారు.


త్రిమూర్తులు ఒక్క చోటే ఇలా దర్శనం ఇవ్వడం వెనుక ఒక పురాణ గాథ ఉంది. అనసూయాదేవిని పరీక్షించడానికి వచ్చిన బ్రహ్మ, విష్ణువు, శివుడు ఆమె పాతివ్రత్య ప్రభావంతో పసిబిడ్డలుగా మారిపోతారు. సరస్వతి, లక్ష్మి, పార్వతి చేసిన అభ్యర్థనపై త్రిమూర్తులను మామూలు రూపాల్లోకి అనసూయ మారుస్తుంది. ఆ ప్రదేశంలో స్వయంభూలింగ రూపంలో త్రిమూర్తులు కొలువు తీరారని స్థలపురాణం చెబుతోంది. మరో కథ ప్రకారం, అహల్యను వంచించిన దేవేంద్రుణ్ణి ఆమె భర్త గౌతమ మహర్షి శపిస్తాడు. ఆ శాపం నుంచి తనకు విముక్తి కలిగించాలని త్రిమూర్తులను ఇంద్రుడు వేడుకుంటాడు. వారి సూచన మేరకు శుచీంద్రంలో స్నానం ఆచరించి, శాపవిమోచన పొందుతాడు. అనంతరం అతను ఈ ఆలయం నిర్మించి, త్రిమూర్తులను ప్రతిష్ఠించాడనీ, ఇంద్రుడు శుచి పొందిన చోటు కాబట్టి ‘శుచీంద్రం’గా ఇది ప్రసిద్ధి చెందిందనీ చెబుతారు. దత్త క్షేత్రంగానూ దీనికి పేరుంది. విఘ్నేశ్వరిగా గణేశుడు స్ర్తీ రూపంలో ఇక్కడ కనిపించడం మరో విశేషం. ఈ ఆలయంలోని అమ్మవారి పేరు వలర్త నాయకి.


నాలుగువైపులా సమున్నతమైన గోపురాలతో ఉండే ఈ ఆలయ ప్రాంగణం అపూర్వమైన శిల్పాలకు నిలయం. ప్రధానంగా 26 ముఖాలు, 52 చేతులు ఉన్న శివుడి శిల్పం మరెక్కడా కనిపించని అద్భుతం. అలాగే 22 అడుగుల హనుమంతుడి విగ్రహం కూడా భక్తులను ఆకర్షిస్తుంది. సిందూరానికి బదులు వెన్నతో ఈ విగ్రహాన్ని అలంకరిస్తారు. స్వామి తోకకు వెన్న పూస్తారు. సీతను వెతుకుతూ లంకకు వెళ్ళిన హనుమంతుడి తోకకు రావణుడి సైనికులు నిప్పు పెట్టారనీ, కాలిన తోకవల్ల ఆయనకు ఎంతో బాధ కలిగిందనీ, ఆ బాధను నివారించడానికి స్వామికి వెన్న పూస్తే ఆయన అనుగ్రహిస్తాడనీ భక్తుల విశ్వాసం. 

Updated Date - 2021-01-22T06:20:39+05:30 IST