Sep 18 2021 @ 20:58PM

‘పంచతంత్రం’లో వేద‌వ్యాస్‌గా బ్ర‌హ్మానందం.. ఫస్ట్ లుక్ ఇదే

తెలుగు తెర‌పై ఎన్నో విల‌క్షణ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కులకు న‌వ్వుల‌ను పంచిన హాస్య‌బ్ర‌హ్మ బ్రహ్మానందం ‘పంచతంత్రం’ సినిమా కోసం క‌థ‌కుడిగా కొత్త అవ‌తారం ఎత్తారు. బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్ ప‌తాకాల‌పై అఖిలేష్ వ‌ర్ధ‌న్‌, సృజ‌న్ ఎర‌బోలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి హర్ష పులిపాక దర్శకుడు. బ్ర‌హ్మానందం ఈ చిత్రంలో వేదవ్యాస్ పాత్రలో నటిస్తున్నారని తెలుపుతూ.. ఆయన ఫ‌స్ట‌లుక్‌ను మేకర్స్ శ‌నివారం విడుద‌ల‌ చేశారు. న‌వ్వించ‌డ‌మే కాదు అవ‌స‌ర‌మైతే సెంటిమెంట్‌ను పండిస్తూ ప్రేక్ష‌కుల చేత క‌న్నీళ్లు పెట్టించ‌గ‌ల‌రు. త‌న న‌ట‌న‌తో మ‌న‌సుల్ని క‌దిలించ‌గ‌ల‌ర‌ని చాటి చెప్పేలా బ్ర‌హ్మానందం పాత్ర ఉంటుందని చిత్రయూనిట్ తెలిపింది. 


నిర్మాత‌లలో ఒకరైన అఖిలేష్ వ‌ర్ధ‌న్ మాట్లాడుతూ.. రెండేళ్ల విరామం త‌ర్వాత బ్ర‌హ్మానందంగారు న‌టిస్తున్న చిత్ర‌మిది. గ‌తంలో కొన్ని స‌న్నివేశాల‌ను ఆయ‌న‌పై తెర‌కెక్కించాం. ఇటీవ‌ల ప్రారంభ‌మైన షెడ్యూల్‌లో బ్యాలెన్స్‌గా ఉన్న స‌న్నివేశాల‌ను పూర్తిచేశాం. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్నాం. న‌వంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాం. కామెడీ క్యారెక్ట‌ర్‌కు భిన్నంగా స‌రికొత్త పాత్ర‌లో బ్ర‌హ్మానందంగారు క‌నిపించ‌బోతున్నారు..’’ అని తెలిపారు.